Nara Lokesh : ఈ నెల్లోనే మెగా డీఎస్సీ.. పక్కా!

ABN, Publish Date - Mar 05 , 2025 | 04:21 AM

ఈ నెలలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేస్తామని, ఎట్టి పరిస్థితుల్లోనూ నిరుద్యోగులను విస్మరించబోమని మంత్రి నారా లోకేశ్‌ స్పష్టం చేశారు.

 Nara Lokesh : ఈ నెల్లోనే మెగా డీఎస్సీ.. పక్కా!
  • ఎట్టిపరిస్థితిలోనూ నిరుద్యోగులను విస్మరించం: మంత్రి లోకేశ్‌

అమరావతి, మార్చి 4(ఆంధ్రజ్యోతి): ఈ నెలలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేస్తామని, ఎట్టి పరిస్థితుల్లోనూ నిరుద్యోగులను విస్మరించబోమని మంత్రి నారా లోకేశ్‌ స్పష్టం చేశారు. శాసనమండలిలో మంగళవారం వైసీపీ సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. మెగా డీఎస్సీ కోసం నిరుద్యోగ యువకులు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారని, వారందరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వం ఒక్కసారి కూడా డీఎస్సీ నిర్వహించలేదని విమర్శించారు. రాష్ట్రంలో 1994 నుంచి 2,60,194 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేశారని, వీటిలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు 1,80,272 పోస్టులు భర్తీ చేసిందని తెలిపారు. డీఎస్సీ కోసం టెట్‌ కూడా నిర్వహించామని 3.68 లక్షల మంది పరీక్షలకు హాజరుకాగా, 1.87 లక్షల మంది అర్హత సాధించారని లోకేశ్‌ చెప్పారు. ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్‌ నివేదిక త్వరలోనే రాబోతోందన్నారు. కాగా, తల్లికి వందనం పథకాన్ని త్వరలోనే అమలు చేయనున్నట్టు చెప్పారు. త్వరలోనే మార్గదర్శకాలు ప్రకటిస్తామన్నారు.


అమర్‌నాథ్‌, డ్రైవర్‌ హత్యలపై చర్చకు సిద్ధమా?

జగన్‌ హయాంలో జరిగిన బీసీ విద్యార్థి అమర్‌నాథ్‌ గౌడ్‌, దళిత డ్రైవర్‌ హత్యలపై వైసీపీ సభ్యులు చర్చకు సిద్ధమా? అని మంత్రి లోకేశ్‌ సవాల్‌ విసిరారు. 2014-2019 మధ్య చేనేతలకు ఇచ్చిన హామీల విషయంలో మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ సభ్యులు ఇష్టానుసారంగా మాట్లాడి బయటకు వెళ్లిపోతారని.. కానీ, ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత తమపై ఉందని అన్నారు. ‘‘2014-19 పాలన గురించి బొత్స మాట్లాడుతున్నారు. ముందు.. వైసీపీ హయాంలో జరిగిన అమర్‌నాథ్‌ గౌడ్‌ హత్య గురించి, వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు తన దళిత డ్రైవర్‌ను చంపి డోర్‌ డెలివరీ చేసిన అంశం గురించి మాట్లాడదాం. ప్రతిపక్ష సభ్యులు దుష్ప్రచారం చేసి పారిపోవడం సరికాదు’’ అని లోకేశ్‌ అన్నారు.

Updated Date - Mar 05 , 2025 | 07:57 AM