Share News

Administrative Crisis : వర్సిటీల్లో ఇన్‌చార్జిల పాలన ఎన్నాళ్లు?

ABN , Publish Date - Feb 03 , 2025 | 04:40 AM

ఇన్‌చార్జి వీసీలు పాలనపై పట్టు పెంచుకోకపోవడంతో అనేక సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయి. వీటికితోడు కొత్త సమస్యలు పుట్టుకొస్తున్నాయి.

Administrative Crisis : వర్సిటీల్లో ఇన్‌చార్జిల పాలన ఎన్నాళ్లు?

  • 17 వర్సిటీల్లో వీసీ పోస్టులు ఖాళీ

  • ప్రభుత్వం మారాక వీసీలు రాజీనామా

  • అప్పటి నుంచీ నియామకాలు కరువు

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

రాష్ట్రంలోని 17 విశ్వవిద్యాలయాల్లో పాలన కుంటుపడింది. పూర్తిస్థాయి వీసీలు లేకపోవడం, ఇన్‌చార్జి వీసీలు పాలనపై పట్టు పెంచుకోకపోవడంతో అనేక సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయి. వీటికితోడు కొత్త సమస్యలు పుట్టుకొస్తున్నాయి. వైసీపీ హయాంలో అడ్డగోలుగా నియమితులైన వీసీలు.. కూటమి సర్కారు వచ్చాక తమ పదవులకు రాజీనామాలు చేశారు. ఈ నేపథ్యంలో కొత్త వీసీల నియామకం చేపట్టాల్సి ఉన్నా.. ఉన్నత విద్యా మండలి అలసత్వంతో ఆలస్యమవుతున్నాయి. మరో నెల వరకు నియామకాలు చేపట్టే అవకాశం లేకుండా పోయింది.

రాష్ట్రంలో దాదాపు ఆరు నెలలుగా వీసీల్లేకుండా యూనివర్సిటీల పాలన సాగుతోంది. మూడు నెలల కిందట వీసీ పోస్టుల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానించినా.. భర్తీ ప్రక్రియ కొలిక్కి రాలేదు. ఈలోగా ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ అమల్లోకి రావడంతో నియామకం మళ్లీ వాయిదా పడింది. విద్యా శాఖ జాప్యంతో 17 విశ్వవిద్యాలయాలు ఇన్‌చార్జులతో నెట్టుకొస్తున్నాయి. రెగ్యులర్‌ వీసీలు లేక పాలన గాడితప్పుతోందన్న విమర్శలు వస్తున్నాయి. ఇటీవల కృష్ణా యూనివర్సిటీలో నిధుల దుర్వినియోగంపై వివాదం తలెత్తింది. రిజిస్ర్టార్‌పై స్వయంగా ప్రొఫెసర్లే ఫిర్యాదు చేసే స్థాయికి పరిస్థితి వెళ్లింది. అంతకముందు చాన్స్‌లర్‌ లేని ఆర్జీయూకేటీల్లో వసతుల లేమి బయటపడింది. ఫుడ్‌ పాయిజన్‌ అయి విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. అలాగే నాగార్జున యూనివర్సిటీలో నాసిరకం భోజనం పెడుతున్నారంటూ హాస్టల్‌ విద్యార్థులు ఆందోళనకు దిగారు. వర్సిటీల్లో పరీక్షలు సకాలంలో నిర్వహించడం లేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. అయినా వీసీల నియామకంలో ఉన్నత విద్యాశాఖ వేగంగా చర్యలు తీసుకోలేకపోతోంది.


ఖాళీ అయిన వీసీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీచేయగా 17 యూనివర్సిటీలకు 2,500కు పైగా దరఖాస్తులు అందాయి. అయితే రెండున్నర నెలల తర్వాతగానీ వాటిపై సెర్చ్‌ కమిటీలు ఏర్పాటుకాలేదు. ఇటీవల నియామకమైన సెర్చ్‌ కమిటీల సమావేశాలు చాలా వరకు ముగిశాయి. 4 వర్సిటీలు మినహా అన్ని సెర్చ్‌ కమిటీల సమావేశాలు పూర్తయ్యాయి. వాటి నివేదికలు ప్రభుత్వానికి అందినట్లు తెలిసింది. అయితే, ఈలోగా ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూలు విడుదల కావడంతో వీసీల నియామకానికి మళ్లీ బ్రేక్‌ పడింది. మార్చి 3న ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు విడుదలవుతాయి. ఆ తర్వాత రెండు మూడు రోజుల వరకు కోడ్‌ అమల్లో ఉంటుంది. అంటే మరో నెల రోజుల వరకు వీసీల నియామకం జరిగే అవకాశం లేదు.


మూకుమ్మడిగా రాజీనామాలు

గత ప్రభుత్వంలో నియమితులైన వీసీలు కూటమి అధికారంలోకి రాగానే మూకుమ్మడిగా రాజీనామాలు చేశారు. దీంతో ఒకేసారి 17 వర్సిటీల్లో వీసీ పోస్టులు ఖాళీ అయ్యాయి. అయితే వెంటనే ఆ ఖాళీలను భర్తీ చేయకుండా ఉన్నత విద్యాశాఖ నిర్లక్ష్యం చేసింది. గత ప్రభుత్వంలో నియామకమైన ఉన్నత విద్యామండలి వైస్‌ చైర్మన్‌కు.. కూటమి ప్రభుత్వం మండలి ఇన్‌చార్జ్‌ చైర్మన్‌ పదవిని కట్టబెట్టింది. అప్పటి నుంచీ ఉన్నత విద్యాశాఖలో ఏ నిర్ణయం సకాలంలో తీసుకోలేదు. పైగా వైస్‌ చైర్మన్‌గా ఉన్న కె. రామ్మోహన్‌రావు వీసీ పోస్టుకు దరఖాస్తు చేసుకున్నారు. మండలి వైస్‌ చైర్మన్‌గా, ఇన్‌చార్జ్‌ చైర్మన్‌గా ఉంటూ ఒక యూనివర్సిటీ వీసీ పోస్టుకు దరఖాస్తు చేసుకోవడంపైనా విమర్శలు వచ్చాయి. మరోవైపు యూనివర్సిటీలను ఆయన పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఏదో ఒకరోజు తనను పంపించేస్తారంటూ ఫైళ్లన్నీ పక్కనపెట్టేశారు. ఈ క్రమంలో వీసీల నియామక ప్రక్రియలో తీవ్ర జాప్యం జరిగింది. వచ్చే విద్యా సంవత్సరంలో ప్రవేశ పరీక్షలకు సంబంధించి కన్వీనర్ల నియామకంపైనా ఇది ప్రభావం చూపనుందని ఉన్నత విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి

Drunk Man : ముద్రగడ నివాసంలో ఓ తాగుబోతు భీభత్సం...

Botsa Satyanarayana: ఉత్తరాంధ్రతోపాటు సీమకు అన్యాయం

Kondapalli Srinivas: అద్భుతం.. అస్సలు ఊహించలేదు.. బడ్జెట్‌పై మంత్రి కీలక వ్యాఖ్యలు

Read Latest AP News and Telugu News

Updated Date - Feb 03 , 2025 | 04:40 AM