Vijay Sai Reddy Gets SIT Notice: మద్యం స్కామ్‌లో సాయిరెడ్డికి పిలుపు
ABN , Publish Date - Apr 16 , 2025 | 05:20 AM
మద్యం స్కామ్‌లో సాయిరెడ్డికి సిట్ నోటీసులు జారీ కాగా, ఆయన 18కు బదులుగా 17న విచారణకు రావాలనగా అధికారులు అంగీకించారు. గతంలోనే కసిరెడ్డినే స్కాంలో కర్త, కర్మ, క్రియగా అభివర్ణించిన సాయిరెడ్డిపై దర్యాప్తు ముమ్మరమైంది

18న విచారణకు రావాలంటూ సిట్ నోటీసు
అయితే, 17న రాగలనన్న సాయిరెడ్డి.. సిట్ ఓకే
స్కాంలో కర్త, కర్మ, క్రియ కసిరెడ్డేనని గతంలో సాయిరెడ్డి వ్యాఖ్య
అమరావతి, ఏప్రిల్ 15 (ఆంధ్రజ్యోతి): వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన వేల కోట్ల రూపాయల మద్యం కుంభకోణం కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) మరో అడుగు ముందుకేసింది. మద్య నిషేధం హామీ ఇచ్చి దేశంలో ఎక్కడా లేని ధరలతో మందుబాబులను దోచుకుని, నాసిరకం మద్యం సరఫరాతో వారిని తీవ్ర అనారోగ్యానికి గురి చేసిన తాడేపల్లి బాస్ చీకటి గుట్టుమట్లు తెలిసిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డికి నోటీసు జారీ చేసింది. ఈ నెల 18న విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయ ప్రాంగణంలోని సిట్ ఆఫీసుకు ఉదయం 10గంటలకు రావాలని దర్యాప్తు అధికారి పేరుతో ఇచ్చిన నోటీసులో పేర్కొన్నారు. సెక్షన్ 179ప్రకారం ఈ నోటీసు ఇస్తున్నట్లు స్పష్టం చేశారు. అయితే, ఆ రోజు తనకు వేరే పనులు ఉన్నాయని, 17వ తేదీ అయితే రాగలనని సాయిరెడ్డి తెలిపారు. ఇందుకు సిట్ అధికారులు అంగీకరించారు. కాగా, లిక్కర్ స్కామ్‌లో కర్త, కర్మ, క్రియ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డేనని గత నెల 12న కాకినాడ పోర్టు కేసులో విజయవాడ సీఐడీ అధికారుల ముందు హాజరైన సమయంలో విజయసాయి రెడ్డి మీడియా ముఖంగా వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.
జగన్ అక్రమాస్తుల కేసులతోపాటు ఆయన పార్టీ వైసీపీలో నంబర్ టూ గా ఉంటూ ఇటీవలే రాజకీయాలకు దూరమైన సాయిరెడ్డి నాడు (2019) లిక్కర్ వ్యవహారంలో చక్రం తిప్పారు. ఆ తర్వాత రాయల సీమకు చెందిన ఎంపీ మిథున్ రెడ్డి చేతికి అంతా వెళ్లిపోయినట్లు ప్రచారం జరిగింది. ఆయన తర్వాత రాజ్ కసిరెడ్డి ఏడంచెల వ్యవస్థను నడిపించడంలో కీలక పాత్ర పోషించినట్లు వెల్లడైంది. లిక్కర్ బాక్స్‌పై రూ.150 నుంచి రూ.600వరకూ వసూలుచేసి నెలకు రూ.60కోట్లకు తగ్గకుండా చేర్చాల్సిన చోటుకు చేర్చడంలో రాజ్ కసిరెడ్డిది కీలక పాత్రగా గతంలో సీఐడీ తేల్చింది. నాసిరకం మద్యం కొనుగోలు, సరఫరా వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి సుమారు 20వేల కోట్ల రూపాయల వరకూ ఆర్థిక నష్టం వాటిల్లినట్లు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఇప్పటికే ప్రకటించారు. దీంతోపాటు మద్యం కొనుగోలు, లైసెన్స్‌ల మంజూరు, కమీషన్లు, లంచాల రూపంలో నాలుగు వేల కోట్ల రూపాయలు చేతులు మారినట్లు సీఐడీ ఇప్పటికే నిగ్గు తేల్చింది.