Share News

Smell... smell కంపు.. కంపు

ABN , Publish Date - Apr 05 , 2025 | 11:56 PM

Smell... smell జిల్లాకేంద్రం పార్వతీపురంలో పారిశుధ్యం పడకేసింది. రోజురోజుకూ పరిస్థితి అధ్వానంగా మారుతోంది. మున్సి పాల్టీలో పారశుధ్య కార్మికుల కొరత, కాలం చెల్లిన వాహనాలు, అధికారుల నిర్లక్ష్యం కారణంగా వార్డులు కంపుకొడుతున్నాయి.

Smell... smell  కంపు.. కంపు
ట్రాక్టర్‌ ద్వారా చెత్తలను డంపింగ్‌ యార్డుకు తరలిస్తున్న దృశ్యం

ఎక్కడికక్కడ పేరుకుపోయిన చెత్తాచెదారం

అస్తవ్యస్తంగా డ్రైనేజీ.. రోడ్డుపైనే మురుగునీరు

దుర్వాసన.. దోమల స్వైరవిహారం

తరచూ ప్రజల రోగాల పాలు

దృష్టి సారించని అధికారులు, పాలకవర్గ సభ్యులు

పార్వతీపురం టౌన్‌, ఏప్రిల్‌ 5 (ఆంధ్రజ్యోతి): జిల్లాకేంద్రం పార్వతీపురంలో పారిశుధ్యం పడకేసింది. రోజురోజుకూ పరిస్థితి అధ్వానంగా మారుతోంది. మున్సి పాల్టీలో పారశుధ్య కార్మికుల కొరత, కాలం చెల్లిన వాహనాలు, అధికారుల నిర్లక్ష్యం కారణంగా వార్డులు కంపుకొడుతున్నాయి. ప్రధాన రహదారుల మినహా ఎక్కడికక్కడే చెత్తకుప్పలు దర్శన మిస్తున్నాయి. కాలువల్లో మురుగునీరు రోడ్లపై ప్రవహిస్తోంది. ఓ వైపు దుర్వాసన.. మరోవైపు దోమలతో ప్రజలు తరచూ రోగాల బారిన పడుతున్నారు. పారిశుఽధ్య నిర్వహణకు ఏటా లక్షలాది రూపాయలు వెచ్చిస్తున్నట్లు చెబుతున్న ప్రజారోగ్య శాఖాధికారులు ఎంతవరకు సఫలీకృతం అయ్యారో వారికే తెలియాలి. క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకుని తగు చర్యలు తీసుకోవాలని జిల్లాకేంద్ర వాసులు, ప్రజా సంఘాల నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు.

ఇదీ పరిస్థితి..

- పార్వతీపురం మున్సిపాల్టీ 2002లో గ్రేడ్‌ -1 మారింది. జిల్లా కేంద్రంగా ఏర్పడి మూడేళ్లు గడిచింది. అయినప్పటికీ పట్టణంలో పారిశుధ్యం మెరుగు పడడం లేదు. పాలకవర్గ సభ్యులు, ప్రజారోగ్యశాఖాధికారుల నిర్లక్ష్యం కారణంగా 30 వార్డుల ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు.

- పార్వతీపురంలోని 80 వేలకు పైగానే జనాభా ఉన్నా.. వారికి తగ్గట్టుగా పారిశుధ్య కార్మికులను పెంచడం లేదు. ప్రస్తుతం మున్సిపాల్టీలో 133 మంది పారిశుధ్య కార్మికులు ఉన్నట్లు కాగితాలపైనే కనిపిస్తుంది తప్పా మస్తర్లలో కనిపించడం లేదని ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మున్సిపాల్టీలో ఇంజనీరింగ్‌, పారిశుధ్య తదితర శాఖల్లో 26 మంది కార్మికులను ఆప్కాస్‌ విధానంలో నియమించారు. అయితే పారిశుధ్య నిర్వహణలో ఎంత మంది నియమించారనేదానిపై ఇప్పటికీ సంబంధిత ప్రజారోగ్యశాఖాధికారుల వద్ద సమగ్ర సమాచారం లేదు. కాగా శాశ్వత, కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ పద్ధతిలో పనిచేస్తున్న కొందరు కార్మికులు తమపై అధికారుల సేవలో ఉంటున్నారనే ఆరోపణలు లేకపోలేదు. కార్మికుల కొరత కారణంగా చెత్త తరలింపు సమస్య రోజురోజుకూ జటిలమవుతోంది.

- తడి, పొడి చెత్తల తరలింపు విషయంలో ప్రజలకు అవగాహన కల్పించడంలో ప్రజారోగ్యశాఖాధికారులతో పాటు సచివాలయ అధికారులు విఫలం అయ్యారనే వ్యాఖ్యలు సర్వత్రా వినిపిస్తున్నాయి.

కాలం చెల్లిన వాహనాలు..

ఎప్పుడో 25 ఏళ్ల కిందట కోనుగోలు చేసిన మూడు ట్రాక్టర్లనే ఇప్పటికీ వినియోగిస్తున్నారు. అవి ఎప్పటికప్పుడు మరమ్మతులకు గురువుతుండడంతో 30 వార్డుల్లో చెత్త, వ్యర్థాల తరలింపు సమస్యగా మారుతోంది. ఆయా వాహనాల తొట్టెల పరిస్థితి ఏలా ఉందంటే.. డంపింగ్‌ యార్డులోకి వెళ్లకముందే సగం చెత్త ఎక్కడ పడితే అక్కడే పడిపోతుంది. మరోవైపు పుష్‌కాట్‌లు కూడా అధ్వానంగా మారాయి. రెండు హైడ్రోలిక్‌ వాహనాలు ఉన్నప్పటికి ప్రధాన రహదారిలోనే వాటిని వినియోగిస్తున్నారు.

నివాసాల మధ్య మురుగు

బెలగాం/పార్వతీపురం టౌన్‌ : పట్టణంలో సరైన డ్రైనేజీ వ్యవస్థ లేదు. పెరిగిన జనాభా అవసరాలకు అనుగుణంగా నిర్మించడం లేదు. కనీసం ఆధునికీకరణ కూడా చేపట్టడం లేదు. కాలువల్లో పూడికతీతలు అనేవి కాగితాలకే పరిమితం చేశారు. దీంతో కొన్ని వార్డుల్లో మురుగునీరు బయటకు పోవడం లేదు. ఇళ్లలో వాడుక నీరంతా లోతట్టు ప్రాంతాల్లో నిలిచిపోతోంది. రాత్రి వేళల్లో దోమలు స్వైర విహారం చేస్తుండడంతో ప్రజలు నానా యాతన పడుతున్నారు. మరికొందరు మలేరియా, ఫైలేరియా, డెంగ్యూ, చికెన్‌గున్యాతో బాధపడుతున్నారు. మరోవైపు భూగర్భ జలాలు కూడా కలుషితమవడంతో ఇంకొందరు డయేరియా బారిన పడుతున్నారు.

ప్రత్యేక దృష్టి

పార్వతీపురం మున్సిపాల్టీని 30 వార్డుల్లో పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నాం. రోజూ కార్యచరణ ప్రణాళికలను సిద్ధం చేస్తున్నాం. వేసవితో పాటు రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని పరిసరాల పరిశుభ్రతపై చర్యలు చేపడుతున్నాం. దీనిపై మహిళా సంఘాల సభ్యులకు అవగాహన కల్పించి విస్తృతంగా ప్రచారం చేస్తాం.

- కె. పకీరు రాజు, ప్రజారోగ్యశాఖ ఇన్‌స్పెక్టర్‌ , పార్వతీపురం మున్సిపాల్టీ

Updated Date - Apr 05 , 2025 | 11:56 PM