టార్గెట్ ఒలింపిక్స్
ABN , Publish Date - Mar 13 , 2025 | 01:36 AM
కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడా మంత్రిత్వ శాఖ ఆధ్యర్యంలోని టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ (టాప్స్)కు నగరానికి చెందిన అంతర్జాతీయ అథ్లెట్, ఒలింపియన్ ఎర్రాజీ జ్యోతి ఎంపికైంది.

’టాప్స్’ కోర్ గ్రూపులో ఒలింపియన్ ఎర్రాజి జ్యోతికి స్థానం
2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్‌లో పతకమే లక్ష్యం
కేంద్ర క్రీడా శాఖ నుంచి నెలకు రూ.50 వేలు ఉపకార వేతనం
విశాఖపట్నం, స్పోర్ట్సు, మార్చి 12 (ఆంధ్రజ్యోతి):
కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడా మంత్రిత్వ శాఖ ఆధ్యర్యంలోని టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ (టాప్స్)కు నగరానికి చెందిన అంతర్జాతీయ అథ్లెట్, ఒలింపియన్ ఎర్రాజీ జ్యోతి ఎంపికైంది. కోర్, డెవలప్‌మెంట్ అనే రెండు గ్రూపులకు సంబంధించి దేశవ్యాప్తంగా 206 మంది క్రీడాకారులను క్రీడా మంత్రిత్వ శాఖ ఎంపిక చేయగా...కోర్ గ్రూపులో పీవీ సింధు, నీరజ్ చోప్రా, మనుబాకర్ వంటి ఒలింపిక్ మెడలిస్టులతోపాటు నగరానికి చెందిన జ్యోతికి స్థానం లభించింది. ఈ మేరకు జ్యోతికి కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ నుంచి నెలకు రూ.50 వేలు ఉపకార వేతనం అందనుంది. కాగా 2028లో లాస్ ఏంజెల్స్‌లో జరగనున్న ఒలింపిక్స్‌లో దేశానికి పతకాలు అందించే సామర్థ్యం కలిగిన ఉన్నత క్రీడాకారులకు ఈ ‘టాప్స్’ కోర్ గ్రూపులో చోటు దక్కుతుంది.
గత ఏడాది పారిస్‌లో జరిగిన ఒలింపిక్స్‌లో జ్యోతి పాల్గొంది. ఒలింపిక్స్‌లో పాల్గొన్న తొలి భారత మహిళ అథ్లెట్‌గా గుర్తింపుపొందింది. అనేక జాతీయ రికార్డులను సాధించింది. శనివారం ఇరాన్‌లో జరిగిన ఏషియన్ ఇండోర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ మీట్‌లో 60 మీటర్ల హర్డిల్స్‌లో జ్యోతి స్వర్ణ పతకం కైవసం చేసుకుంది. 60 మీటర్ల హర్డిల్స్ రేస్‌ను 8.12 సెకండ్లలో పూర్తిచేసి, గతంతో తాను నెలకొల్పిన జాతీయ రికార్డును తిరగరాసింది. గత నెల డెహ్రాడూన్‌లో జరిగిన జాతీయ క్రీడల అథ్లెటిక్స్‌లో 100, 200 మీటర్ల హర్డిల్స్‌లో స్వర్ణ పతకాలు సాధించి రాష్ట్ర కీర్తిని చాటింది. జాతీయ స్థాయి అథ్లెటిక్స్ మీట్స్‌లో ఇప్పటివరకూ 39 పతకాలు సాధించిన జ్యోతి ఎర్రాజీ....అంతర్జాతీయ ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో తనదైన ఎక్స్‌ప్రెస్ వేగంతో అనేక పతకాలు సొంతం చేసుకుంది.