Share News

వైసీపీకి మాజీ ఎమ్మెల్యే నాగిరెడ్డి కుమారుడు గుడ్‌బై

ABN , Publish Date - Apr 13 , 2025 | 01:34 AM

గాజువాక మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి కుమారుడు, 74వ వార్డు కార్పొరేటర్‌ తిప్పల వంశీరెడ్డి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి గుడ్‌బై చెప్పారు.

వైసీపీకి మాజీ ఎమ్మెల్యే  నాగిరెడ్డి కుమారుడు గుడ్‌బై

  • జనసేనలో చేరుతున్నట్టు ప్రకటించిన 74వ వార్డు కార్పొరేటర్‌ వంశీరెడ్డి

  • ఆక్రమణలు కాపాడుకోవడానికేనని ప్రచారం

విశాఖపట్నం, ఏప్రిల్‌ 12 (ఆంధ్రజ్యోతి):

గాజువాక మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి కుమారుడు, 74వ వార్డు కార్పొరేటర్‌ తిప్పల వంశీరెడ్డి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి గుడ్‌బై చెప్పారు. త్వరలో డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ సమక్షంలో జనసేనలో చేరనున్నట్టు శనివారం ప్రకటించారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు... తండ్రి అధికారాన్ని అడ్డంపెట్టుకుని కుమారులిద్దరూ రెచ్చిపోయారనే విమర్శలు వెల్లువెత్తాయి. 74వ వార్డు కార్పొరేటర్‌గా ఉన్న వంశీరెడ్డి తన వార్డులో పెద్దఎత్తున ప్రభుత్వ భూముల ఆక్రమణకు పాల్పడ్డారని, దయాల్‌నగర్‌ కొండపై ఇళ్లు నిర్మించుకున్నవారి నుంచి డబ్బులు డిమాండ్‌ చేశారని, అడిగినంత ఇవ్వకపోతే జీవీఎంసీ, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదుచేసి నిర్మాణాలను కూల్చివేయించారనే ఆరోపణలు ఉన్నాయి. వంశీరెడ్డి ఆక్రమణలపై ఇటీవల ‘ఆంధ్రజ్యోతి’లో వరుస కథనాలు ప్రచురితమయ్యాయి. పెదగంట్యాడలో ప్రైవేటు భూమిని కొనుగోలు చేసిన వ్యక్తులు కొందరు దానిని అనుకుని ఉన్న ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుంటే వారిని బెదిరించి రూ.45 లక్షలు వసూలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. అదే భూమిలో తనకు గతంలో అనుచరుడిగా వ్యవహరించిన వ్యక్తి కల్యాణ మండపం నిర్మిస్తుంటే అధికారులను అటువైపు వెళ్లకుండా ఒత్తిడితెచ్చారు. దీనిపై ‘ఆంధ్రజ్యోతి’లో కథనం ప్రచురితమవడంతో రెవెన్యూ అధికారులు కల్యాణమండపాన్ని తొలగించారు. అదే సర్వేనంబర్‌లో వంశీరెడ్డి కొన్ని షెడ్‌లు నిర్మించి అద్దెకు ఇచ్చినట్టు ఆరోపణలు ఉండడంతో వాటిని తొలగించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఆయా షెడ్లను కాపాడుకునేందుకు వంశీరెడ్డి అన్ని విధాలుగా యత్నిస్తున్నారని, అందులో భాగంగానే వైసీపీని వీడి జనసేనలో చేరాలని నిర్ణయించుకున్నారని ప్రచారం జరుగుతోంది. వంశీరెడ్డి శుక్రవారం మధ్యాహ్నం రామ్‌నగర్‌లోని ఒక హోటల్‌లో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్‌ సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్నారనే ప్రచారం జరిగింది. ఇంతలోనే తిరిగి జనసేనలో చేరుతున్నట్టు ప్రకటించడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Updated Date - Apr 13 , 2025 | 01:34 AM