Share News

అడ్డగోలు తవ్వకాలపై కన్నెర్ర

ABN , Publish Date - Mar 16 , 2025 | 01:27 AM

ప్రజాప్రయోజనం ముసుగులో అడ్డగోలుగా తవ్వకాలు జరిపి ఎర్రమట్టిని తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్న సంస్థపై పల్లామల్లి గ్రామస్థులు మండిపడ్డారు. అనుమతులు పొందిన మేరకు కాకుండా కొండ పోరంబోకు, ఆఖరుకు పక్కనే ఉన్న పట్టా భూముల్లో సైతం తవ్వకాలను సాగించటంపై కన్నెర్ర చేశారు. పార్టీలకతీతంగా ఏకమై తవ్వకాలు చేస్తున్న ప్రదేశానికి వెళ్లి పనులను అడ్డుకున్నారు.

అడ్డగోలు తవ్వకాలపై కన్నెర్ర
కొండ ప్రాంతంలో చేస్తున్న తవ్వకాలు (ఇన్‌సెట్‌లో) మట్టిని తరలిస్తున్న లారీలను అడ్డుకుంటున్న పల్లామల్లి గ్రామస్థులు

పల్లామల్లిలో అనుమతులు లేకుండా

పోరంబోకు, పట్టాభూముల్లో గ్రావెల్‌ క్వారీయింగ్‌

అడ్డుకున్న గ్రామస్థులు

తహసీల్దార్‌, మైన్స్‌ డీడీకి ఫిర్యాదు

కొండలను పిండి చేస్తున్నారని ఆవేదన

వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌

చీమకుర్తి, మార్చి 15 (ఆంధ్రజ్యోతి): ప్రజాప్రయోజనం ముసుగులో అడ్డగోలుగా తవ్వకాలు జరిపి ఎర్రమట్టిని తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్న సంస్థపై పల్లామల్లి గ్రామస్థులు మండిపడ్డారు. అనుమతులు పొందిన మేరకు కాకుండా కొండ పోరంబోకు, ఆఖరుకు పక్కనే ఉన్న పట్టా భూముల్లో సైతం తవ్వకాలను సాగించటంపై కన్నెర్ర చేశారు. పార్టీలకతీతంగా ఏకమై తవ్వకాలు చేస్తున్న ప్రదేశానికి వెళ్లి పనులను అడ్డుకున్నారు. అక్కడకు వచ్చిన రెవెన్యూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫోన్‌ ద్వారా తహసీల్దార్‌, మైన్స్‌ డీడీల దృష్టికి అడ్డగోలు తవ్వకాల అంశాన్ని తీసుకెళ్లి తగిన చర్యలను తీసుకోవాలని కోరారు. గ్రామస్థుల కథనం ప్రకారం.. పల్లామల్లి గ్రామ పరిధిలోని సర్వే నంబర్‌ 33బై1, 33బై2లలో కొండపోరంబోకు భూములు, రెండు చిన్నపాటి కొండలున్నాయి. వీటి పక్కనే పట్టాభూములు సైతం ఉన్నాయి. కొండల నుంచి వర్షపు నీరు గోలవాగు ద్వారా గ్రామంలో ఉన్న పెద్దచెరువుకు చేరుతుంది. ఈ చెరువు గ్రామప్రజలకు ప్రధాన నీటివనరు. అంతేగాక గ్రామానికి చెందిన గొర్రెలు, మేకలు, పశువుల పెంపకందారులు కొండపోరంబోకు భూముల్లోనే మూగజీవాలను అనాదిగా మేపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కాగా ఇటీవల నిర్మిస్తున్న బెంగళూరు ఎక్స్‌ప్రెస్‌ హైవే పనులకు కాంట్రాక్ట్‌ సంస్థకు ఎర్రమట్టి అవసరమైంది. ఇక్కడ నాణ్యమైన ఎర్రమట్టి లభిస్తుందని భావించిన సంస్థ అనుమతుల కోసం రెవెన్యూ, మైనింగ్‌ అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. దీనికి సంబంధించిన అధికారులు 33/2 సర్వే నంబర్‌లో ఉన్న భూముల్లో కేవలం నాలుగు హెక్టార్లలో మాత్రమే తవ్వకాలకు అనుమతులు ఇచ్చారు. అయితే ఆ ప్రాంతంలో నెలరోజులకుపైగా తవ్వకాలు సాగిస్తున్నారు. అందరికీ ఉపయోగపడే రోడ్డు పనులకు కావడంతో గ్రామస్థులు కూడా ఊరకుండిపోయారు. కానీ తవ్వకాలు అడ్డగోలుగా, నిబంధనలకు విరుద్ధంగా సాగిస్తుండటంపై తమకు నష్టం వాటిల్లుతుందని భావించిన గ్రామస్థులు శనివారం కొండ ప్రాంతానికి చేరుకుని పనులను అడ్డుకున్నారు. అనుమతులు లేని సర్వేనంబర్‌లో ఉన్న కొండను పిండి చేయటానికి పూనుకోవటం, పక్కనే ఉన్న పట్టాభూముల్లో సైతం తవ్వకాలు మొదలుపెట్టడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీని వలన చెరువుకు నీరురాని పరిస్థితి ఏర్పడుతుందని అధికారుల వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. స్పందించిన వారు తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వటంతో గ్రామస్థులు శాంతించారు.

నిబంధనలు అతిక్రమిస్తే కేసులు

బ్రహ్మయ్య, తహసీలార్‌, చీమకుర్తి

గ్రామస్థుల అభ్యంతరాలను నా దృష్టికి తీసుకువచ్చారు. అనుమతి మంజూరు చేసిన భూముల్లో కాకుండా ఇతర ప్రాంతాలలో తవ్వకాలు సాగిస్తున్నారని, అనుమతికి మించి పనులు చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. సోమవారం సర్వే నిర్వహించి నిబంధనలు అతిక్రమిస్తే కేసులు నమోదు చేస్తాం.

అనుమతికి మించి తవ్వితే చర్యలు

రాజశేఖర్‌, మైన్స్‌ డీడీ

ప్రజాప్రయోజనార్థం, అభివృద్థి పనుల్లో భాగంగా నిర్మిస్తున్న రహదారి నిర్మాణానికి అవసరమైన ఎర్రమట్టిని తవ్వి, తీసుకు వెళ్లటానికి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అనుమతిని ఇచ్చాం. అడ్డగోలుగా తవ్వకాలు చేస్తే చర్యలు తీసుకుంటాం. గ్రామస్థులు ఆందోళన పడాల్సిన పనిలేదు.

Updated Date - Mar 16 , 2025 | 01:27 AM