Share News

ఈదురుగాలుల భీబత్స్తం

ABN , Publish Date - Apr 13 , 2025 | 01:11 AM

అనకాపల్లి పట్టణంలో శనివారం మధ్యాహ్నం ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. హోర్డింగ్‌లు, చెట్లు, విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి. వడగళ్ల వాన జోరుగా కురిసింది. వర్షపాతం 25.8 మిల్లీమీటర్లుగా నమోదైనట్టు వ్యవసాయ పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్తలు తెలిపారు.

ఈదురుగాలుల భీబత్స్తం
పాత్రుడుకాలనీలో నేలకొరిగిన విద్యుత్‌ స్తంభం ఈదురుగాలుల బీభత్సం

- అనకాపల్లిలో నేలకొరిగిన హోర్డింగ్‌లు, చెట్లు, విద్యుత్‌ స్తంభాలు

- జోరుగా వడగళ్ల వాన

అనకాపల్లి టౌన్‌, ఏప్రిల్‌ 12 (ఆంధ్రజ్యోతి): అనకాపల్లి పట్టణంలో శనివారం మధ్యాహ్నం ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. హోర్డింగ్‌లు, చెట్లు, విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి. వడగళ్ల వాన జోరుగా కురిసింది. వర్షపాతం 25.8 మిల్లీమీటర్లుగా నమోదైనట్టు వ్యవసాయ పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్తలు తెలిపారు. విద్యుత్‌ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

పట్టణంలో ఉదయం నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఎండ తీవ్రంగానే ఉంది. గరిష్ఠ ఉష్ణోగ్రత 35.8 డిగ్రీలుగా నమోదైంది. అయితే ఆ తరువాత ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. దట్టంగా మేఘాలు కమ్ముకుని ఈదురుగాలులు ప్రారంభమయ్యాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈదురుగాలుల బీభత్సానికి విద్యుత్‌ స్తంభాలు, విద్యుత్‌ అలంకరణ సెట్టింగ్‌లు, చెట్లు నేలకొరిగాయి. ఆ సమయంలో వడగళ్ల వాన కూడా కురిసింది. ఎన్టీఆర్‌ స్టేడియంలో నూకాంబిక అమ్మవారి కొత్త అమావాస్య జాతరలో భాగంగా జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమాల ఆవరణ అంతా వర్షపునీటితో నిండిపోయింది. ఉత్సవాన్ని తిలకించడానికి వచ్చిన వారి కోసం ఏర్పాటు చేసిన కుర్చీలన్నీ ఈదురుగాలులకు చిందరవందరగా పడిపోయాయి. ఎన్టీఆర్‌ విగ్రహం ఎదురుగా ఉత్సవంలో భాగంగా ఏర్పాటు చేసిన భారీ విద్యుత్‌ సెట్టింగ్‌ కూలిపోయింది. దీంతో ఈ మార్గంలో రాకపోకలు స్తంభించిపోయాయి. ట్రాఫిక్‌, పట్టణ పోలీసులు క్రేన్‌ల సహాయంతో తొలగింపు పనులు చేపట్టారు. పాత్రుడుకాలనీలో రెండు విద్యుత్‌ స్తంభాలు నేలకొరగడంతో పాటు ఒక స్తంభం ఒక ఇంటిపై పడడంతో నష్టం వాటిల్లింది. ఇదే మార్గంలో ఒక చెట్టు కూడా నేలకొరిగింది. గవరపాలెంలోని పార్కు జంక్షన్‌ సమీపాన కూడా విద్యుత్‌ స్తంభం ఒరిగిపోయింది. లక్ష్మీదేవిపేట, గవరపాలెం, ఉడ్‌పేట తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వివిధ ఫ్లెక్సీ కటౌట్లు నేలకొరిగాయి. నెహ్రూచౌక్‌లోని ఫ్లెక్సీ ఒకటి విద్యుత్‌ లైటింగ్‌పై వాలిపోయింది. వర్షం కారణంగా పట్టణంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఆర్టీసీ కాంప్లెక్స్‌ ఆవరణ అంతా వర్షపునీటితో నిండిపోయింది. విజయరామరాజుపేట అండర్‌బ్రిడ్జి కింద వర్షపునీరు నిలిచిపోయింది. దీంతో ఓ ప్రైవేటు బస్సు, ఆర్టీసీ బస్సు ఆ నీళ్లలో నిలిచిపోయాయి. పట్టణంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. మధ్యాహ్నం రెండు గంటల నుంచి నాలుగు గంటల వరకు వర్షం కురవగా, ఆ తరువాత మళ్లీ ఎండకాసింది. అయితే మధ్యాహ్నం రెండు గంటల సమయంలో నిలిచిపోయిన విద్యుత్‌ సరఫరా సాయంత్రం ఆరు గంటలు దాటినా కొన్ని ప్రాంతాల్లో ఇంకా పునరుద్ధరణ కాలేదు. దీంతో వినియోగదారులు ఇబ్బంది పడ్డారు.

Updated Date - Apr 13 , 2025 | 01:12 AM