Share News

Sbi : ఢిల్లీకి చేరిన ఎస్‌బీఐ చిచ్చు

ABN , Publish Date - Apr 09 , 2025 | 12:05 AM

SBI incident గార ఎస్‌బీఐ బ్రాంచ్‌లో తాకట్టు పెట్టిన బంగారం ఆభరణాల మాయం కేసు వ్యవహారం ఢిల్లీకి చేరింది. 2023 నవంబరులో వెలుగులోకి వచ్చిన బంగారు ఆభరణాలు మాయం ఘటన ఎన్నో మలుపులు తిరగ్గా.. బ్యాంక్‌లో పని చేస్తున్న ఓ మహిళా ఉద్యోగి నిండు ప్రాణాన్ని బలిగొన్న విషయం పాఠకులకు తెలిసిందే.

Sbi : ఢిల్లీకి చేరిన ఎస్‌బీఐ చిచ్చు
జంతర్‌మంతర్‌ వద్ద ధర్నా చేస్తున్న స్వప్నప్రియ కుటుంబ సభ్యులు

  • గార బ్యాంకు కేసులో అవకతవకలపై జంతర్‌మంతర్‌ వద్ద ధర్నా

  • టీఆర్‌ఎం రాజును బర్త్‌రఫ్‌ చేయాలి

  • స్వప్నప్రియ కుటుంబ సభ్యుల డిమాండ్‌

  • శ్రీకాకుళం క్రైం, ఏప్రిల్‌ 7(ఆంధ్రజ్యోతి): గార ఎస్‌బీఐ బ్రాంచ్‌లో తాకట్టు పెట్టిన బంగారం ఆభరణాల మాయం కేసు వ్యవహారం ఢిల్లీకి చేరింది. 2023 నవంబరులో వెలుగులోకి వచ్చిన బంగారు ఆభరణాలు మాయం ఘటన ఎన్నో మలుపులు తిరగ్గా.. బ్యాంక్‌లో పని చేస్తున్న ఓ మహిళా ఉద్యోగి నిండు ప్రాణాన్ని బలిగొన్న విషయం పాఠకులకు తెలిసిందే. కాగా.. ఈ కేసులో అప్పట్లో అవకతవకలకు పాల్పడి.. పరోక్షంగా తమ కుమార్తె మృతికి కారణమైన టీఆర్‌ఎం రాజును శిక్షించాలంటూ స్వప్నప్రియ కుటుంబ సభ్యులు సోమవారం ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద ధర్నా చేశారు. అప్పట్లో బంగారం ఆభరణాలు మాయం కావడంలో బ్రాంచ్‌ మేనేజర్‌, డిప్యూటీ మేనేజర్‌, క్యాష్‌ ఆఫీసర్‌, ఫీల్డ్‌ ఆఫీసర్‌, ప్రైవేట్‌ ఏజెంట్‌ పాత్రలపై పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. ఆ తర్వాత బ్యాంక్‌లో పనిచేస్తున్న డిప్యూటీ మేనేజర్‌ ఉరిటి స్వప్నప్రియపై నిందారోపణలకు కొందరు సిద్ధమవ్వగా.. ఆమె ఆవేదనతో ఆత్మహత్య చేసుకుంది. దీంతో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేయగా నమ్మలేని నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసును తప్పుదోవ పట్టించేలా ప్రయత్నించిన అప్పటి శ్రీకాకుళం ఎస్‌బీఐ ఆర్‌ఎం టి.ఆర్‌.ఎం.రాజు పాత్రపై పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. ఈ కేసుతో సంబంధం లేని స్వప్నప్రియ అన్న కిరణ్‌ను దోషిగా చేయడం, అందుకు తగ్గ ఆదారాలు లభించకపోవడంతో ఆర్‌ఎం టీఆర్‌ఎం రాజు పాత్రపై స్వప్నప్రియ కుటుంబ సభ్యులు అమరావతిలోని ఎస్‌బీఐ ఛీప్‌ జనరల్‌ మేనేజర్‌కు ఫిర్యాదు చేశారు. శాఖాపరమైన విచారణ జరగడంతో ఆర్‌ఎంను శ్రీకాకుళం నుంచి ముంబై ప్రధాన కార్యాలయానికి బదిలీ చేశారు. అయితే స్వప్నప్రియ కుటుంబ సభ్యులు గార ఎస్‌బీఐ కేసులో తమకు అన్యాయం జరిగిందని ఆర్‌ఎమ్‌ రాజును శిక్షించాలని సీఎం కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టాలని డీజీపీ కార్యాలయానికి సిఫారసు చేశారు. తాజాగా.. తమ కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ స్వప్నప్రియ కుటుంబ సభ్యులు ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద సోమవారం ఆందోళన చేపట్టారు. అప్పటి ఆర్‌ఎం టీఆర్‌ఎమ్‌ రాజును శిక్షించి, బర్త్‌రఫ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. అన్యాయంగా స్వప్నప్రియ, కిరణ్‌ను ఈ కేసులో ఇరికించారని, ఎస్‌బీఐ చైర్మన్‌ కార్యాలయానికి తప్పుడు నివేదికలు అందించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్‌బీఐ చైర్మన్‌కు ఫిర్యాదు చేసి ఆరు నెలలైనా ఆర్‌ఎం రాజుపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. తక్షణమే ఎస్‌బీఐ చైర్మన్‌ స్పందించి తమ కుటుంబానికి అన్యాయం చేసిన టీఆర్‌ఎం రాజుతోపాటు డీజీఎంపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - Apr 09 , 2025 | 12:05 AM