పరిష్కారం అంతంతే..!
ABN , Publish Date - Apr 07 , 2025 | 11:26 PM
వినతులు ఎక్కువ.. పరిష్కారం అంతంతమాత్రమే. ఇదీ జిల్లాలో ‘మీకోసం’ తీరుతెన్ను. పెద్దసంఖ్యలో వినతులను స్వీకరిస్తున్న అధికార యంత్రాంగం వాటిపై తదుపరి చర్యలు తీసుకోవడంలో మాత్రం ప్రజల మన్ననలు పొందలేకపోతోంది. ప్రజల వద్దకు అధికారులు వెళ్లి వారి సమస్యలు అడిగి తెలుసుకుంటున్నా ప్రయోజనం శూన్యం. ప్రధానంగా రెవెన్యూ యంత్రాంగం తీరు వల్లే ఎక్కువగా సమస్యలు ఉత్పన్నమవుతున్నట్లు విమర్శలు ఉన్నాయి.

మొక్కుబడిగా మారిన ‘మీకోసం’ వినతులు
సమస్యల పరిష్కారంలో యంత్రాంగం
తీరుపై పెదవి విరుస్తున్న ప్రజానీకం
ప్రజల సంతృప్తిలో 21వ స్థానంలో జిల్లా
మొత్తం ప్రక్రియలో రాష్ట్రంలో 15వ స్థానం
ఇటీవలి కలెక్టర్ల సమావేశంలో పీజీఆర్‌ఎస్
గణాంకాలు వెల్లడించిన ప్రభుత్వం
వినతులు ఎక్కువ.. పరిష్కారం అంతంతమాత్రమే. ఇదీ జిల్లాలో ‘మీకోసం’ తీరుతెన్ను. పెద్దసంఖ్యలో వినతులను స్వీకరిస్తున్న అధికార యంత్రాంగం వాటిపై తదుపరి చర్యలు తీసుకోవడంలో మాత్రం ప్రజల మన్ననలు పొందలేకపోతోంది. ప్రజల వద్దకు అధికారులు వెళ్లి వారి సమస్యలు అడిగి తెలుసుకుంటున్నా ప్రయోజనం శూన్యం. ప్రధానంగా రెవెన్యూ యంత్రాంగం తీరు వల్లే ఎక్కువగా సమస్యలు ఉత్పన్నమవుతున్నట్లు విమర్శలు ఉన్నాయి. వారే తిరిగి పరిష్కరించాల్సి వస్తుండటంతో సరైన చర్యలు తీసుకోవడం లేదన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. అధికభాగం అర్జీలను పరిష్కరించినట్లు అధికారులు ప్రకటిస్తున్నప్పటికీ ప్రజానీకం మాత్రం అసంతృప్తిని వ్యక్తం చేస్తోంది.
ఒంగోలు, ఏప్రిల్ 7 (ఆంధ్రజ్యోతి): ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రసల్ సిస్టమ్-పీజీఆర్‌ఎస్) పేరుతో ప్రభుత్వం ప్రతి సోమవారం కలెక్టర్ కార్యాలయం నుంచి గ్రామ స్థాయిలోని సచివాలయం వరకు వివిధ స్థాయిల్లో ప్రజల సమస్యల పరిష్కారం లక్ష్యంగా వినతులు స్వీకరిస్తోంది. వాటిని నిర్థిష్ట కాల వ్యవధిలో పరిష్కరించాలని ఆదేశించింది. దీనిపై నిరంతరం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్థాయిలో పర్యవేక్షణ జరుగుతోంది. అలాంటి కీలకమైన ప్రక్రియ అమలు తీరుపై రాష్ట్రప్రభుత్వం ప్రత్యేక సర్వే చేపట్టి అందుకు సంబంధించి జిల్లాల వారీ గణాంకాల వివరాలను ఇటీవల జరిగిన కలెక్టర్ల సమావేశంలో వెల్లడించింది. అందులో పలు ప్రామాణికాల ఆధారంగా మొత్తం ప్రక్రియపై ఇచ్చిన ర్యాంకింగ్‌లో రాష్ట్రంలో 15వ స్థానంలో జిల్లా ఉంది. ప్రక్రియ తీరు పట్ల ప్రజల సంతృప్తిలో 21వ స్ధానానికి పడిపోయింది.
సమస్యల పరిష్కారంపై ప్రజాభిప్రాయ సేకరణ
ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం ప్రజాభిప్రాయ సేకరణ చేసింది. మొత్తం జిల్లాల వారీగా జూన్ 15 నుంచి (ప్రస్తుత ప్రభుత్వం అధికారం చేపట్టిన) ఇప్పటి వరకు వచ్చిన అర్జీల సంఖ్య, సకాలంలో వాటిని పరిష్కారం చేస్తున్నారా.. ప్రజలు సంతృప్తి చెందుతున్నారా? ఈ విధానాన్ని ఇతరులకు సిఫార్సు చేస్తారా? సమస్యల పరిష్కారం సమయంలో యంత్రాంగం ప్రవర్తన ఎలా ఉంది, మర్యాద ఇస్తున్నారా? వంటి ప్రశ్నలపై అభిప్రాయాలను స్వీకరించింది. ఆ సమాచారాన్ని, తమ వద్ద ఉన్న గణాంకాలతో సరిచూసి పీజీఆర్‌ఎస్ ప్రక్రియ అమలు తీరుపై జిల్లాలకు ర్యాంకింగ్‌ను ఇచ్చింది. ఎక్కువ అర్జీల స్వీకరణ, సకాలంలో వాటిటి పరిష్కరించడం, క్వాలిటీ, వీఐపీల నుంచి అందే వినతుల పరిష్కారం, అందులో క్వాలిటీ వంటి ఐదు అంశాలను ప్రామాణికంగా తీసుకుంది. ఒక్కో అంశానికి 20 పాయింట్ల వంతున 100 పాయింట్లకు జిల్లాల వారీగా బేరీజు వేయగా అందులో మన జిల్లాకు 68.86శాతం మాత్రమే లభించింది. తద్వారా మొత్తం ప్రక్రియ అమలులో జిల్లా 15వ స్థానానికి పరిమితమైంది.
యంత్రాంగం ప్రవర్తన సరిలేదు
ఇప్పటివరకు జిల్లాలో 34,843 అర్జీలు పరిష్కరించినట్లు అఽధికారులు లెక్కలు చూపుతున్నారు. అందులో సంతృప్తికి ఫైవ్ స్టార్, అసంతృప్తికి సింగిల్ స్టార్ రేటింగ్‌ను ప్రభుత్వం ఇచ్చింది. సంతృప్తిలో 21వ స్థానంలో జిల్లా ఉంది. సుమారు 40.60శాతం మంది పరిష్కారంపై అసంతృప్తి వ్యక్తం చేయగా, 7.50 శాతం మంది మాత్రమే సంతృప్తిని తెలిపారు. మిగిలిన 52శాతం మంది అభిప్రాయాలను వెల్లడించలేదు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల అర్జీదారులతో అమరావతి నుంచి పీజీఆర్‌ఎస్ అమలు తీరుపై ఫోన్‌ల ద్వారా ప్రభుత్వం సర్వే నిర్వహించి ఈ తరహా ప్రశ్నలకు సమాధానాలు రాబట్టింది. అందులో సమస్యల పరిష్కార సమయంలో అధికార యంత్రాంగం తీరు ఎలా ఉందన్న ప్రశ్నకు జిల్లాలో 37శాతం మంది ప్రవర్తన సరిలేదని అభిప్రాయపడ్డారు. మరో 17శాతం మంది అసలు తమ అర్జీలను అధికారులు పట్టించుకోవడం లేదని చెప్పారు. ఒక్కరు మాత్రమే చాలా బాగుందని, 46శాతం మంది బాగుందని చెప్పినట్లు ప్రభుత్వం గణాంకాలలో పేర్కొంది.
తీవ్ర ఆందోళనకరమే..
అధికారుల ప్రవర్తన బాగా లేదని ఎక్కువమంది ప్రజానీకం చెప్పిన జిల్లాల్లో మూడో స్థానంలో మన జిల్లా ఉంది. వినతులు అధికంగా స్వీకరించి రాష్ట్రంలో 5వ స్థానంలో నిలిచింది. మర్యాదగా అధికారుల ప్రవర్తన లేదన్న దానిలో మన జిల్లా 3వ స్థానంలో ఉండడం ద్వారా ప్రజల సమస్యల పరిష్కారం పట్ల యంత్రాంగం ప్రవర్తన ఎలా ఉందో అర్థమవుతోంది. ప్రజలు తమ సమస్యల పరిష్కారం పట్ల సంతృప్తి చెందడంలో జిల్లా 21వ స్థానంలో ఉండటం, వీఐపీల నుంచి అర్జీలు తీసుకోవడంలో 20 పాయింట్లకు 19.50 మార్కులు అధికారులకు వచ్చిన వాటిని క్వాలిటీగా పరిష్కరించడంలో 7.24 పాయింట్లు మాత్రమే రావడం తీవ్ర ఆందోళనకరంగా కనిపిస్తోంది.
ప్రభుత్వ ప్రకటించిన అంశాల వారీ రాష్ట్రంలో జిల్లా స్థానం
అత్యధిక అర్జీల స్వీకరణలో : 5వ స్థానం
సక్రమంగా అర్జీల పరిశీలన (ఆడిట్)లో : 6వ స్థానం
అర్జీల పరిష్కారంపై సంతృప్తి (స్టార్ రేటింగ్) : 21వ స్థానం
ఇతరులకు ఈ విధానాన్ని సిఫార్సు చేస్తారా : 14వ స్థానం
పరిష్కార సమయంలో యంత్రాంగం అమర్యాదకర ప్రవర్తన : 3వస్థానం
మొత్తం జిల్లాలో పీజీఆర్‌ఎస్ ప్రక్రియ అమలు తీరు: 15వ స్థానం
ప్రహసనంగా ‘మీ కోసం’
హాజరుకాని వివిధ శాఖల అధికారులు
రిజిస్టర్‌లో మాత్రం సంతకాలు
పెద్దారవీడు, ఏప్రిల్ 7 (ఆంధ్రజ్యోతి): ‘ప్రజల వద్దకే అధికారులు వస్తారు... సమస్యలు పరిష్కరిస్తారు... మొబైల్ యాప్ ద్వారా మీకు కావాల్సిన సేవలనందిస్తారు. యాప్‌లో మెసేజ్ పంపితే మీ సమస్యలను పరిష్కరించడానికి అధికారులు ముందుకొస్తారు’ అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రకటించారు. అయితే ఆయన లక్ష్యాలకు అధికారులు తూట్లు పొడుస్తున్నారు. ప్రభుత్వం ప్రజా సమస్యలను పరిష్కరించడానికి ప్రతిష్టాత్మకంగా ప్రతి సోమవారం నిర్వహిస్తున్న మీకోసం కార్యక్రమానికి అధికారులు సక్రమంగా హాజరు కావడం లేదు. దీంతో కార్యక్రమ ఉద్దేశం నీరుగారుతోంది.
హాజరుకాని అధికారులు
పెద్దారవీడు తహసీల్దార్ కేంద్రంలో నిర్వహించాల్సిన మీ కోసం కార్యక్రమం సోమవారం జరగలేదు. టీవీలు, నెట్‌వర్క్ సమస్యల కారణంగా మీకోసం కార్యక్రమాన్ని ఎంపీడీవో కార్యాలయంలోని సమావేశ మందిరానికి మార్చారు. అక్కడ టీవీ, నెట్‌వర్క్ సమస్యలేవీ తలెత్తలేదు. కానీ ఇద్దరు మినహా ఎవరూ హాజరుకాలేదు. ఉదయం 10 గంటలకు మండల సర్వేయర్ గోపాలరెడ్డి మీ కోసం కార్యక్రమానికి హాజరుకాగా, ఐసీడీఎస్ సూపర్‌వైజర్ లక్ష్మీదేవి 11.15 గంటలకు వచ్చారు. తహసీల్దార్, ఎంపీడీవో, వ్యవసాయశాఖ ఏవో, గృహనిర్మాణ శాఖ ఏఈ, పశుసంవర్ధక శాఖ అధికారులు, ఇతర శాఖ అధికారులు ఎవరూ హాజరుకాలేదు. పెద్దారవీడు చెంచుకాలనీలోని సమస్యలను తహసీల్దార్‌కు చెప్పుకోవడానికి వచ్చిన అంగన్‌వాడీ కార్యకర్త వేచి చూసి వెనుతిరిగి వెళ్లిపోయారు. ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన మీకోసం కార్యక్రమానికి రాని పలువురు అధికారులు హాజరైనట్లు అటెండెన్స్ రిజిస్టర్‌లో సంతకాలు చేశారు. తహసీల్దార్ కార్యాలయంలోనే రిజిస్టర్ ఉండడంతో అక్కడే సంతకాలు చేశారు.