Share News

Civil Aviation: విజయవాడలో నీటి విమానాశ్రయం

ABN , Publish Date - Mar 04 , 2025 | 05:11 AM

రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మక భావిస్తున్న సీ ప్లేన్‌ ప్రాజెక్టులో భాగంగా విజయవాడలో నీటి విమానాశ్రయం (వాటర్‌ ఏరోడ్రోమ్‌) ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయి.

Civil Aviation: విజయవాడలో నీటి విమానాశ్రయం

  • సీప్లేన్‌ ప్రాజెక్టులో ప్రకాశం బ్యారేజీ వద్ద ఏర్పాటు

  • 20 కోట్ల వ్యయంతో ఏఏఐ అంచనాలు

  • హైదరాబాద్‌-ప్రకాశం బ్యారేజీ మార్గంలో బిడ్ల స్వీకరణ!

(విజయవాడ-ఆంధ్రజ్యోతి)

రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మక భావిస్తున్న సీ ప్లేన్‌ ప్రాజెక్టులో భాగంగా విజయవాడలో నీటి విమానాశ్రయం (వాటర్‌ ఏరోడ్రోమ్‌) ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయి. ప్రకాశం బ్యారే జీ వద్ద రూ.20 కోట్లతో వాటర్‌ ఏరో డ్రోమ్‌ ఏర్పాటుకు ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా అంచనాలు రూపొందించింది. కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ఆర్‌సీఎస్‌ ఉడాన్‌ 3.1 పథకంలో భాగంగా దీన్ని నిర్మించనున్నారు. ప్రకాశం బ్యారేజీ వద్ద దీన్ని ఎక్కడ ఏర్పాటు చేయాలన్న అంశంపై ఇటీవలే ఏఏఐ అధికారులు వచ్చి పరిశీలన చేశారు. హైదరాబాద్‌ - ప్రకాశం బ్యారేజీ - హైదరాబాద్‌ మార్గంలో సీ ప్లేన్లను నడిపేందుకు కొన్ని బిడ్లు కూడా వచ్చినట్టు తెలిసింది. కేంద్ర పౌర విమానయాన శాఖ, ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా, డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ)కు చెందిన అధికారులు ఇటీవలే ప్రకాశం బ్యారేజీని సందర్శించారు. దీని ఏర్పాటుకయ్యే రూ.20 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం భరించనున్న నేపథ్యంలో దీంతో పాటు అదనంగా అయ్యే వ్యయాన్ని తిరిగి చెల్లించాలని, ఉడాన్‌ పథకాన్ని ఈ ఏడాది ఆగస్టు వరకు పొడిగించాలని అధికారులు కేంద్ర బృందాన్ని కోరారు.

Updated Date - Mar 04 , 2025 | 05:11 AM