power plant: మళ్లీ.. ‘అణు’ కదలిక!
ABN , Publish Date - Mar 16 , 2025 | 12:27 AM
Kovvada power plant రణస్థలం మండలం కొవ్వాడలో అణువిద్యుత్ ప్లాంట్ ఏర్పాటుపై మళ్లీ కదలిక వచ్చింది. ఇక్కడ అణువిద్యుత్ కేంద్రం ఏర్పాటు చేస్తామని మూడు దశాబ్దాల కిందటే అధికార యంత్రాంగం ప్రకటించింది.

కొవ్వాడ విద్యుత్ ప్లాంటుకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్
సీఎం చంద్రబాబుతో చర్చించిన ప్రధాని మోదీ
శాసనసభలో ప్రస్తావించిన ఎమ్మెల్యే ఎన్‌ఈఆర్
ప్రత్యేక ప్రకటన చేసిన ముఖ్యమంత్రి
సమస్యలు పరిష్కరించాలని స్థానికుల విజ్ఞప్తి
కొవ్వాడలో అణు విద్యుత్‌ప్లాంట్ పరిశ్రమ ఏర్పాటు సందిగ్ధంలో ఉంది. కొవ్వాడ పంచాయతీలో మత్స్యకారులు తమ భూములను ప్లాంట్ కోసం వదులుకున్నారు. ఆస్తులను త్యాగం చేశారు. కానీ అక్కడ పరిశ్రమ ఏర్పాటుకు అడుగు ముందుకు పడడంలేదు. అక్కడ ప్లాంటు ఏర్పాటైతే మత్స్యకారులతోపాటు స్థానికులకు జీవనోపాధి పెరుగుతుంది. దీనిపై ప్రభుత్వం స్పందించి మత్స్యకారులకు నష్ట పరిహారంతోపాటు ప్లాంటు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి.
- ఇదీ ఇటీవల శాసనసభలో ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుకుదుటి ఈశ్వరరావు చేసిన విన్నపం.
----------------------------
విద్యుత్ పరిశ్రమల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుంటుంది. శ్రీకాకుళం జిల్లాలో కొవ్వాడ అణు విద్యుత్ పరిశ్రమ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సుముఖంగా ఉంది. ఈ విషయాన్ని ప్రధాని మోదీ సైతం నాతో చర్చించారు. వీలైనంత త్వరగా అక్కడ అణు విద్యుత్ పరిశ్రమ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటాం. పరిశ్రమపై చాలా అపోహలు ఉన్నా.. వాటిని నివృత్తి చేసి అవసరమైతే చిన్న చిన్న ప్లాంట్లు సైతం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటాం.
- శాసనసభలో సీఎం చంద్రబాబు స్పందన ఇది.
రణస్థలం, మార్చి 15(ఆంధ్రజ్యోతి): రణస్థలం మండలం కొవ్వాడలో అణువిద్యుత్ ప్లాంట్ ఏర్పాటుపై మళ్లీ కదలిక వచ్చింది. ఇక్కడ అణువిద్యుత్ కేంద్రం ఏర్పాటు చేస్తామని మూడు దశాబ్దాల కిందటే అధికార యంత్రాంగం ప్రకటించింది. ఈ క్రమంలో ఎన్నో పోరాటాలు.. ఆటంకాలు ఎదురుకాగా, అవి కొలిక్కి వచ్చినా.. ఇంతవరకూ ఏర్పాటు చేయలేకపోయింది. 1991లో కొవ్వాడ పరిసర ప్రాంతాల్లో అణువిద్యుత్ పరిశ్రమ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. దీనిని మొదట్లో మత్స్యకారులు, ప్రజాసంఘాలు, పర్యావరణ వేత్తలు తీవ్రంగా వ్యతిరేకించారు. వారు వ్యతిరేకించినా.. ఎట్టి పరిస్థితుల్లో అణువిద్యుత్ పరిశ్రమ ఏర్పాటుచేస్తామని కేంద్ర ప్రభుత్వం తేల్చిచెప్పడంతో వెనక్కితగ్గారు. ప్రజల్లో ఉన్న భయాందోళనలు, అపోహలు నివృత్తి చేసి ప్లాంట్ ఏర్పాటు చేస్తామని చెప్పడంతో మత్స్యకారులు భూసేకరణకు అంగీకరించారు. రూ.లక్ష కోట్ల వ్యయంతో 1,208 మెగావాట్ల సామర్థ్యంతో ఆరు రియాక్టర్ల ఏర్పాటుకు సన్నాహాలు చేశారు. భూసేకరణతో పాటు పరిహారం చెల్లించారు. కానీ పరిశ్రమ ఏర్పాటు విషయంలో తాత్సారం జరుగుతోంది. వైసీపీ ప్రభుత్వ హయాంలోనూ అణు విద్యుత్ పరిశ్రమ ఏర్పాటుపై కదలిక వచ్చింది. అప్పట్లో రాజ్యసభలో వైసీపీకి చెందిన విజయసాయిరెడ్డి అణువిద్యుత్ పరిశ్రమ ఏర్పాటుచేస్తారా? లేదా? అని ప్రశ్నించారు. దీనిపై అప్పటి మంత్రి డాక్టర్ జితేంద్రసింగ్ స్పందిస్తూ.. అమెరికా సహకారంతో తప్పకుండా ప్లాంట్ ఏర్పాటు చేస్తామన్నారు. కానీ ఆ తరువాత ఎటువంటి కదలిక లేదు. తాజాగా దీనిపై అసెంబ్లీలో స్థానిక ఎమ్మెల్యే నడుకుదుటి ఈశ్వరరావు ప్రస్తావించడంతో మళ్లీ కదలిక వచ్చింది. అణువిద్యుత్ పరిశ్రమ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం కూడా సుముఖంగా ఉన్నట్టు సీఎం చంద్రబాబు ప్రకటించడంతో త్వరలో పనులు ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తోంది.
సమస్యలు పరిష్కరించండి
నిర్వాసితులకు పూర్తిస్థాయిలో పరిహారం, యూత్‌ప్యాకేజీ అందజేయడంతో పాటు సమస్యలు పరిష్కారం దిశగా చర్యలు చేపట్టాలని ఈ ప్రాంతవాసులు డిమాండ్ చేస్తున్నారు. న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐఎల్) కొవ్వాడ పంచాయతీ పరిధిలోని కొవ్వాడ, చిన్నకొవ్వాడ, టెక్కలి, గూడెం, రామచంద్రాపురాన్ని నిర్వాసిత గ్రామాలుగా ప్రకటించింది. అణు విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు కోసం వీటి పరిధిలో 2,079 ఎకరాల భూమిని సేకరించారు. ఇళ్లు కోల్పోయిన వారికి ఎన్‌పీసీఐఎల్ వారే స్వయంగా ఇళ్లు కట్టిస్తామని ప్రకటించారు. అందుకు అనేక ప్రాంతాలను పరిశీలించారు. తీవ్ర తర్జనభర్జనల నడుమ చివరకు ఎచ్చెర్ల మండలం ధర్మవరంలో నిర్వాసిత కాలనీ ఏర్పాటుకు నిర్ణయించారు. 190 ఎకరాలను రైతుల నుంచి సేకరించారు. 2013 భూసేకరణ చట్టానికి అనుగుణంగా పరిహారాన్ని చెల్లించారు. అయితే పరిహారం చెల్లింపుల్లో కొంతమొత్తం పెండింగ్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. అటు పరిశ్రమ ఏర్పాటుకాక.. ఇటు భూములపై హక్కులు లేక.. మరోవైపు పునరావాస గ్రామాల్లో ఇళ్ల నిర్మాణం.. మౌలిక వసతులు లేక నిర్వాసితులు గందరగోళంలో ఉన్నారు. వీలైనంత త్వరగా సమస్యలకు పరిష్కారం చూపి ప్లాంట్ ఏర్పాటు చేయాలని ఈ ప్రాంతీయులు కోరుతున్నారు.
యూత్ ప్యాకేజీ అందించాలి
యూత్‌ప్యాకేజీ అమలులో నిర్లక్ష్యం కనిపిస్తోంది. 2017 నాటికి 18 ఏళ్లు పూర్తికాని చాలామందికి యూత్‌ప్యాకేజీ అందలేదు. వారందరికీ చెల్లించాలి. స్థానిక ఎమ్మెల్యే చొరవ చూపడం అభినందనీయం. వీలైనంత త్వరగా సమస్యలు పరిష్కరించాలి.
- మైలపల్లి పోలీస్, మత్స్యకార నాయకుడు, కొవ్వాడ
.................
సమస్యలు విన్నవించాం..
ఇటీవల కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు, ఎంపీ అప్పలనాయుడు, స్థానిక ఎమ్మెల్యే ఈశ్వరరావు దృష్టికి మా సమస్యలు తీసుకెళ్లాం. నిర్వాసితులందరికీ కాలనీ నిర్మించాలని కోరాం. కాలనీలో మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశాం.
- ఎం.అప్పారావు, మత్స్యకార నాయకుడు, కొవ్వాడ