Share News

సచివాలయాల ప్రక్షాళన

ABN , Publish Date - Mar 13 , 2025 | 01:47 AM

గ్రామ/ వార్డు సచివాలయ వ్యవస్థను ప్రక్షాళన చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

సచివాలయాల ప్రక్షాళన

  • క్లస్టర్ల వారీగా సిబ్బంది విభజన

  • జనాభా ప్రాతిపదికన సర్దుబాటు

  • 3,500 ప్లస్‌ జనాభా ఉంటే ఎనిమిది మంది ఉద్యోగులు

  • 2,500-3,500 జనాభాకు ఏడుగురు..

  • 2,500 కన్నా తక్కువ జనభా ఉంటే ఆరుగురు సిబ్బంది

  • ఇంకా మిగిలితే సంబంధిత శాఖలకు కేటాయింపు

అనకాపల్లి, మార్చి 12 (ఆంధ్రజ్యోతి):

గ్రామ/ వార్డు సచివాలయ వ్యవస్థను ప్రక్షాళన చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జనాభా ఆధారంగా సచివాలయాలను మూడు కేటగిరీలుగా విభజించేందుకు మార్గదర్శకాలను విడుదల చేసింది. దీంతో జిల్లాలో వున్న 522 గ్రామ/ వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న సిబ్బందిని టెక్నికల్‌, నాన్‌ టెక్నికల్‌గా విభజించి కస్టర్ల వారీగా సర్దుబాటు చేసేందుకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. సచివాలయాల్లో సగటున 11 మంది చొప్పున ఉద్యోగులు వుండాలి. ఈ ప్రకారం జిల్లాలోని గ్రామ/ వార్డు సచివాలయాల్లో 5,742 మంది వుండాలి. అయితే గత ప్రభుత్వం పోస్టులను పూర్తిస్థాయిలో భర్తీ చేయలేదు. టెక్నికల్‌, నాన్‌ టెక్నికల్‌ కేడర్లకు చెందిన ఉద్యోగులు 3,422 మంది మాత్రమే ప్రస్తుతం పనిచేస్తున్నారు. కొన్ని సచివాలయాల్లో పది మందికిపైగా సిబ్బంది వుండగా, అత్యధిక సచివాలయాల్లో సగంకన్నా తక్కువ మంది వున్నారు. కొన్నిచోట్ల ఇద్దరు, ముగ్గురు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. పూర్తిస్థాయిలో సిబ్బంది ఉన్న సచివాలయాల్లో చాలామందికి సరైన పని ఉండడం లేదనే విమర్శలున్నాయి. తక్కువ మంది సిబ్బంది వున్న చోట్ల పనిభారం అధికంగా వుంది. ఇటువంటి అస్తవ్యస్త పరిస్థితులను చక్కదిద్ది సచివాలయ వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం జనాభా ఆధారంగా ఉద్యోగులను సర్దుబాటు చేయనున్నది. 3,500 మంది అంతకన్నా ఎక్కువ జనాభా ఉన్న సచివాలయాలకు ఎనిమిది మంది సిబ్బంది వుండేలా సర్దుబాటు చేస్తారు. 2,500 నుంచి 3,500 వరకు జనాభా ఉంటే ఏడుగురు, 2,500 కన్నా తక్కువ జనాభా ఉన్న సచివాలయాలకు ఆరుగురు వంతున ఉద్యోగులను కేటాయిస్తారు. ఇంజనీరింగ్‌, వ్యసాయ శాఖల్లో టెక్నికల్‌ సిబ్బందిని రెండు సచివాలయాలకు ఒకరిచొప్పున సర్దుబాటు చేస్తారు. జనాభా ప్రాతిపదికన సచివాలయాల్లో ఉద్యోగులను సర్దుబాటు చేసిన తరువాత ఇంకా మిగిలి ఉన్న ఉద్యోగులను సంబంధిత శాఖలకు కేటాయిస్తారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న సిబ్బంది పర్సనల్‌ డేటాను సేకరిస్తున్నామని జిల్లా అధికారి ఒకరు తెలిపారు. ఈ ప్రక్రియను కొద్దిరోజుల్లో పూర్తిచేసి, కలెక్టరు ఆమోదం కోసం పంపనున్నట్లు చెప్పారు.

Updated Date - Mar 13 , 2025 | 01:47 AM