Nara Lokesh: ఈ నెలలోనే డీఎస్సీ నోటిఫికేషన్
ABN , Publish Date - Mar 04 , 2025 | 04:59 AM
పాఠశాల విద్యలో విప్లవాత్మక సంస్కరణలు తెస్తున్నట్టు మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ఈ నెలలోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వనున్నట్టు చెప్పారు.

పాఠశాల విద్యలో విప్లవాత్మక సంస్కరణలు.. దేశంలో ఏపీ నంబర్1 కావాలి
త్వరలో జీవో 117కు ప్రత్యామ్నాయం.. ఎమ్మెల్యేల వర్క్‌షా్‌పలో లోకేశ్
అమరావతి, మార్చి 3(ఆంధ్రజ్యోతి): పాఠశాల విద్యలో విప్లవాత్మక సంస్కరణలు తెస్తున్నట్టు మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ఈ నెలలోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వనున్నట్టు చెప్పారు. ఏపీ మోడల్ ఎడ్యుకేషన్, జీవో 117కు ప్రత్యామ్నాయం, పాఠశాలల్లో మౌలిక సదుపాయాలపై కూటమి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సోమవారం ఉండవల్లిలోని నివాసంలో వర్క్‌షాప్ నిర్వహించారు. విద్యారంగంలో ఎలాంటి మార్పులు చేపడితే బాగుంటుందనే దానిపై వారి నుంచి అభిప్రాయాలు స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వ విద్యా వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేసి, దేశంలోనే ఏపీ విద్యా వ్యవస్థను నంబర్ 1 చేయాలన్న సీఎం చంద్రబాబు లక్ష్యానికి అనుగుణంగా సంస్కరణలకు శ్రీకారం చుట్టామన్నారు. తాను యువగళం పాదయాత్ర చేస్తున్నప్పుడు జీవో 117 వల్ల కలిగిన దుష్ఫలితాల గురించి అనేక మంది తన దృష్టికి తెచ్చారని గుర్తుచేశారు. జీవో 117 పేరుతో వైసీపీ ప్రభుత్వం చేసిన నిర్వాకం వల్ల గత ఐదేళ్లలో ప్రభుత్వ పాఠశాలల్లో 12 లక్షల మంది విద్యార్థులు తగ్గిపోయారన్నారని, వారంతా ప్రైవేటు పాఠశాలల్లో చేరారని చెప్పారు. నేషనల్ అచీవ్‌మెంట్ సర్వే నివేదిక ప్రకారం జాతీయ సగటుతో పోలిస్తే ఏపీ పాఠశాల విద్యలో ఎక్కువ అభ్యసన అంతరం ఏర్పడిందన్నారు. 3వ తరగతి విద్యార్థుల్లో.. భాషా సబ్జెక్టుల్లో 57శాతం మంది, గణితంలో 54శాతం మంది మాత్రమే అంచనా మేరకు మెరుగ్గా ఉన్నారన్నారు. ఇది జాతీయ సగటుతో పోలిస్తే 5 నుంచి 8శాతం తక్కువని చెప్పారు. పైతరగతుల్లో ఈ అంతరం ఇంకా ఎక్కువగా ఉందన్నారు. అసర్-2024 నివేదిక రాష్ట్రంలో ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీలో లోపాలను బహిర్గతం చేసిందన్నారు. పెర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ నివేదిక ప్రకారం టీచర్ విద్య శిక్షణలో ఏపీ 60 పాయింట్లు సాధించిందన్నారు.
నియోజకవర్గానికో మోడల్ స్కూల్!
గత వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పులను సరిదిద్దేందుకు జీవో 117 రద్దుచేసి, ప్రత్యామ్నాయం తీసుకొచ్చే ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి లోకేశ్ తెలిపారు. సీబీఎ్‌సఈపై విద్యార్థులకు మాక్ పరీక్ష నిర్వహిస్తే 90శాతం మంది ఫెయిల్ అయ్యారని తెలిపారు. ఐబీ సిలబస్ పేరుతో రూ.5 కోట్లు దుర్వినియోగం చేశారని ఆరోపించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అందరం కలిసికట్టుగా పనిచేద్దామని పిలుపునిచ్చారు. విద్యారంగంలో ఉత్తమ విధానాల అమలుకు టీచర్లను విదేశాలకు పంపుతామన్నారు. అంతర్జాతీయంగా వస్తున్న మార్పులపై కొందరు టీచర్లు పోలాండ్‌లో అధ్యయనం చేస్తారని తెలిపారు. దేశంలోనే అత్యున్నత ప్రమాణాలతో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక మోడల్ స్కూల్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. రాబోయే ఐదేళ్లలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూటర్ ల్యాబ్స్, బెంచీలు, తాగునీరు, మరుగుదొడ్లు పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెస్తామన్నారు. గంజా యి, డ్రగ్స్ నివారణకు ‘డ్రగ్స్ వద్దు బ్రో’ పేరుతో ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఈ నెలలోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని మంత్రి వెల్లడించారు.
ప్రజాప్రతినిధుల సూచనలు ఇవీ..
ప్రభుత్వ పాఠశాలల్లో కనీస స్థాయిలో అయినా విద్యార్థుల సంఖ్య ఉంటే ఇబ్బందులుండవని, దీనికి ఎమ్మెల్యేలు చొరవ తీసుకోవాలని కొణతాల రామకృష్ణ అన్నారు. శివారు ప్రాంతాలున్న గ్రామాల్లో విద్యార్థులకు రవాణా ఇబ్బంది లేకుండా చూడాలని బండారు సత్యనారాయణమూర్తి కోరారు. మోడల్ ప్రైమరీ స్కూల్‌కు కనీస విద్యార్థుల సంఖ్య 45 చేయాలని లోకం మాధవి సూచించారు. గురుకుల పాఠశాలలు పెంచాలని కొవ్వూరు ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు కోరారు. ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీల్లోని విద్యార్థులకు ఎంసెట్, ఐఐటీ కోచింగ్ నిర్వహించాలని కొండబాబు కోరారు. అదనపు తరగతి గదుల నిర్మాణానికి సమగ్ర ప్రణాళిక అమలుచేయాలని కాల్వ శ్రీనివాసులు సూచించారు.