Share News

ఆత్మకూరులో గాలివాన

ABN , Publish Date - Apr 06 , 2025 | 11:58 PM

ఆత్మకూరులో ఆదివారం మధ్యాహ్నం గాలివాన బీభత్సం సృష్టించాయి. ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది.

ఆత్మకూరులో గాలివాన
గాలివాన బీభత్సానికి విరిగిపడిన మామిడి వృక్షం

పెనుగాలుల ధాటికి విరిగిపడిన మామిడి వృక్షాలు

క్వింటాళ్ల కొద్ది రాలిపడిన మామిడి కాయలు

ఆవేదన వ్యక్తం చేస్తున్న రైతులు

ఆత్మకూరు, ఏప్రిల్‌ 6(ఆంధ్రజ్యోతి): ఆత్మకూరులో ఆదివారం మధ్యాహ్నం గాలివాన బీభత్సం సృష్టించాయి. ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది. పెనుగాలులు వీచడంతో ఆత్మకూరు పట్టణంతో పాటు చుట్టుపక్కల గల పలు గ్రామాల్లోని మామిడి తోటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. బలమైన గాలుల ధాటికి పలు చోట్ల మామిడి వృక్షాలు నేలకూలగా క్వింటాళ్ల కొద్ది మామిడి కాయలు నేలరాలి తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. ఏడాదంతా ఎంతో కష్టపడి కంటికి రెప్పలా పంటను కాపాడుకుంటే చివరికి గాలివాన బీభత్సానికి మామిడి కాయలన్నీ రాలిపోవడంతో లక్షల రూపాయల నష్టం వాటిల్లిందని రైతులు వాపోతున్నారు. వాస్తవానికి ఈ ఏడాది మామిడి దిగుబడులు అంతంత మాత్రంగానే ఉన్నాయి. కొద్దోగొప్పో దిగుబడులు చేతికొచ్చే సమయానికి ప్రకృతి ప్రకోపానికి మామిడి కాయలు బలై దెబ్బతినడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యానశాఖ అధికారులు దెబ్బతిన్న మామిడి తోటలను సందర్శించి నష్టపరిహారాన్ని అంచనా వేసి ఆదుకోవాలని బాఽధిత రైతులు కోరుతున్నారు.

10క్వింటాళ్లకు పైగా మామిడి కాయలు నేలరాలాయి

ఆత్మకూరు మండలంలోని కురుకుంద గ్రామంలో మూడు ఎకరాల మామిడి తోటను కౌలుకు తీసుకుని సాగుచేస్తున్నాను. సుమారు రూ.4లక్షల వరకు పంట సస్యరక్షణ చర్యలకు ఖర్చు చేశాను. ప్రస్తుతం మధ్య సైజులో మామిడి కాయలు ఉన్నాయి. ఆదివారం పెనుగాలుల ధాటికి తోటలోని 16ఏళ్ల నాటి మామిడి వృక్షాలు నేలకొరిగాయి. 10క్వింటాళ్లకు పైగా మామిడి కాయలు నేలరాలాయి. రూ.3లక్షలకు పైగా నష్టం సంభవించింది. ప్రభుత్వం ఆదుకోవాలి.

- మోహబతుల్లా, మామిడి రైతు, ఆత్మకూరు

Updated Date - Apr 06 , 2025 | 11:58 PM