10th Exams: పకడ్బందీగా..
ABN , Publish Date - Mar 17 , 2025 | 12:02 AM
Tenth Exams పదోతరగతి పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈమేరకు విద్యాశాఖ అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తిచేశారు. రెగ్యులర్‌తోపాటు ఓపెన్ విధానంలో అభ్యర్థులకు ఏక కాలంలో పరీక్షలు నిర్వహించనున్నారు.

నేటి నుంచి పది పరీక్షలు
149 కేంద్రాల్లో నిర్వహణకు ఏర్పాట్లు
29,791 మందికి హాల్‌టిక్కెట్లు జారీ
ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణం
నరసన్నపేట/ హిరమండలం/ గుజరాతీపేట/ హరిపురం, మార్చి 16(ఆంధ్రజ్యోతి): పదోతరగతి పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈమేరకు విద్యాశాఖ అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తిచేశారు. రెగ్యులర్‌తోపాటు ఓపెన్ విధానంలో అభ్యర్థులకు ఏక కాలంలో పరీక్షలు నిర్వహించనున్నారు. జిల్లాలో 149 కేంద్రాల్లో 29,791 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. వీరిలో రెగ్యులర్‌లో బాలురు 14,810 మంది, బాలికలు 14,174 మంది మొత్తం 28,984 మంది ఉన్నారు. ఓపెన్ స్కూల్ విధానంలో మరో 807 మంది హాజరుకానున్నారు. వీరి కోసం 8 కేంద్రాలు కేటాయించారు. ఈ నెల 17 నుంచి 31 వరకూ రోజూ ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. పోలీసుస్టేషన్ల నుంచి పరీక్షా కేంద్రాలకు ప్రశ్నపత్రాలను తరలించేందుకు 37 వాహనాలను అందుబాటులో ఉంచారు. చూచిరాతలకు అవకాశమున్న ఎనిమిది కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రానికి 200 మీటర్లు వరకు 144 సెక్షన్ అమలులో ఉంటుంది. సమీపంలోని జిరాక్స్, ఇంటర్‌నెట్ కేంద్రాలను మూసివేయాలని విద్యాశాఖ అదేశాలు జారీ చేసింది. పరీక్షా కేంద్రాల్లోకి విద్యార్థులతోపాటు ఇన్విజలేటర్లు, చీఫ్ సూపరింటెండెంట్‌లు, డిపార్ట్‌మెంట్ అధికారులను మాత్రమే అనుమతిస్తారు. సెల్‌ఫోన్ల అనుమతి లేదు. ఒక్క సీఎస్‌కు మాత్రమే సెల్‌ఫోన్ అనుమతిస్తారు.
పరీక్షల మధ్య విరామం..
పదోతరగతి పరీక్షల్లో రాష్ట్ర ప్రభుత్వం పలు మార్పులు చేసింది. గతంలో ఒక సబ్జెక్టుకు రెండు పరీక్షలు ఉండేవి. ఈసారి సైన్స్ మినహా మిగతావన్నీ ఒక్కో పరీక్షకు పరిమితం చేసింది. అలాగే ప్రతీ పరీక్షకు మధ్యలో ఒక రోజు విరామం ఇచ్చింది. గణితం, సాంఘీకశాస్త్రం పరీక్షలకు అదనంగా మరొక రోజు విరామం లభించింది. దీనివల్ల విద్యార్థులు ఒత్తిడి గురికాకుండా పరీక్షలు రాసే అవకాశం ఉంది.
దివ్యాంగులకు మినహాయింపులివీ..
పదోతరగతి పరీక్షల్లోనూ ప్రభుత్వం దివ్యాంగులకు ప్రత్యేక మినహాయింపులు కల్పిస్తోంది. వివిధ సౌకర్యాల నిమిత్తం జీవో నెంబర్ 86 జారీ చేసింది. జిల్లాలో ఈ ఏడాది 654 మంది దివ్యాంగులు పదోతరగతి పరీక్షలు రాయనున్నారు. దివ్యాంగులు తగిన ధ్రువపత్రాలు సమర్పిస్తే.. తెలుగు, హిందీ, ఆంగ్లం వంటి ఏదైనా భాషకు సంబంధించిన పరీక్ష రాయనవసరం లేకుండా మినహాయింపు ఇస్తారు. అంధులకు ఒక భాష పరీక్షకు మినహాయింపుతోపాటు మిగిలిన రెండు భాషల్లో 20 మార్కులు సాధిస్తే ఉత్తీర్ణులుగా పరిగణిస్తారు. అభ్యసన వైకల్యం ఉంటే ఆంగ్లభాష పరీక్ష రాయనవసరం లేదు. మిగిలిన వాటిలో 15 మార్కులు వస్తే సరిపోతుంది. చేతులు పనిచేయని వారికి, అంధులకు పరీక్ష రాయడానికి ఒక సహాయకుడిని అనుమతిస్తారు. వినికిడి లోపం ఉంటే రెండు భాషలు రాయనవసరం లేదు. మిగిలిన నాలుగు సబ్జెక్టుల్లో 20 మార్కులు చొప్పున తెచ్చుకుంటే చాలు. మాట లోపం ఉన్నవారికి అన్ని సబ్జెక్టుల్లోనూ 20 మార్కులు వస్తే ఉత్తీర్ణులే. కుష్టువాధి బాధితులు పక్షవాతం, మరుగుజ్జులకు ఒక భాష పరీక్ష మినహాయిపు. మిగిలిన వాటిలో 10 మార్కులు చొప్పున రావాలి. దివ్యాంగులకు వారి సౌకర్యార్థం కుర్చీలు, వివిధ పరికరాలు, కళ్లద్దాలు, శ్రవణ యంత్రాలు, కాలిక్యులేటర్లు, కృత్రిమ అవయవాలను వెంట తెచ్చుకొనేందుకు ముందుగా కోరితే అనుమతిస్తారు. దివ్యాంగులు వారి ధ్రువపత్రాలను పరీక్షా కేంద్రాలకు తీసుకెళ్లాలని డీఈవో తిరుమల చైతన్య సూచించారు. హాల్‌టికెట్లపై ఆయా అభ్యర్థుల వివరాలు పొందుపరిచి ఉంటాయని తెలిపారు.
విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి
విద్యార్థులకు పరీక్ష సమయానికి ముందు 24 పేజీల బుక్‌లెట్‌ను అందిస్తారు. దాంట్లో పూర్తి వివరాలతో ఓఎమ్మార్ షీట్ జతచేసి ఉంటుంది. దీనిపై బుక్‌లెట్ నెంబరువేసి, విద్యార్థితోపాటు ఇన్విజలేటర్ ధ్రువీకరించాలి. తప్పులుంటే ఇన్విజలేటర్ దృష్టికి తీసుకువెళ్లాళి. అదనంగా కావాలంటే 12 పేజీల బుక్‌లెట్ ఇస్తారు. ప్రశ్నపత్రాలకు క్యూఆర్ కోడ్ ఉండటంతో ఎక్కడి నుంచి బయటకు వెళ్లిందో తెలుస్తుంది.
విద్యార్థులు ఉదయం 8.45 గంటలకు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలి. హాల్‌టిక్కెట్, అట్ట, పెన్ను తప్పనిసరిగా తీసుకెళ్లాలి. హాల్ టిక్కెట్ చూపించి ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా కేంద్రాలకు చేరుకోవచ్చును.
కంట్రోల్‌రూమ్ ఏర్పాటు
‘పదోతరగతి పరీక్షల నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాటు పూర్తిచేశాం. పరీక్షా కేంద్రాల్లో పర్నీచర్ సౌకర్యం కల్పించాం. పరీక్షల పర్యవేక్షణకు ప్లయింగ్ స్కాడ్‌లను ఏడు టీమ్‌లను సిద్ధం చేశాం. శ్రీకాకుళంలోని ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో కంట్రోల్‌రూమ్ ఏర్పాటు చేశాం. విద్యార్థులకు కానీ, అధికారులకు, ఇన్విజిలేటర్లు ఎటువంటి అవంతరాలు ఎదురైనా కంట్రోల్ రూమ్ 08942-220724, 94940 94904 నెంబర్లకు సమాచారం ఇవ్వండి.
- సదాశివుని తిరుమల చైతన్య, డీఈవో