రాష్ట్ర పండుగగా నూకాంబిక అమ్మవారి జాతర
ABN , Publish Date - Mar 13 , 2025 | 01:45 AM
స్థానిక నూకాంబిక అమ్మవారి కొత్త అమావాస్య జాతరను రాష్ట్ర పండుగగా ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
జీవో కాపీలకు అమ్మవారి బాలాలయంలో పూజలు
అనకాపల్లి టౌన్, మార్చి 12 (ఆంధ్రజ్యోతి):
స్థానిక నూకాంబిక అమ్మవారి కొత్త అమావాస్య జాతరను రాష్ట్ర పండుగగా ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో కూటమి నాయకులు ఆనందోత్సవాలు నిర్వహించారు. కూటమి అధికారంలోకి వస్తే నూకాంబిక అమ్మవారి జాతరను రాష్ట్ర పండుగగా నిర్వహించేలా కృషి చేస్తానని గత ఏడాది ఎన్నికల ముందు జనసేన అభ్యర్థి కొణతాల రామకృష్ణ హామీ ఇచ్చారు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ఈ విషయాన్ని సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ల దృష్టికి తీసుకెళ్లి వినతిపత్రాలు అందించారు. ఇందుకు వారు సానుకూలంగా స్పందించారు. ఈ మేరకు నూకాంబిక అమ్మవారి కొత్త అమావాస్య జాతరను రాష్ట్ర పండుగగా నిర్వహించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో బుధవారం సాయంత్రం కూటమి పార్టీల నాయకులు ఆలయ ఆవరణలో మిఠాయిలు పంచి బాణసంచా వెలిగించారు. జీవో కాపీలకు అమ్మవారి బాలాలయంలో పూజలు నిర్వహించారు. పంచలోహ ఉత్సవ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, ఆలయ ఈవో ఎన్.సుజాత, చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ కె. శోభారాణి, పలువురు నాయకులు పాల్గొన్నారు.