Elephant Attack Horror: మన్యంలో వ్యక్తిపై ఏనుగుల దాడి
ABN , Publish Date - Apr 15 , 2025 | 04:52 AM
పార్వతీపురం మన్యం జిల్లా సింగిడి గ్రామంలో ఏనుగులు ప్రవేశించి ఒక గ్రామస్తునిపై దాడి చేశాయి అటవీశాఖ సిబ్బంది వెంటనే స్పందించి బాధితుడిని రక్షించి ఆసుపత్రికి తరలించారు

భామిని, ఏప్రిల్ 14(ఆంధ్రజ్యోతి): పార్వతీపురం మన్యం జిల్లా భామిని మండలం సింగిడి గ్రామంలో సోమవారం ఓ వ్యక్తిపై ఏనుగులు దాడి చేశాయి. సింగిడి గ్రామంలో సోమవారం సాయంత్రం నాలుగు గజరాజులు హల్‌చల్ చేశాయి. వాటిని చూసేందుకు గ్రామస్థులు ఎగబడ్డారు. అదే గ్రామానికి చెందిన శంకర్ పూజారి అనే వ్యక్తి ఏనుగులకు అరటి గెల ఇవ్వబోయాడు. అతన్ని ఏనుగులు పొలాల్లోకి ఈడ్చుకెళ్లగా ఆ ప్రాంతంలోని బురదలో చిక్కుకున్న శంకర్ అపస్మాకర స్థితికి చేరాడు. ఈ విషయం తెలుసుకున్న అటవీశాఖకు చెందిన ట్రాకర్స్ ఆ ప్రాంతానికి చేరుకుని తీవ్రంగా శ్రమించి ఏనుగులను ఆ ప్రదేశం నుంచి తరలించారు. వెంటనే శంకర్ వద్దకు చేరుకుని లేపగా.. స్పృహలోకి వచ్చాడు. హుటాహుటిన భామిని పీహెచ్‌సీకి, అక్కడి నుంచి సీతంపేట సీహెచ్‌సీకి తరలించారు.