Share News

AP Police: పోసానిని కస్టడీకి ఇవ్వండి

ABN , Publish Date - Mar 12 , 2025 | 06:58 AM

సినీ నటుడు పోసాని కృష్ణమురళిని వారం రోజులపాటు తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పల్నాడు జిల్లా నరసరావుపేట 2 టౌన్‌ పోలీసులు స్థానిక మొదటి అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

AP Police: పోసానిని కస్టడీకి ఇవ్వండి

  • నరసరావుపేట కోర్టులో పోలీసుల పిటిషన్‌

  • కౌంటర్‌ దాఖలు కోసం నేటికి వాయిదా

  • మరో రెండు కేసుల్లో కృష్ణమురళికి బెయిల్‌ ఇచ్చిన బెజవాడ, ఆదోని కోర్టులు

నరసరావుపేట లీగల్‌/విజయవాడ/కర్నూలు లీగల్‌, మార్చి 11(ఆంధ్రజ్యోతి): సినీ నటుడు పోసాని కృష్ణమురళిని వారం రోజులపాటు తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పల్నాడు జిల్లా నరసరావుపేట 2 టౌన్‌ పోలీసులు స్థానిక మొదటి అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై కౌంటర్‌ దాఖలు కోసం విచారణను కోర్టు బుధవారానికి వాయిదా వేసింది. ఈ నెల 3న అన్నమయ్య జిల్లా రాజంపేట సబ్‌జైలు నుంచి పీటీ వారెంట్‌పై పోసానిని తీసుకువచ్చిన నరసరావుపేట పోలీసులు స్థానిక కోర్టులో హాజరు పరిచారు. దీంతో న్యాయస్థానం పోసానికి రిమాండ్‌ విధించింది. ఈ నేపథ్యంలో పోలీసులు కేసును సమగ్రంగా విచారించేందుకు పోసానిని వారం రోజులపాటు కస్టడీకి అప్పగించాలని కోరుతూ ఈ నెల 3నే పిటిషన్‌ దాఖలు చేశారు. ఇరుపక్షాల వాదనలను విన్న న్యాయస్థానం రెండు రోజులపాటు(ఈ నెల 8, 9 తేదీల్లో) పోసానిని నరసరావుపేట 2 టౌన్‌ పోలీసుల కస్టడీకి అనుమతించింది.


అయితే, ఆ రెండు రోజుల్లో విజయవాడ భవానీపురం పోలీసులు పోసానిని పీటీ వారెంట్‌పై తీసుకువెళ్లడంతో పోలీస్‌ కస్టడీకి తీసుకోవడం సాధ్యపడలేదు. దీంతో తాజాగా మరోసారి కస్టడీ పిటిషన్‌ దాఖలు చేశారు. ఇక కర్నూలు జైల్లో ఉన్న పోసానికి విజయవాడలోని చీఫ్‌ జ్యుడీషియల్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. అదేవిధంగా కర్నూలు జిల్లా ఆదోనిలో నమోదైన కేసులోనూ పోసానికి బెయిల్‌ లభించింది. ఆదోని అదనపు జ్యూడిషియల్‌ ఫస్ట్‌ క్లాస్‌ ఇన్‌చార్జి మెజిస్ర్టేట్‌ అపర్ణ మంగళవారం బెయిల్‌ ఆదేశాలు జారీ చేశారు.

Updated Date - Mar 12 , 2025 | 06:58 AM

News Hub