Share News

గృహ లబ్ధిదారులకు ఊరట

ABN , Publish Date - Mar 16 , 2025 | 01:31 AM

వివిధ ప్రభుత్వ పథకాల కింద గృహాలు మంజూరై యూనిట్‌ విలువ సరిపోక, స్వయంగా అదనపు నిధులు వెచ్చించే అవకాశం లేని లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం ఊరట కల్పించింది. అలాంటి వారు తమ గృహ నిర్మా ణాలు చేసుకునేందుకు అదనంగా సబ్సిడీ ఇవ్వనుంది.

 గృహ లబ్ధిదారులకు ఊరట

రూ.191.50 కోట్ల అదనపు సాయం

ఎస్సీ, బీసీలకు రూ.50వేలు, ఎస్టీలకు రూ.75వేలు

పీవీజీటీ చెంచులకు రూ.లక్ష

15 నుంచి 23 వరకూ అవగాహన కార్యక్రమాలు

ఒంగోలు, మార్చి 15 (ఆంధ్రజ్యోతి) : వివిధ ప్రభుత్వ పథకాల కింద గృహాలు మంజూరై యూనిట్‌ విలువ సరిపోక, స్వయంగా అదనపు నిధులు వెచ్చించే అవకాశం లేని లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం ఊరట కల్పించింది. అలాంటి వారు తమ గృహ నిర్మా ణాలు చేసుకునేందుకు అదనంగా సబ్సిడీ ఇవ్వనుంది. దీనిపై లబ్ధిదారులకు విస్తృత అవగాహన కల్పించి త్వరితగతిన ఇళ్ల నిర్మాణాలు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. ఆ మేరకు జిల్లాలోని 24,645 మంది గృహ నిర్మాణ లబ్ధిదారులకు రూ.191.50 కోట్ల మేర అదనపు సబ్సిడీ అందనుంది. ఇంటి నిర్మాణ సమయంలో నాలుగు దశల్లో అదనపు సబ్సిడీని విడుదల చేయనున్నారు. ఇప్పటివరకు పీఎం ఆవాస్‌ యోజన అర్బన్‌, రూరల్‌ పథకం కింద బీసీ, ఎస్సీ, ఎస్టీలకు యూనిట్‌ విలువ రూ.1.80 లక్షలు, పీవీజీటీ చెంచులకు రూ.2.39 లక్షలుగా ఉంది. అలా మంజూరైన ఇళ్లలో వివిధ కారణాలతో 24,645 ఇళ్ల నిర్మాణాలు ఆగిపోయాయి. అందులో పీఎం అవాస్‌ యోజన అర్బన్‌, రూరల్‌ కింద మంజూరైన 20,057 ఉండగా పీఎం జన్మన్‌ పథకం కింద మంజూరైన 3,870, అలాగే 718 చెంచులకు సంబంధించినవి ఉన్నాయి. వాటిపై దృష్టిసారించిన ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న యూనిట్‌ విలువకు అదనంగా మరికొంత సబ్సిడీని ఇవ్వాలని నిర్ణయించింది.

పెరిగిన అదనపు సాయం

ఆయా పథకాల కింద మంజూరైన లబ్ధిదారుల్లో బీసీ, ఎస్సీలకు ప్రస్తుతం ఇస్తున్న రూ.1.80లక్షల మొత్తానికి అదనంగా మరో రూ.50వేలు, ఎస్టీ లబ్ధిదారులకు రూ.1.80లక్షలకు అదనంగా రూ.75వేలు, చెంచులకు ఇస్తున్న రూ.2.39 లక్షలకు అదనంగా రూ.లక్ష ఇవ్వనున్నారు. ఆ ప్రకారం బీసీ, ఎస్సీలకు యూనిట్‌ విలువ రూ.2.30లక్షలు, ఎస్టీలకు రూ.2.55 లక్షలు, చెంచులకు రూ.3.39 లక్షలు కానుంది. అలా పెంచిన మొత్తాలతో జిల్లాలోని 24,645 మందికి అదనంగా సుమారు రూ.191.50 కోట్లు మేర లబ్ధి కలగనుంది. వారిలో 10,909 మంది ఎస్సీలకు రూ.51.51కోట్లు అదనంగా అందనుండగా 11,750 మంది బీసీలకు రూ.58,75 కోట్లు, 1,874 మంది లబ్ధిదారులకు రూ.14.05 కోట్లు, 718 మంది చెంచులకు రూ.7.18 కోట్లు అదనపు సబ్సిడీ రానుంది.


23వరకు ప్రత్యేక కార్యక్రమం

లబ్ధిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఇళ్ల నిర్మాణాలు చేపట్టి పూర్తి చేసుకోవాలని కలెక్టర్‌ అన్సారియా కోరారు. సబ్సిడీ మొత్తాన్ని ఇంటి నిర్మాణ సమయంలో నాలుగు దశల్లో అందిస్తామని తెలిపారు. లబ్ధిదారులకు మరింత అవగాహన కల్పించేందుకు ఈనెల 15 నుంచి 23 వరకు ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు చెప్పారు. ఆ సమయంలో సచివాలయంలోని ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లు, వార్డు ఎమినిటీ సెక్రటరీలు లబ్ధిదారులను కలిసి అదనపు సబ్సిడీపై అవగాహన కల్పిస్తారన్నారు. సబ్సిడీ విషయంలో సమస్య ఏదైనా ఎదురైతే పై అధికారులను కలవాలని లబ్దిదారులకు సూచించారు.

Updated Date - Mar 16 , 2025 | 01:31 AM