Share News

Justice Yashwant: జడ్జి ఇంట్లో నోట్ల కట్టలు.. ట్విస్ట్ మామూలుగా లేదు..

ABN , Publish Date - Mar 21 , 2025 | 09:54 PM

ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో భారీగా నోట్ల కట్టలు బయటపడ్డాయంటూ మీడియాతో పాటు సోషల్ మీడియాలో కూడా వార్తలు వస్తున్నాయి. జడ్జి ఇంట్లో మంటలు ఆర్పడానికి వెళ్లిన అగ్నిమాపక సిబ్బంది ఆ డబ్బు కట్టల్ని చూసినట్లు ప్రచారం జరుగుతోంది.

Justice Yashwant: జడ్జి ఇంట్లో నోట్ల కట్టలు.. ట్విస్ట్ మామూలుగా లేదు..
Justice Yashwant Varma

ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ ఘటనలో భారీ ట్విస్ట్ చోటుచేసుకుంది. ఆయన ఇంట్లో భారీగా డబ్బుల కట్టలు బయటపడ్డాయంటూ ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆ ప్రచారం ప్రకారం.. జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పేందుకు ఇంటికి వెళ్లారు. ఇంట్లోకి వెళ్లి మంటలు ఆర్పుతుండగా అక్కడ భారీగా డబ్బుల కట్టలు కనిపించాయి. అంత పెద్ద మొత్తంలో డబ్బు కట్టల్ని చూసి వారు షాక్ అయిపోయారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అక్కడ పట్టుబడిన నగదు మొత్తం.. లెక్కల్లో చూపని నగదుగా ఐటీ అధికారులు గుర్తించారు. ఇంత డబ్బును న్యాయమూర్తి ఎలా సంపాదించాడనే దానిపై ఐటీ అధికారులు ఆరా తీస్తున్నారు.


అంతా ఉత్తిదే..

ఢిల్లీ అగ్నిమాపక సేవల అధికారి అతుల్ గర్గ్ ఈ సంఘటనపై స్పందించారు. జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో భారీగా డబ్బులు దొరికాయన్న దానిపై క్లారిటీ ఇచ్చారు. జడ్జి ఇంట్లో మంటలు ఆర్పడానికి వెళ్లిన అగ్నిమాపక సిబ్బందికి ఎటువంటి డబ్బు కనిపించలేదని స్పష్టం చేశారు. మీడియాలో, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. ఆయన మాట్లాడుతూ.. ‘ మార్చి 14వ తేదీన.. రాత్రి 11.35 గంటలకు కంట్రోల్ రూముకు ఆ ఇంటినుంచి ఫోన్ వచ్చింది. ఇద్దరు అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడికి వెళ్లారు. వాళ్లు రాత్రి 11.43 గంటలకు అక్కడికి వెళ్లారు. ఇంట్లోని స్టోర్ రూములో మంటలు చెలరేగాయి. అక్కడ స్టేషనరీతోపాటు ఇతర ఇంటి వస్తువులు ఉన్నాయి. మంటలు ఆర్పడానికి 15 నిమిషాలు పట్టింది. మంటలు ఆర్పిన వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాము. తర్వాత ఆ ఇద్దరు అగ్నిమాపక సిబ్బంది అక్కడినుంచి వచ్చేశారు’ అని అన్నారు.


ఎవరీ యశ్వంత్ వర్మ

యశ్వంత్ వర్మ 1969, జనవరి 6వ తేదీన అలహాబాద్‌లో జన్మించారు. మధ్య ప్రదేశ్ రేవా యూనివర్శిటీలో న్యాయవాద విద్యను అభ్యసించారు. 1992లో అడ్వకేట్‌గా ఎన్‌రోల్ అయ్యారు. 2006 నుంచి 2012 వరకు అలహాబాద్ హైకోర్టు స్పెషల్ కౌన్సిల్‌లో పని చేశారు. 2012నుంచి 2013 వరకు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ స్టాండింగ్ కౌన్సిల్‌లో పని చేశారు. 2014లో అక్టోబర్ 13వ తేదీన అలహాబాద్ అడిషినల్ జడ్జిగా నియమితులయ్యారు. 2016, ఫిబ్రవరి 1వ తేదీన అదే కోర్టుకు శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2021అక్టోబర్ నెలలో ఢిల్లీ హైకోర్టు జడ్జిగా నియమితులయ్యారు. ప్రస్తుతం కుటుంబంతో పాటు ఢిల్లీలోనే ఉంటున్నారు.


ఇవి కూడా చదవండి:

Salary Hike: సీఎం సహా ఎమ్మెల్యేలందరికీ 100 శాతం వేతనాల పెంపు

Amit Shah: మెడికల్, ఇంజనీరింగ్ విద్యను తమిళంలో అందిస్తాం: అమిత్‌షా

MLAs: ఈ ఎమ్మెల్యేల సంపద తెలిస్తే.. నోరెళ్లబెట్టాల్సిందే

Updated Date - Mar 21 , 2025 | 10:00 PM