jeedi : కొనుగోలుదారులేరీ?
ABN , Publish Date - Apr 06 , 2025 | 12:41 AM
Cashews buyers కొత్త తెలుగు సంవత్సరంలోకి అడుగు పెట్టిన జీడి వ్యాపారులకు ఆదిలోనే హంసపాదు ఎదురయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. జీడిపప్పు ధరలు పెరగడంతో కొనుగోళ్లు తగ్గుముఖం పట్టాయి. ఈ నేపథ్యంలో పరిశ్రమలను తాత్కాలికంగా బంద్ చేయాల్సి వస్తోందని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పెరిగిన జీడిపప్పు ధరలు
తగ్గిన విక్రయాలు
తాత్కాలికంగా పరిశ్రమలు మూత
కొత్త జీడి పిక్కలపైనే ఆశలు
పలాస, ఏప్రిల్ 5(ఆంధ్రజ్యోతి): కొత్త తెలుగు సంవత్సరంలోకి అడుగు పెట్టిన జీడి వ్యాపారులకు ఆదిలోనే హంసపాదు ఎదురయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. జీడిపప్పు ధరలు పెరగడంతో కొనుగోళ్లు తగ్గుముఖం పట్టాయి. ఈ నేపథ్యంలో పరిశ్రమలను తాత్కాలికంగా బంద్ చేయాల్సి వస్తోందని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది వచ్చే కొత్త జీడి పంటపైనే ఆశలు పెట్టుకున్నారు. సాధారణంగా జీడి వ్యాపారమంటే లాభసాటిగా ఉంటుందని అంతా భావిస్తారు. వేలాదిమంది కార్మికులు, వందలాది వ్యాపారులతో పలాస మార్కెట్ కళకళలాడుతుండేది. కానీ ప్రస్తుతం తలకిందులయ్యే పరిస్థితికి వచ్చింది. జీడిపిక్కల కొనుగోలు ధర కంటే తయారీకే అదనంగా ఖర్చవడంతో వ్యాపారులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. 80 కిలోల జీడిపిక్కల నుంచి 20 కిలోల వరకూ జీడిపప్పు వస్తుంది. ప్రస్తుత మార్కెట్ ప్రకారం అన్నీరకాలు కలిపి సరాసరి కిలో రూ.770కు హోల్‌సేల్‌గా పడుతుంది. అంత మొత్తం ధర చెల్లించి జీడి పప్పు కొనుగోలుకు ఎవరూ ముందుకు రావడం లేదు. దీంతో తయారైన పప్పు మార్కెట్‌లో ధర పెరిగే వరకూ వ్యాపారులు నిల్వ ఉంచుకోవాల్సి వస్తోంది. ప్రస్తుతం చిన్న వ్యాపారులు పూర్తిగా జీడిపప్పు ప్రాసెసింగ్ నిలుపుదల చేశారు. పెద్ద వ్యాపారులు 50 మంది వరకూ తయారైన జీడి పప్పు అమ్మకం లేక పరిశ్రమల వద్దే నిల్వ ఉంచుతున్నారు.
కొత్త జీడి పిక్కలపైనే ఆశలు
జీడి సీజను ఉగాది నుంచి సాధారణంగా ప్రారంభమవుతోంది. ఈ ఏడాది కొత్త జీడిపిక్కలపైనే వ్యాపారులంతా ఆశతో ఎదురుచూస్తున్నారు. ఉద్దానం గ్రామాల్లో జీడిపిక్కల మద్దతు ధర కోసం ఇప్పటికే ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొత్త పిక్కల ధరలు ఏ మేరకు ఉంటాయో తెలియని పరిస్థితిలో వ్యాపారులు ఉన్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో దేశీయరకం జీడి పిక్కలు బస్తా(80 కిలోలు) ధర రూ.12,400 వరకూ పలుకుతోంది. కనీస మద్దతు ధర రూ.16వేలు ఇవ్వాలని జీడిరైతులు ఉద్యమిస్తున్నారు. ఇప్పటికే తీవ్ర ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నామని, మద్దతు ధర రూ.16వేలకు పెంచితే తమ పరిస్థితి ఏమిటో అర్థం కావడం లేదని వ్యాపారులు చెబుతున్నారు. కొత్త పిక్కలు మార్కెట్‌లోకి వచ్చినప్పుడు సాధారణ ధరకు అమ్మడం సహజం. దాని ప్రకారమే కొనుగోలు చేసుకుంటే ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కగలమని వ్యాపారులు భావిస్తున్నారు. ఈ ఏడాది జీడి పంట ఆశాజనకంగా ఉండడంతో వ్యాపారులు, రైతులు ఆశతో ఎదురు చూస్తున్నారు.