Nandamuri Balakrishna: పద్మ పురస్కారంపై స్పందించిన బాలయ్య బాబు
ABN , Publish Date - Jan 26 , 2025 | 04:20 PM
Nandamuri Balakrishna: హిందుపురం ఎమ్మెల్యే, నటసింహం నందమూరి బాలకృష్ణను పద్మ పురస్కారం వరించింది. సినీ రంగానికి ఆయన చేసిన సేవలకుగాను పద్మ భూషణ్ పురస్కారాన్ని ఆయనకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

అమరావతి, జనవరి 26: సినీ రంగానికి విశిష్టమైన సేవలందించినందుకుగాను.. నట సింహం నందమూరి బాలకృష్ణను పద్మభూషణ్ పురస్కారం వరించింది. ఈ నేపథ్యంలో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆదివారం స్పందించారు. తనకు ఈ పురస్కారం ప్రకటించిన నేపథ్యంలో భారత ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా తనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు.
తన ఈ సుదీర్ఘ ప్రయాణంలో పాలుపంచుకున్న తోటి నటీనటులు, సాంకేతిక నిపుణులు, నిర్మాతలు, పంపిణీదారులు, ఎగ్జిబిటర్లు, కుటుంబ సభ్యులతోపాటు యావత్ చలనచిత్ర రంగానికి ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. తన తండ్రి స్వర్గీయ నందమూరి తారకరామారావు నుంచి ఆయన వారసుడిగా నేటి వరకు తన వెన్నంటి ఉండి తనను ప్రోత్సహిస్తున్న తన అభిమానులకు, తనపై విశేష ఆధారాభిమానాలు కురిపిస్తున్న అశేష ప్రేక్షక లోకానికి సదా రుణపడి ఉంటానని ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ తెలిపారు.
అలాగే తన తోటి పద్మ పురస్కార గ్రహీతలందరికీ ఈ సందర్భంగా ఆయన అభినందనలు తెలియజేశారు. మరోవైపు పద్మభూషణ్ పురస్కారానికి బాలకృష్ణ ఎంపిక కావడంతో ఆయనకు అభినందనలు వెల్లువెత్తుతోన్నాయి. అందులోభాగంగా వివిధ రంగాలకు చెందిన ప్రముఖలు ఆయన్ని అభినందనలతో ముంచెత్తుతోన్నారు. ప్రతిష్టాత్మక పద్మ పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం శనివారం ప్రకటించిన సంగతి తెలిసిందే.
For AndhraPradesh News And Telugu News