పశ్చిమ పల్లెల్లో దాహం కేకలు
ABN , Publish Date - Apr 09 , 2025 | 01:26 AM
జిల్లాలోని పశ్చిమప్రాంత ప్రజలు నీటి కోసం అల్లాడుతున్నారు. తాగేందుకే కాక సాధారణ అవసరాలకు కూడా నీరు సరిపడా దొరక్క అవస్థలు పడుతున్నారు. మనుషులతోపాటు పశుసంపద కూడా తల్లడిల్లుతున్న పరిస్థితి అనేక గ్రామాల్లో కనిపిస్తోంది. కొన్నిచోట్ల అధికార యంత్రాంగం ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తున్నా అది అరకొరగానే ఉంటోంది.

తాగునీటికే కాక సాధారణ వాడకానికీ తప్పని ఇక్కట్లు
పశుసంపదకూ తీవ్రంగానే సమస్య
ట్యాంకర్లతో అరకొరగా సరఫరా
క్షేత్రస్థాయి పరిస్థితి గుర్తించని యంత్రాంగం
రూ.కోట్ల పాత బిల్లులు పెండింగ్‌తో ప్రస్తుతం సరఫరాకు వెనకడుగు
పలు గ్రామాల్లో ట్యాంకర్ల వద్ద నీరు పట్టుకునేందుకు మహిళల అవస్థలు
జిల్లాలోని పశ్చిమప్రాంత ప్రజలు నీటి కోసం అల్లాడుతున్నారు. తాగేందుకే కాక సాధారణ అవసరాలకు కూడా నీరు సరిపడా దొరక్క అవస్థలు పడుతున్నారు. మనుషులతోపాటు పశుసంపద కూడా తల్లడిల్లుతున్న పరిస్థితి అనేక గ్రామాల్లో కనిపిస్తోంది. కొన్నిచోట్ల అధికార యంత్రాంగం ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తున్నా అది అరకొరగానే ఉంటోంది. ఆ నీటి కోసం ట్యాంకర్ల వద్ద మహిళలు, పిల్లలు యుద్ధాలు చేస్తున్నారు. వేసవి ఆరంభంలోనే సమస్య తీవ్రంగా ఉండగా.. మే, జూన్ నెలల్లో పరిస్థితిని ఊహించుకొని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పశ్చిమప్రాంతంలో ‘ఆంధ్రజ్యోతి’ బృందం మంగళవారం క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించగా నీటి ఇక్కట్ల తీవ్రత కనిపించింది.
ఒంగోలు, ఏప్రిల్ 8 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో శాశ్వత రక్షిత తాగునీటి సరఫరా అంతంత మాత్రం కాగా పశ్చిమ ప్రాంతంలో మరింత అధ్వానం. అధికశాతం గ్రామాల్లో తాగేందుకే కాక సాధారణ అవసరాలకు, పశుసంపదకు కూడా భూగర్భ జలాలే ఆధారం. వెయ్యి అడుగుల లోతున మోటార్లు అమర్చే డీప్ బోర్లు గ్రామాల్లో తాగునీటికి ఉపకరిస్తుండగా సాధారణ అవసరాలకు స్థానికంగా ఉన్న సాధారణ, పొలాల్లో ఉండే వ్యవసాయ బోర్లే దిక్కు. కొన్ని గ్రామాలకు సామూహిక రక్షిత నీటి పథకాల (సీపీడబ్ల్యూ) ద్వారా సరఫరా జరుగుతోంది. అయితే ఎన్‌ఏపీ, చందవరం, ముటుకుల, పుల్లలచెరువు, ఎర్రగొండపాలెం తదితర తాగునీటి పథకాల నిర్వహణ సరిలేదు. దీంతో వాస్తవంగా ఆ పథకం ద్వారా నీటి సరఫరా చేయాల్సిన వాటిలో సగం గ్రామాలకు కూడా సరిగా అందడం లేదు. నీరు వెళ్తున్న గ్రామాలకు సైతం రోజూ ఇచ్చే పరిస్థితి లేదు. కొన్ని గ్రామాలకు మూడు రోజులకు ఒకసారి మరికొన్ని గ్రామాలకు వారానికి ఒకసారి ఇస్తున్న పరిస్థితి.
అడుగంటిన భూగర్భ జలం
ముండ్లమూరు మండలంలో ఎన్‌ఏపీ పరిఽధిలోని పది గ్రామాలకు వారానికి ఒకసారి మాత్రమే నీటి సరఫరా జరుగుతోంది. ఇక మార్కాపురం డివిజన్‌లోని గ్రామాలకు భూగర్భజలమే దిక్కు కాగా ఆ ప్రాంతంలో రోజురోజుకూ అడుగంటిపోతోంది. జిల్లాలో మార్చి ఆఖరుకు సగటున 16.05 మీటర్లకు చేరింది. గత డిసెంబర్‌లో 11.22 మీటర్లుగా ఉండగా మూడు మాసాలలో సగటున నాలుగు మీటర్లు మేర పడిపోయింది. పశ్చిమప్రాంతంలోని దోర్నాల మండలంలో 66.93 మీటర్లకు వెళ్లింది. డిసెంబరులో అక్కడ 43.27 మీటర్లు ఉండగా మార్చి ఆఖరుకు దాదాపు 24 మీటర్లు తగ్గిపోయింది. గిద్దలూరు మండలంలో 50.48 మీటర్లకు, వైపాలెం మండలంలో 47.76 మీటర్లు, పెద్దారవీడులో 38.17, పుల్లలచెరువులో 34.86, పొదిలిలో 32.75 మీటర్లకు పడిపోగా చాలా మండలాల్లో 20 నుంచి 30 మీటర్ల లోతుకు భూగర్భ జలమట్టం పడిపోయింది. దీంతో ఐదారు వందల అడుగుల లోతున తవ్విన బోర్లు సైతం ఎండిపోయి నీరు రావడం లేదు. దీంతో సమస్య తీవ్రంగా కనిపిస్తోంది.
200 గ్రామాల్లో నీటి కష్టాలు
పశ్చిమ ప్రాంతంలోని సుమారు 200 గ్రామాల్లో ఇప్పటికే ప్రజానీకం, పశుసంపద నీటి ఇక్కట్లు ఎదుర్కొంటున్న పరిస్థితి. చాలా గ్రామాల్లో పొలాల్లో ఉన్న వ్యవసాయ బోర్లపై జనం ఆధారపడుతున్నారు. ఇళ్ల వద్ద డ్రమ్ములు పెట్టుకొని వ్యవసాయ బోర్ల నుంచి ట్యాంకర్లతో తెచ్చి నింపుకొని వాడుకుంటున్నారు. ఇక సమస్య మరింత తీవ్రంగా ఉండి ప్రత్యామ్నాయ మార్గాలు లేని కొన్ని గ్రామాలకు మాత్రమే అధికారులు అరకొరగా ట్యాంకర్లతో సరఫరా చేస్తున్నారు. అలా ప్రస్తుతం తొమ్మిది మండలాల్లోని 69 ఆవాసాలకు రోజుకు 530 ట్యాంకర్ల నీటిని ఇస్తున్నారు. గరిష్ఠంగా వైపాలెం మండలంలో 14 ఆవాసాలకు నీరు తోలుతుండగా పెద్దారవీడులో పది, దొనకొండలో పది, దోర్నాలలో 9, పుల్లలచెరువులో 9 హ్యాబిటేషన్లలో ట్యాంకర్లతో నీరు సరఫరా చేస్తున్నారు. నిజానికి అంతకు రెట్టింపు సంఖ్యలో గ్రామాలకు ట్యాంకర్లతో నీరు అందజేయాల్సిన అవసరం కనిపిస్తోంది.
పశువుల వలసలు
వైసీపీ పాలనలో రెండేళ్లుగా సరఫరా చేసిన నీటి ట్యాంకర్లకు దాదాపు రూ.21కోట్ల మేర బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో అత్యవసరం అయితే అది కూడా అరకొరగా మాత్రమే అధికారులు సరఫరా చేస్తున్నారు తప్ప క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితిని గుర్తించడం లేదు. జూన్ ఆఖరు వరకు కనీసం 230 ఆవాసాలకు నీటి సరఫరా చేయాల్సి ఉంటుందని, అందుకు రూ.11.20 కోట్లు అవసరమతాయని ప్రభుత్వానికి నివేదించారు తప్ప కార్యాచరణ చేపట్టలేదు. దీంతో ప్రజానీకం పొలాల నుంచి తెచ్చి పోసే ట్యాంకర్ల నీటిని కొనుగోలు చేసి అవసరాలు తీర్చుకుంటున్నారు. ఇక పశుసంపద పరిస్థితి దారుణంగా ఉంది. పశ్చిమాన అనేక పల్లెల్లో పొలాలకు వెళ్తున్న పశువులకు గుక్కెడు నీరు దొరకని పరిస్థితి నెలకొంది. ఏటా మేత, నీటి కోసం పశ్చిమ ప్రాంతం నుంచి డెల్టా ప్రాంతానికి పశువులు వలసలు ఉంటాయి. ఈ ఏడాది అది అధికమైంది. గత పక్షంరోజుల్లో ఎర్రగొండపాలెం ప్రాంతం నుంచి ఐదారు వేల ఆవులు అలా వలస వెళ్లాయి. తక్షణం అధికారులు, ప్రజాప్రతినిధులు నీటి ఇక్కట్లపై దృష్టిసారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.