ప్రభుత్వ భూమిలో కల్యాణ మండపం నిర్మాణంపై కదిలిన రెవెన్యూ
ABN , Publish Date - Mar 13 , 2025 | 01:35 AM
గాజువాక బీసీ రోడ్డులో ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని కల్యాణ మండపం నిర్మిస్తున్న వ్యక్తికి నోటీస్ జారీచేసినట్టు పెదగంట్యాడ తహశీల్దార్ అమల బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.

నిర్మాణదారులకు నోటీస్
‘ఆంధ్రజ్యోతి’ ఎఫెక్ట్
విశాఖపట్నం, మార్చి 12 (ఆంధ్రజ్యోతి):
గాజువాక బీసీ రోడ్డులో ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని కల్యాణ మండపం నిర్మిస్తున్న వ్యక్తికి నోటీస్ జారీచేసినట్టు పెదగంట్యాడ తహశీల్దార్ అమల బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పెదగంట్యాడ సర్వే నంబర్ 43/5/ఏలో గల ప్రైవేటు స్థలంతోపాటు సర్వే నంబర్ 43/1లోని ప్రభుత్వ భూమిలో ఒకరు కల్యాణ మండపం నిర్మిస్తుండడంపై ఈనెల తొమ్మిదో తేదీన ‘ఆంధ్రజ్యోతి’లో ‘ప్రభుత్వ భూమి కబ్జా’ శీర్షికతో కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన రెవెన్యూ అధికారులు ప్రభుత్వ భూమిలో నిర్మాణంపై వారం రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ నిర్మాణదారులు ఆదిరెడ్డి విజయకు మంగళవారం నోటీస్ పంపించారు. వారంరోజుల్లోగా వివరణ ఇవ్వని పక్షంలో తామే తొలగింపునకు రంగంలోకి దిగుతామని స్పష్టంచేశారు.
15న జడ్పీ స్థాయీ సంఘ సమావేశాలు
విశాఖపట్నం, మార్చి 12 (ఆంధ్రజ్యోతి):
జిల్లా పరిషత్ స్థాయీ సంఘ సమావేశాలు ఈనెల 15వ తేదీ శనివారం చైర్‌పర్సన్ జల్లిపల్లి సుభద్ర అధ్యక్షతన నిర్వహిస్తున్నట్టు సీఈవో పి.నారాయణమూర్తి తెలిపారు. ఉదయం పది గంటలకు రెండు, ఐదో స్థాయీ సంఘ సమావేశాలు, 11 గంటలకు 3,4, మధ్యాహ్నం 12 గంటలకు 1,6,7 స్థాయీ సంఘ సమావేశాలు జరుగుతాయన్నారు. సంబంధిత అధికారులు తమ శాఖల ద్వారా అమలుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై నివేదికలతో జడ్పీ సమావేశ మందిరానికి హాజరుకావాలని కోరారు.