ప్రజా ఉద్యమకారుడు నాగులాపల్లి కన్నుమూత
ABN , Publish Date - Mar 13 , 2025 | 01:44 AM
ప్రజా ఉద్యమకారుడు, రాజాం మాజీ సర్పంచ్ నాగులాపల్లి సత్యనారాయణ (62) కన్నుమూశారు.

బుచ్చెయ్యపేట, మార్చి 12 (ఆంధ్రజ్యోతి):
ప్రజా ఉద్యమకారుడు, రాజాం మాజీ సర్పంచ్ నాగులాపల్లి సత్యనారాయణ (62) కన్నుమూశారు. కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆరోగ్యం విషమించడంతో మంగళవారం రాత్రి రాజాంలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య, ఇద్దరు బిడ్డలు వున్నారు. వామపక్ష భావంజాలం వున్న సత్యనారాయణ ప్రజల సమస్యలపై ఎన్నో పోరాటాలు చేశారు. సిరిల్‌రెడ్డి, గద్దర్, వంగపండు ప్రసాదరావు, మేధాపాట్కర్, తమ్మారెడ్డి భరద్వాజ వంటివారితో కలిసి పనిచేశారు. కొద్దికాలం పీపుల్స్ వార్ గ్రూపులో (ప్రస్తుత మావోయిస్టు పార్టీ) పనిచేసిన ఆయన నాటి ప్రభుత్వ పిలుపుమేరకు జనజీవనస్రవంతిలో కలిశారు. అప్పటి నుంచి రెండు దశాబ్దాలకుపైగా ఎన్నో భూపోరాటాలు చేసి దళిత, గిరిజన, బడుగు, బలహీనవర్గాలకు ప్రభుత్వ భూములను పంపిణీ చేయించారు. వీరి పక్షాన న్యాయస్థానాల్లో పోరాటం చేశారు. కూలీలు, కార్మికుల కోసం వ్యవసాయ కూలీ సంఘాన్ని స్థాపించి వారికి అండగా నిలిచారు. కొంతకాలం తరువాత తెలుగుదేశం పార్టీలో చేరి రాజాం సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. ఇదే సమయంలో బుచ్చెయ్యపేట మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షునిగా పనిచేశారు. నాగులాపల్లి సత్యనారాయణ మృతి బడుగు, బలహీనవర్గాలకు తీరని లోటని చోడవరం ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్ రాజు అన్నారు. బుచ్చెయ్యపేట జడ్పీటీసీ దొండా రాంబాబు, డీసీసీ అధ్యక్షుడు మీసాల సుబ్బన్న, విశాఖ డెయిరీ డైరెక్టర్ గేదెల సత్యనారాయణ, ప్రజా సంఘాల నేత కనకారావు, రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యదర్శి దంతులూరి వర్మ, పలువురు ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు, ప్రజాసంఘాల ప్రతినిధులు నాగులాపల్లికి నివాళులు అర్పించారు.