Share News

CCTV Cameras వసతి గృహాల్లో సీసీ కెమెరాలు

ABN , Publish Date - Apr 08 , 2025 | 11:30 PM

CCTV Cameras in Hostels జిల్లాలోని వసతి గృహాల్లో నెల రోజుల్లోగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని తద్వారా విద్యార్థుల నడవడికలను గమనించాలని కలెక్టర్‌ ఎ.శ్యామ్‌ ప్రసాద్‌ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో సమీక్షించారు.

 CCTV Cameras  వసతి గృహాల్లో సీసీ కెమెరాలు
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ శ్యామ్‌ ప్రసాద్‌

  • షీ కంప్లైంట్‌ బాక్సులు నిర్వహించాలి

  • విద్యార్థుల బాగోగుల బాధ్యత హెచ్‌డబ్ల్యూవోలదే

  • కలెక్టర్‌ శ్యామ్‌ ప్రసాద్‌

పార్వతీపురం, ఏప్రిల్‌ 8 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని వసతి గృహాల్లో నెల రోజుల్లోగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని తద్వారా విద్యార్థుల నడవడికలను గమనించాలని కలెక్టర్‌ ఎ.శ్యామ్‌ ప్రసాద్‌ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో సమీక్షించారు. సీసీ కెమెరాలు నిరంతరం పనిచేసేలా చూడాలని, ఫుటేజ్‌లను ప్రతి నెలా బ్యాకప్‌ చేయాలని ఆదేశించారు. విద్యార్థుల బాగోగులను చూడాల్సిన బాధ్యత హెచ్‌డబ్ల్యూవోలదేనని స్పష్టం చేశారు. వారు బయటకు వెళ్లకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలన్నారు. విద్యార్థుల ఆరోగ్య ప్రమాణాలు మరింత మెరుగ్గా ఉండాలని సూచించారు. చిన్నపాటి జ్వరం వచ్చినా నిర్లక్ష్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించాలన్నారు. బాలికల వసతిగృహంలో షీ కంప్లెంట్‌ బాక్సులను నిర్వహించాలని తెలిపారు. పదో తరగతి ఫలితాల్లో ఈ ఏడాది కూడా జిల్లా ప్రథమ స్థానంలో నిలవాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ ఇతర సంక్షేమ జిల్లా అధికారులు, వసతిగృహాల అధికారులు, హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

మలేరియా రోగులపై ప్రత్యేక శ్రద్ధ

జిల్లాలోని మలేరియా రోగులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్‌ ఆదేశించారు. కలెక్టరేట్‌లో వైద్యాధికారులతో మాట్లాడుతూ..మలేరియా వ్యాధిగ్రస్థులకు మెరుగైన చికిత్సతో పాటు తగినంత నీరు, ఆహారాన్ని అందించాలని తెలిపారు. జిల్లాలో ఆయుష్మాన్‌ భవ కార్డుల జారీ శతశాతం పూర్తికావాలన్నారు. గిరిజన ప్రాంతాల్లో ప్రతి ఒక్కరికీ ఆరోగ్య గుర్తింపు కార్డులు ఉండాలని తెలిపారు. డిజిటల్‌ అసిస్టెంట్ల ద్వారా గిరిజనులకు ఈకేవైసీ చేయించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మే 1 నుంచి యాంటీ లార్వా చేస్తారని, ఈలోగా డయేరియా, మలేరియా వంటి వ్యాధులు వ్యాపించకుండా సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు. వీలైనంత ఎక్కువగా చలివేంద్రాలను ఏర్పాటు చేయాలని, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలని చెప్పారు. ఈ సమీక్షలో డీఎంహెచ్‌వో ఎస్‌.భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 08 , 2025 | 11:30 PM