Share News

మాత, శిశు మరణాల నియంత్రణకు చర్యలు

ABN , Publish Date - Apr 12 , 2025 | 11:37 PM

గిరిజన ప్రాంతంలో మాత, శిశు మరణాలు నియంత్రించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ జమాల్‌ బాషా అన్నారు.

మాత, శిశు మరణాల నియంత్రణకు చర్యలు
ఏరియా ఆస్పత్రిలో రోగులతో మాట్లాడుతున్న డీఎంహెచ్‌వో జమాల్‌ బాషా

గర్భిణులు విధిగా స్కానింగ్‌లు చేయించుకోవాలి

డీఎంహెచ్‌వో డాక్టర్‌ జమాల్‌ బాషా

చింతపల్లి, ఏప్రిల్‌ 12 (ఆంధ్రజ్యోతి): గిరిజన ప్రాంతంలో మాత, శిశు మరణాలు నియంత్రించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ జమాల్‌ బాషా అన్నారు. శనివారం స్థానిక ఏరియా ఆస్పత్రి, లోతుగెడ్డ పీహెచ్‌సీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఏరియా ఆస్పత్రిలో జరుగుతున్న అలా్ట్రసౌండ్‌ స్కానింగ్‌ల వివరాలను సూపరింటెండెంట్‌ డాక్టర్‌ పి. ఇందిరా ప్రియాంకను అడిగి తెలుసుకున్నారు. వార్డులో రోగులకు అందుతున్న వైద్యసేవాలను పరిశీలించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌వో మాట్లాడుతూ మాత, శిశు మరణాలు సంభవించకుండా పీహెచ్‌సీ వైద్యాధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశామన్నారు. గర్భిణులకు ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు నిర్వహిస్తూ ఆరోగ్య శాఖ సిబ్బంది చింతపల్లి తీసుకొచ్చి అలా్ట్రసౌండ్‌ స్కానింగ్‌ చేయించాలని సూచించామన్నారు. ప్రతీ గర్భిణి కచ్చితంగా స్కానింగ్‌ చేయించుకోవాలన్నారు. స్త్రీ వైద్యనిపుణులు సూచన మేరకు ప్రమాదకర ప్రసవాలను గుర్తిస్తే పీహెచ్‌సీ వైద్యులు ముందస్తు ప్రత్యేక ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. ప్రతీ గర్భిణి ఆస్పత్రిలో వైద్యుల పర్యవేక్షణలో ప్రసవం పొందాలన్నారు. దీనివల్ల మాత, శిశు మరణాలు తగ్గుతాయన్నారు. గర్భిణులు ప్రసవ సమయానికి పది రోజులు ముందుగా ఆస్పత్రిలో చేరాలన్నారు. చింతపల్లిలో ఉన్న గర్భిణుల వసతి గృహాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఏరియా ఆస్పత్రి వైద్యులు స్కానింగ్‌లకు సంబంధించిన ఫారం-ఎఫ్‌ను ఎప్పటికప్పుడు జిల్లా కార్యాలయానికి పంపించాలన్నారు. ఎపిడమిక్‌ సీజన్‌ ప్రారంభం కావడంతో గ్రామాల్లో వ్యాధులు ప్రబలుతున్నాయన్నారు. వైద్యాధికారులు, సిబ్బంది అందుబాటులో ఉంటూ మెరుగైన చికిత్స అందించాలన్నారు. పీహెచ్‌సీ పరిధిలో ప్రత్యేక వైద్యశిబిరాలను ఏర్పాటు చేయాలన్నారు. ఏరియా ఆస్పత్రి, పీహెచ్‌సీల్లో మందుల కొరత లేదని, ప్రభుత్వ వైద్యుల సేవలను ఉపయోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీహెచ్‌వో గుల్లెలి సింహాద్రి పాల్గొన్నారు.

Updated Date - Apr 12 , 2025 | 11:37 PM