పంచాయతీల విద్యుత్ బకాయిలు రూ.121 కోట్లు
ABN , Publish Date - Apr 05 , 2025 | 12:39 AM
జిల్లాలో గ్రామ పంచాయతీల విద్యుత్ బిల్లుల బకాయిలు కొండలా పేరుకుపోయి. సుమారు రూ.121 కోట్లు పెండింగ్‌లో వున్నాయి. వీటిని త్వరగా చెల్లించాలంటూ ఏడీలు తమ పరిధిలోని మండలాల్లో ఎంపీడీవోలు, పంచాయతీల కార్యదర్శులతో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. అయితే నిధుల లేమి కారణంగా బిల్లులు చెల్లించలేమని తక్కువ ఆదాయం వున్న చిన్న పంచాయతీల కార్యదర్శులు చేతులెత్తేస్తున్నారు.

ఎంపీడీవోలు, పంచాయతీ కార్యదర్శులతో ఈపీడీసీఎల్ అధికారులు సమావేశాలు
త్వరితగతిన చెల్లించాలని నోటీసులు
నిధులు లేవంటూ చేతులెత్తేస్తున్న చిన్న పంచాయతీల కార్యదర్శులు
నర్సీపట్నం, ఏప్రిల్ 4 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో గ్రామ పంచాయతీల విద్యుత్ బిల్లుల బకాయిలు కొండలా పేరుకుపోయి. సుమారు రూ.121 కోట్లు పెండింగ్‌లో వున్నాయి. వీటిని త్వరగా చెల్లించాలంటూ ఏడీలు తమ పరిధిలోని మండలాల్లో ఎంపీడీవోలు, పంచాయతీల కార్యదర్శులతో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. అయితే నిధుల లేమి కారణంగా బిల్లులు చెల్లించలేమని తక్కువ ఆదాయం వున్న చిన్న పంచాయతీల కార్యదర్శులు చేతులెత్తేస్తున్నారు.
జిల్లాలో 646 గ్రామ పంచాయతీలు వున్నాయి. దాదాపు అన్ని పంచాయతీల్లో తాగునీటి పథకాలు వున్నాయి. ఇంకా వీధి దీపాలు, కార్యాలయాలతోపాటు ఇతర అవసరాలకు వినియోగించిన విద్యుత్తుకు సంబంధించిన 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి నెలాఖరు వరకు రూ.121.9 కోట్ల విద్యుత్ బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఎంపీడీవోలు, పంచాయతీల కార్యదర్శులతో ఈపీడీసీఎల్ సబ్ డివిజన్ అధికారులు సమావేశాలు ఏర్పాటు చేసి, వీలైనంత త్వరగా బకాయిలు చెల్లించాలని కోరుతున్నారు. ఇదే సమయంలో పంచాయతీ కార్యదర్శులకు డిమాండ్ నోటీసులు ఇస్తున్నారు. కాగా పంచాయతీల విద్యుత్ బిల్లులకంటూ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు మంజూరు చేయదు. పంచాయతీల సాధారణ నిధులు, 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి విద్యుత్ బిల్లులు చెల్లించాలి. కానీ జిల్లాలో అత్యధిక పంచాయతీకు సాధారణ నిధులు (ఇళ్ల పన్నులు, వగైరా) చాలా తక్కువ వుంటున్నాయి. ఇవి పారిశుధ్య పనులకు, నీటి పథకాల నిర్వహణ పనులకే చాలడంలేదు. దీంతో విద్యుత్ బిల్లులు సకాలంలో చెల్లించలేని పరిస్థితి ఏర్పడుతున్నది. కానీ ఆర్థిక సంఘం నిధులతో విద్యుత్ బిల్లులు చెల్లించే అవకాశం వున్నప్పటికీ బకాయిలు కట్టడంలేదని ఈపీడీసీఎల్ అధికారులు అంటున్నారు.
జిల్లాలో ఈపీడీసీఎల్‌కి సంబంధించి అనకాపల్లి, కశింకోట, నర్సీపట్నం డివిజన్‌లు ఉన్నాయి. అనకాపల్లిలో 4, కశింకోటలో 5, నర్సీపట్నంలో 4 చొప్పున మొత్తం 13 సబ్ డివిజనల్‌లు ఉన్నాయి. నర్సీపట్నం డీఈఈ పరిధిలో నాతవరం, చోడవరం, మాడుగుల, నర్సీపట్నం సబ్ డివిజన్‌లు ఉన్నాయి. నర్సీపట్నం ఈఈఈ పరిధిలోని మండలాల్లో వున్న పంచాయతీల నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిలు ఇలా ఉన్నాయి.
బుచ్చెయ్యపేట రూ.2,32,75,449, చీడికాడ రూ.1,46,16,887, మాడుగుల రూ.1,78,83,257, రావికమతం రూ.1,86,14,876, చోడవరం రూ.3,44,43,073, దేవరాపల్లి రూ.89,22,161, కె.కోటపాడు రూ.1,61,91,409, వెంకన్నపాలెం (చోడవరం రూరల్) రూ.4,42,77,748, గొలుగొండ రూ.1,64,67,383, కోటవురట్ల రూ.2,71,43,295, నాతవరం రూ.2,59,84,561, మాకవరపాలెం రూ.2,07,32,700, రోలుగుంట రూ.1,34,,50446, నర్సీపట్నం 10,42,593 చొప్పున మొత్తం రూ.28,30,45,838 బకాయిలు చెల్లించాలి.