GBS: మళ్లీ జీబీఎస్ కలకలం!
ABN , Publish Date - Mar 15 , 2025 | 12:07 AM
health alert గులియన్ బారీ సిండ్రోమ్(జీబీఎస్).. మళ్లీ కలకలం రేపుతోంది. ఈ వ్యాధి లక్షణాలతో సంతబొమ్మాళి మండలంలోని ఒక బాలుడు సుమారు నెల కిందట మృతి చెందిన విషయం తెలిసిందే. తాజాగా జిల్లాలో మరో ఇద్దరికి ఈ వ్యాధి లక్షణాలు బయటపడడంతో వైద్యఆరోగ్యశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు.

జిల్లాలో మరో ఇద్దరికి వ్యాధి లక్షణాలు
అప్రమత్తమైన వైద్యాధికారులు
రణస్థలం/హిరమండలం, మార్చి 14(ఆంధ్రజ్యోతి): గులియన్ బారీ సిండ్రోమ్(జీబీఎస్).. మళ్లీ కలకలం రేపుతోంది. ఈ వ్యాధి లక్షణాలతో సంతబొమ్మాళి మండలంలోని ఒక బాలుడు సుమారు నెల కిందట మృతి చెందిన విషయం తెలిసిందే. తాజాగా జిల్లాలో మరో ఇద్దరికి ఈ వ్యాధి లక్షణాలు బయటపడడంతో వైద్యఆరోగ్యశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. రణస్థలం మండలం కృష్ణాపురం గ్రామానికి చెందిన ఒక వృద్ధుడు జీబీఎస్ అనుమానిత లక్షణాలతో బాధపడుతూ శ్రీకాకుళంలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి(రిమ్స్)లో చికిత్స పొందుతున్నాడు. దీంతో శుక్రవారం డీఎంహెచ్‌వో టీవీ బాలమరళీకృష్ణ, డీపీఎంవో రవీంద్ర ఆ గ్రామాన్ని సందర్శించారు. గ్రామంలో జ్వరాలతో ఎవరైనా బాధపడుతున్నారా? అని పలువురిని అడిగితెలుసుకున్నారు. గ్రామంలో పరిశుభ్రత పాటించాలని సూచించారు. జీబీఎస్ అంటువ్యాధి కాదని, ప్రజలు భయపడవద్దని సూచించారు. ఈయనతో పాటు రావాడ రాక్టర్ జనార్దన్ నాయుడు ఉన్నారు.
అలాగే హిరమండలం మేజర్ పంచాయతీ సుభలయ కాలనీలోని ఒక మహిళ కొన్ని రోజులుగా జ్వరంతో బాధపడుతూ స్థానిక పీహెచ్‌సీలో చికిత్స పొందింది. తరువాత కండరాలు బలహీనత, కాళ్లు తిమ్మిరెక్కడం, కంటిచూపు మందగించడం వంటి జీబీఎస్ లక్షణాలు కనిపించడంతో స్థానిక వైద్యాధికారి ఫరూక్ హుస్సేన్ అప్రమత్తమయ్యారు. ఈ నెల 12న ఆమెను మెరుగైన చికిత్స కోసం శ్రీకాకుళంలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి(రిమ్స్) రిఫర్ చేశారు. ప్రస్తుతం ఆమె రిమ్స్‌లో చికిత్స పొందుతూ కోలుకుంటుందని కుటుంబ సభ్యులు తెలిపారు. హిరమండలం పీహెచ్‌సీతోపాటు సుభలయ గ్రామాన్ని శుక్రవారం డిప్యూటీ డీఎంహెచ్‌వో మేరీ కేథరిన్ సందర్శించారు. బాధితురాలి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఆ మహిళ ఎక్కడ పనిచేస్తోంది.. ఇటీవల ఇతర ప్రాంతాలకు ఏమైనా వెళ్లిందా..? అని ఆరా తీశారు. గ్రామంలో ఎవరైనా కండరాల నొప్పులతో బాధపడుతన్నట్టయితే వెంటనే స్థానిక పీహెచ్‌సీని సంప్రదించాలని సూచించారు. అలాగే ఇంటంటికీ వెళ్లి వైద్యపరీక్షలు నిర్వహించాలని వైద్య సిబ్బందికి ఆదేశించారు. ఎంపీడీవో కాళీప్రసాదరావు ఆదేశాల మేరకు పంచాయతీ అధికారులు గ్రామంలో బ్లీచింగ్ చల్లి క్లోరినేషన్ చేయించారు. ఇదిలా ఉండగా కండరాలు బలహీనత, తిమ్మిర్లతో బాధపడుతున్న మహిళకు జీబీఎస్ వ్యాధి నిర్ధారణ కాలేదని డీఎంహెచ్‌వో బాలమురళీకృష్ణ తెలిపారు.