Share News

బీఎన్‌ రోడ్డు విస్తరణకు సర్వే

ABN , Publish Date - Mar 13 , 2025 | 01:41 AM

ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) కింద జిల్లాలో చేపట్టనున్న భీమునిపట్నం- నర్సీపట్నం రోడ్డు అభివృద్ధికి సంబంధించి సర్వేకు రంగం సిద్ధమైంది.

బీఎన్‌ రోడ్డు విస్తరణకు సర్వే

మండల కేంద్రాల్లో 80 అడుగులు, ఇతరచోట్ల 100 అడుగుల మేర రోడ్డు నిర్మాణం

ఇరువైపులా ప్రభుత్వ, ప్రైవేటు భూముల వివరాల సేకరణ

నిర్వాసితులకు నష్టపరిహారంపై అంచనాలు

అధికారులతో ఎమ్మెల్యే రాజు సమావేశం

చోడవరం, మార్చి 12 (ఆంధ్రజ్యోతి):

ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) కింద జిల్లాలో చేపట్టనున్న భీమునిపట్నం- నర్సీపట్నం రోడ్డు అభివృద్ధికి సంబంధించి సర్వేకు రంగం సిద్ధమైంది. స్టేట్‌ హైవేగా రెండు లేన్లతో విస్తరించేందుకు ఎల్‌ఈఏ సంస్థ ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. రోడ్డుకు ఇరువైౖపులా భూములు, స్థలాలు పోతున్న వారి వివరాలు సేకరించేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు నాలుగు మండలాల రెవెన్యూ అధికారులతో సమావేశం నిర్వహించారు. మండల కేంద్రాల్లో 80 అడుగులు, ఇతరచోట్ల వంద అడుగుల మేర మార్కింగ్‌ చేసి, ఆ మేరకు స్థలాల వివరాలు, నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లింపునకు సంబంధించి నివేదిక సిద్ధం చేయాలని ఆయన సూచించారు.

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో రహదారులను అభివృద్ధి చేయనున్నట్టు ప్రకటించింది. ఇటీవల ఆయా రహదారుల జాబితాను కూడా విడుదల చేసింది. రెండవ ప్యాకేజీలో సబ్బవరం-నర్సీపట్నం (బీఎన్‌) రోడ్డు వుంది. దీనిని పీపీపీ పద్ధతిలో నిర్మించేందుకు ఎల్‌ఈఏ సంస్థ ముందుకు వచ్చింది. ఈ సంస్థ డీపీఆర్‌ తయారీకి సిద్ధమవుతున్నది. సబ్బవరం నుంచి చోడవరం, వడ్డాది, కొత్తకోట మీదుగా నర్సీపట్నం వరకు సుమారు 81 కిలోమీటర్ల మేర రెండు లేన్ల రోడ్డు నిర్మించనున్నారు. మధ్యలో నదులు, గెడ్డలు, వాగులు, పంటకాలువలపై వంతెనలు/ కల్వర్టులు నిర్మిస్తారు. రోడ్డు అందుబాటులోకి వచ్చిన తరువాత సదరు సంస్థ 30 సంవత్సరాలపాటు వాహనదారుల నుంచి టోల్‌ ఫీజు వసూలు చేస్తుంది. రోడ్డు నిర్మాణానికి సేకరించే జిరాయితీ భూములకు రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం చెల్లిస్తుంది. రోడ్డు నిర్మాణానికి అయ్యే వ్యయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 40 శాతం భరిస్తాయి. మిగిలిన ఖర్చును ఎల్‌ఈఏ సంస్థ భరిస్తుంది.

రోడ్డు విస్తరణ కోసం రెండు వైపులా ప్రభుత్వ, ప్రైవేటు భూములను గుర్తించి వివరాలు సేకరించేందుకు అధికార యంత్రాంగం సిద్ధమైంది. ఇందులో భాగంగా మంగళవారం రాత్రి స్థానిక ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు నాలుగు మండలాల తహసీల్దార్లు, రెవెన్యూ అధికారులతో సమావేశం నిర్వహించారు. మండల కేంద్రాల్లో 80 అడుగుల మేర, ఇతర ప్రాంతాల్లో వంద అడుగుల మేర మార్కింగ్‌ చేసి, ఆ మేరకు స్థలాల వివరాలతో నివేదిక సిద్ధం చేయాలని సూచించారు. ప్రభుత్వ స్థలం ఎంత, ప్రైవేటు స్థలం ఎంత, ఇవ్వవలసిన పరిహారం, ఇతర వివరాలను ఉజ్జాయింపుగా నమోదు చేయాలని సూచించారు.

Updated Date - Mar 13 , 2025 | 01:41 AM