Vallabhaneni Vamsi key ide: నేపాల్లో కిడ్నాప్ నిందితులు
ABN , Publish Date - Apr 07 , 2025 | 02:46 AM
ముదునూరి సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితుడు కోమ్మా కోటేశ్వరరావు సహా నలుగురు ఇంకా పరారీలో ఉన్నారు. వారు నేపాల్లో తలదాచుకొని పోలీసుల కదలికలను ఫోన్ ద్వారా తెలుసుకుంటున్నట్లు సమాచారం

వంశీ ముఖ్య అనుచరుడు కొమ్మా కోట్లు, మరో ముగ్గురూ అక్కడే
రాత్రి పూట సన్నిహితులకు ఫోన్లు
కేసు వివరాలు, పోలీసు కదలికలపై ఆరా
పసిగట్టిన నిఘా వర్గాలు
(విజయవాడ-ఆంధ్రజ్యోతి)
ముదునూరి సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో మిగిలిన నిందితులు నేపాల్లో తిరుగుతున్నట్లు తెలిసింది. ఈ కేసులో ఇంకా అరెస్టు కావలసిన ప్రధాన నిందితుల్లో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ముఖ్య అనుచరుడు కొమ్మా కోటేశ్వరరావు అలియాస్ కోట్లు ఒకరు. అతడితోపాటు మరి కొంతమంది నేపాల్లో ఉన్నారని పోలీసులకు సమాచారం అందింది. ఈ కేసులో మొత్తం 12 మంది నిందితులు ఉండగా.. వంశీ, వెలినేని శివరామకృష్ణ ప్రసాద్, గంటా వీర్రాజు, నిమ్మ చలపతి, వేల్పూరు వంశీబాబులను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వాళ్లంతా విజయవాడలోని జిల్లా జైల్లో ఉన్నారు. ఏ-5గా ఉన్న ఓలుపల్లి మోహనరంగారావు అలియాస్ రంగాను గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి వ్యవహారంలో సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. అతడిని కిడ్నాప్ కేసులో పీటీ వారెంటుపై కోర్టులో హాజరుపరచడానికి పోలీసులు రంగం సిద్ధం చేశారు. ఈ కేసులో రంగాతోపాటు కోట్లుదీ సమాన పాత్ర. సత్యవర్ధన్‌కు సంబంధించిన మొత్తం సమాచారాన్ని కోట్లే సేకరించి రంగాతో పంచుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. వంశీని అరెస్టు చేసిన మరుక్షణమే ఇద్దరూ ఊరు దాటేశారు.
రంగా ఇటీవల ఏలూరులో సీఐడీ బృందానికి దొరికిపోయాడు. మిగతా ఆరుగురిలో విశాఖకు చెందిన ఇద్దరు నిందితులు శ్రీకాకుళం వైపు పారిపోయినట్లు పోలీసులు గుర్తించారు. నేపాల్లో తలదాచుకున్న కోట్లు, మరో ముగ్గురు.. అక్కడి నుంచే సన్నిహితులకు ఫోన్ చేసి కేసు విషయాలను, పోలీసుల కదలికలను తెలుసుకుంటున్నట్లు సమాచారం. కోట్లు రాత్రి సమయాల్లో ఫోన్ చేస్తున్నట్లు నిఘా వర్గాలు పసిగట్టాయి. నలుగురూ నేపాల్లో ఎక్కడుంటున్నారో ఆరా తీస్తున్నాయి. పక్కా వివరాలు అందగానే అరెస్టు చేసే దిశగా పోలీసులు అడుగులు వేస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.
ఈ వార్తలు కూడా చదవండి:
Krishna River Tragedy: పండగ వేళ ఘోర విషాదం.. కృష్ణానదిలో పడి.. బాబోయ్..
Mahesh Kumar Goud: మోదీ, అమిత్ షా అనుమతి లేకుండా బండి సంజయ్ టిఫిన్ కూడా చెయ్యరు: మహేశ్ కుమార్ గౌడ్