Share News

వైసీపీ ‘యువత పోరు’

ABN , Publish Date - Mar 13 , 2025 | 01:48 AM

వైసీపీ నాయకులు బుధవారం ‘యువత పోరు’ పేరుతో ఇక్కడ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు.

వైసీపీ ‘యువత పోరు’

పార్టీ ఆఫీసు నుంచి కలెక్టరేట్‌కు బైక్‌ ర్యాలీ

డీఆర్వోకు వినతిపత్రం

పోరులో కానరాని యువత, విద్యార్థులు

అనకాపల్లి టౌన్‌/ కలెక్టరేట్‌, మార్చి 12 (ఆంధ్రజ్యోతి):

వైసీపీ నాయకులు బుధవారం ‘యువత పోరు’ పేరుతో ఇక్కడ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. రింగురోడ్డులోని పార్టీ కార్యాలయం నుంచి భీమునిగుమ్మం, నాయుళ్లవీధి, నెహ్రూచౌక్‌, మెయిన్‌రోడ్డు మీదుగా శంకరంలోని కలెక్టరేట్‌కు ద్విచక్ర వాహనాలపై ర్యాలీగా వెళ్లారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌, వసతిదీవెన బకాయిలు విడుదల చేయాలని, నిరుద్యోగులకు భృతి అందజేయాలని, కొత్త మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణ ప్రయత్నాలను విరమించుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షుడు బూడి ముత్యాలనాయుడు మాట్లాడుతూ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ డబ్బులు సకాలంలో విడుదల చేయకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు అప్పులు చేసి ఫీజులు కట్టాల్సి వస్తున్నదని అన్నారు. నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల చొప్పున భృతి ఇస్తామన్న హామీని తొమ్మిది నెలలైనా అమలు చేయలేదని అన్నారు. అనంతరం డీఆర్‌వో సత్యనారాయణరావుకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గం ఇన్‌చార్జి కరణం ధర్మశ్రీ, అసెంబ్లీ నియోజకవర్గం సమన్వయకర్త మలసాల భరత్‌కుమార్‌, మాజీ ఎంపీ డాక్టర్‌ బీవీ సత్యవతి, మాజీ ఎమ్మెల్యేలు కన్నబాబురాజు, ఎ.అదీప్‌రాజ్‌, పెట్ల ఉమాశంకర్‌గణేశ్‌, కంబాల జోగులు, నాయకులు ఈర్లె అనురాధ, ఏడువాక సత్యారావు, బొడ్డేడ ప్రసాద్‌, మందపాటి జానకిరామరాజు, తదితరులు పాల్గొన్నారు.

వైసీపీ పోరు వెలవెల

అనకాపల్లి, మార్చి 12 (ఆంధ్రజ్యోతి):

‘యువత పోరు’ కార్యక్రమం వెలవెల బోయింది. యువత, విద్యార్థులు పాల్గొనాల్సిన ఈ కార్యక్రమంలో వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యేలు, నాయకులు మాత్రమే కనిపించారు. వారు కూడా పదుల సంఖ్యలోనే హాజరయ్యారు.

Updated Date - Mar 13 , 2025 | 01:48 AM