ఫార్మర్ రిజిస్ర్టీకి ఆటంకాలు
ABN , Publish Date - Mar 13 , 2025 | 01:42 AM
జిల్లాలో ప్రతి రైతుకు ఆధార్ తరహాలో 14 అంకెల యూనిక్ కోడ్‌తో (ఫార్మర్ రిజిస్ర్టీ) కార్డులను జారీ చేయడంలో రెవెన్యూ సిబ్బందికి చిక్కులు ఎదురవుతున్నాయి.

రైతులకు యూనిక్ కోడ్ నంబరు కేటాయింపులో రెవెన్యూ చిక్కులు
పలు గ్రామాల్లో వెబ్‌ల్యాండ్‌లో కనిపించని భూముల వివరాలు
ఈ నెల 25తో ముగియనున్న నమోదు గడువు
(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)
జిల్లాలో ప్రతి రైతుకు ఆధార్ తరహాలో 14 అంకెల యూనిక్ కోడ్‌తో (ఫార్మర్ రిజిస్ర్టీ) కార్డులను జారీ చేయడంలో రెవెన్యూ సిబ్బందికి చిక్కులు ఎదురవుతున్నాయి. జనవరి 26న ప్రారంభించిన ఈ కార్యక్రమాన్ని ఈ నెల 25వ తేదీతో ముగించాలని ప్రభుత్వం ఆదేశించింది. కానీ పలు మండలాల్లో ప్రభుత్వ వెబ్‌ల్యాండ్‌లో భూముల వివరాలు కనిపించకపోవడం, వివరాలు ఉన్నప్పటికీ లోపభూయిష్టంగా నమోదవడం వంటి కారణాలతో కార్డుల జారీ మందకొడిగా సాగుతున్నది.
వ్యవసాయ శాఖ వద్ద వున్న లెక్కట ప్రకారం జిల్లాలో 2,80,524 మంది రైతులకు 14 అంకెలతో ఆధార్ తరహాలో కార్డులను జారీ చేయాలని ప్రభుత్వం భావించింది. జవనరి 26వ తేదీన వెబ్‌పోర్టల్‌ను అధికారులు ప్రారంభించారు. ఈ నెల 25వ తేదీలోగా శత శాతం రైతులకు కార్డులు జారీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అన్ని రైతు సేవా కేంద్రాల్లో శిబిరాలు నిర్వహిస్తున్నారు. అయితే వివిధ కారణాల వల్ల బుధవారం నాటికి 1,95,558 మంది రైతులకు మాత్రమే యూనిక్ కోడ్ నంబర్లను కేటాయించారు. ఇంకా 84,966 మంది రైతులకు నంబర్లు కేటాయించాల్సి ఉంది. వీరిలో సుమారు 35 వేల మంది రైతులకు కోడ్‌లను కేటాయించేందుకు సమస్యలు ఎదురవుతున్నాయి. ప్రధానంగా రైతుల ఆధీనంలో ఉన్న అటవీ శాఖ సెటిల్‌మెంట్ భూముల వివరాలు, ఇనాం, డి.పట్టా, దేవదాయ శాఖ భూముల వివరాలు రెవెన్యూ శాఖ వెబ్‌ల్యాండ్‌లో కనిపించడం లేదని తెలిసింది. ఇంకా కొంతమంది రైతుల జిరాయితీ భూములకు సంబంధించి పేర్లు, చిరునామా, బ్యాంకు ఖాతా, ఆధార్ నంబర్లు వెబ్‌ల్యాండ్‌లో తప్పుగా నమోదు కావడంతో ఆయా రైతుల వివరాలు అప్‌లోడ్ కావడంలేదని వ్యవసాయ సిబ్బంది అంటున్నారు.
వివిధ మండలాల్లో 42 గ్రామాల్లో సగం మంది రైతుల భూముల వివరాలు వెబ్‌ల్యాండ్‌లో కనిపించడం లేదని చెబుతున్నారు. దీంతో ఆయా గ్రామాల్లో యూనిక్ కోడ్‌ల కేటాయింపు పెండింగ్‌లో పెట్టారు. మాడుగుల మండలంలో రెండు గ్రామాలు, ఎస్.రాయవరం మండలంలో మూడు, దేవరాపల్లి మండలంలో రెండు, మునగపాకలో రెండు, అచ్యుతాపురంలో ఒక గ్రామానికి సంబంధించి రైతుల భూముల వివరాల వెబ్‌ల్యాండ్‌లో కనిపించడం లేదని తెలిసింది. దీనిపై జిల్లా వ్యవసాయాధికారి మోహన్‌రావును ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిఽధి వివరణ కోరగా, రెవెన్యూ పరంగా సమస్యలు ఎదురైన రైతుల వివరాలను సంబంధిత మండల రెవెన్యూ అధికారుల దృష్టిలో పెడుతున్నామన్నారు. గడువులోగా యూనిక్ కోడ్ నంబర్లు కేటాయించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఒకవేళ గడువులోగా నంబర్ల కేటాయింపు జరగకపోయినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.