ఉపాధి వేతనాలు కోసం కూలీల ఎదురుచూపులు
ABN , Publish Date - Apr 08 , 2025 | 11:07 PM
ఉపాధి పనులకు వెళ్లిన కూలీలకు 3 నెలలుగా వేతనాలు రాకపోవడంతో నిరాశకు గురవుతున్నారు. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి, మార్చిలో పనిచేసిన కూలీలకు ఇంతవరకు కూలి డబ్బులు వారి బ్యాంక్ ఖాతాలకు జమ కాలేదు. ఈ మూడునెలలకు సంబంధించి ఒకరు కనీసం 30 రోజులకు పైగా పనిచేశారు.

3 నెలలులుగా వేతనాల బకాయి
మార్టూరు, ఏప్రిల్ 8 (ఆంధ్రజ్యోతి) : ఉపాధి పనులకు వెళ్లిన కూలీలకు 3 నెలలుగా వేతనాలు రాకపోవడంతో నిరాశకు గురవుతున్నారు. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి, మార్చిలో పనిచేసిన కూలీలకు ఇంతవరకు కూలి డబ్బులు వారి బ్యాంక్ ఖాతాలకు జమ కాలేదు. ఈ మూడునెలలకు సంబంధించి ఒకరు కనీసం 30 రోజులకు పైగా పనిచేశారు. దాంతో ఒకరికి సుమారు రూ.10 వేల దాకా కూలి వచ్చే అవకాశం ఉంది. ఇతర పనులు లేకపోవడం, ఉపాధి కూలి డబ్బులు రాకపోవడంతో ఇబ్బందిగా ఉందని కూలీలు వాపోతున్నారు. దాంతో మండలంలో ఉపాధి పనులకు వచ్చే కూలీల సంఖ్య కూడా తగ్గుముఖం పట్టింది. మండలంలో మంగళవారం సుమారు 3500 మంది ఉపాధి పనులకు కూలీలు వెళ్లారు. వాస్తవంగా మండలంలో రోజుకు 7 వేల మందికి పైగా కూలీలు ఉపాధి పనులకు వెళతారు. ఇంకా పూర్తి స్థాయిలో పనులకు పర్మిట్ రాకపోవడం వలన పనులు తక్కువగా ఉన్నాయని కూలీలు చెప్తున్నారు. ప్రస్తుతం పంటకాలువలు, చెరువులు పూడిక, వాగులు వద్ద ఉపాధి కూలీలు పనిచేస్తున్నారు. మరో వారం రోజులలో మరిన్ని పనులకు అనుమతి లబిస్తుందని, తద్వారా మరింత మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని సిబ్బంది చెప్తున్నారు. అదేవిధంగా ఎండలు ఎక్కువగా ఉండడంతో కూలీలు పనిచేసే సమయంలో వారికి మంచినీరు, మజ్జిగ తదితర వసతులను అధికారులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది.