Who has a chance? చాన్స్ ఎవరికో?
ABN , Publish Date - Mar 15 , 2025 | 11:48 PM
Who has a chance? సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో కూటమి క్లీన్‌స్వీప్ చేసింది. అన్ని నియోజకవర్గాల్లోనూ కొలువుదీరింది. జిల్లా ప్రజలు అద్వితీయ విజయాన్ని అందించారు. ఇందుకు కృతజ్ఞతగా ప్రభుత్వం కూడా జిల్లాకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోంది. గజపతినగరం నుంచి తొలిసారిగా గెలిచిన కొండపల్లి శ్రీనివాస్‌కు మంత్రి పదవి ఇచ్చింది. యువతను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో సీఎం చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు. అలాగే నామినేటెడ్ పదవుల్లో జిల్లాకు చెందిన నలుగురికి రాష్ట్రస్థాయి పదవులు కట్టబెట్టారు. తాజాగా కావలి గ్రీష్మకు ఎమ్మెల్సీగా అవకాశమిచ్చారు. ఈ నెలాఖరుకు జిల్లాలోని ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు, 11 వరకూ ఉన్న మార్కెట్ కమిటీలకు పాలకవర్గాలను నియమించే అవకాశం ఉంది.

చాన్స్ ఎవరికో?
నెలాఖరుకు వందలాదిగా పదవులు భర్తీ చేసే అవకాశం
ఏఎంసీలు, పీఏసీఎస్, ఆలయ ట్రస్ట్‌బోర్డులపై ప్రభుత్వం దృష్టి
జాబితాలు ఆమోదం.. జిల్లాకు ప్రాధాన్యం ఇచ్చే అవకాశం
విజయనగరం, మార్చి 15(ఆంధ్రజ్యోతి):
సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో కూటమి క్లీన్‌స్వీప్ చేసింది. అన్ని నియోజకవర్గాల్లోనూ కొలువుదీరింది. జిల్లా ప్రజలు అద్వితీయ విజయాన్ని అందించారు. ఇందుకు కృతజ్ఞతగా ప్రభుత్వం కూడా జిల్లాకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోంది. గజపతినగరం నుంచి తొలిసారిగా గెలిచిన కొండపల్లి శ్రీనివాస్‌కు మంత్రి పదవి ఇచ్చింది. యువతను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో సీఎం చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు. అలాగే నామినేటెడ్ పదవుల్లో జిల్లాకు చెందిన నలుగురికి రాష్ట్రస్థాయి పదవులు కట్టబెట్టారు. తాజాగా కావలి గ్రీష్మకు ఎమ్మెల్సీగా అవకాశమిచ్చారు. ఈ నెలాఖరుకు జిల్లాలోని ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు, 11 వరకూ ఉన్న మార్కెట్ కమిటీలకు పాలకవర్గాలను నియమించే అవకాశం ఉంది. ఆలయ ట్రస్ట్ బోర్డులు, ఆస్పత్రుల కమిటీలకు సైతం చైర్మన్‌తో పాటు డైరెక్టర్లను నియమించనున్నారు. ఈ మేరకు ఆశావహుల జాబితాలు హైకమాండ్‌కు వెళ్లాయి. స్థానిక ఎమ్మెల్యేల అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకొని ఒక నిర్ణయానికి రానున్నారు. ఇప్పటికే సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ దీనిపై పార్టీ శ్రేణులకు స్పష్టమైన సంకేతాలు పంపినట్లు తెలిసింది. నెలాఖరుకు పదవుల భర్తీ ఉంటుందని చెప్పారంటున్నారు. స్థానికంగా ఉన్న బలాబలాలు, ప్రత్యేక పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని జనసేన, బీజేపీ నేతలకు సైతం పదవులు కేటాయించనున్నారు.
తొలి జాబితాలో కర్రోతు
ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత తొలి నామినేటెడ్ జాబితాలో కర్రోతు బంగార్రాజుకు చాన్స్ దక్కింది. ఆయనకు రాష్ట్రస్థాయి కార్పొరేషన్ చైర్మన్‌గా అవకాశమిచ్చారు. భోగాపురం నియోజకవర్గంలో గత ఐదేళ్లూ పార్టీ అభివృద్ధికి ఆయన కృషిచేశారు. 2024 ఎన్నికల్లో పోటీకి సైతం సిద్ధపడ్డారు. కానీ పొత్తుధర్మంలో భాగంగా ఈ సీటు జనసేనకు కేటాయించాల్సి వచ్చింది. దీంతో బంగార్రాజు మనస్తాపానికి గురయ్యారు. కూటమి అధికారంలోకి వస్తే సముచిత స్థానం కల్పిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అందుకు తగ్గట్టుగానే రాష్ట్రస్థాయి కార్పొరేషన్ చైర్మన్‌గా అవకాశమిచ్చారు. నామినేటెడ్ రెండో జాబితాలో మాజీ మంత్రి సుజయ్ కృష్ణ రంగారావుకు ఏపీ ఫారెస్టు డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా అవకాశమిచ్చారు. అలాగే ఏపీ ఉమెన్స్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్‌పర్సన్‌గా కావలి గ్రీష్మకు ఛాన్స్ ఇచ్చారు. జనసేనకు సంబంధించి పాలవలస యశస్వినికి తూర్పుకాపు కార్పొరేషన్ చైర్‌పర్సన్‌గా నియమించారు. అటు మాజీ ఎమ్మెల్యే తెంటు లక్షుంనాయుడుకు బొబ్బిలి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ చైర్మన్‌గా నియమించారు. ఇక డైరెక్టర్లుగా పదుల సంఖ్యలో జిల్లా వారికి అవకాశమిచ్చారు.
ఎమ్మెల్సీగా గ్రీష్మ
తాజాగా ఎమ్మెల్సీగా కావలి గ్రీష్మకు అవకాశమిచ్చారు. ఈమె గత ఐదేళ్లు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడంతో పాటు అప్పటి అధికార పక్షానికి దీటుగా నిలబడ్డారు. సీబీఎన్ బాధ్యతలు చూశారు. ఈమె తల్లి కావలి ప్రతిభాభారతి టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో కీలక బాధ్యతలు చూస్తూ రావడంతో పాటు ఉమ్మడి రాష్ట్రానికి స్పీకర్‌గా పనిచేశారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గంలో 1983 నుంచి 1999 వరకూ వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. ప్రతిభాభారతి వారసురాలిగా టీడీపీలో చేరినప్పటి నుంచి యాక్టివ్‌గా పనిచేస్తున్న గ్రీష్మకు తాజాగా ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చారు. శాసనమండలిలో ప్రభుత్వ వాయిస్‌ను గట్టిగా వినిపించాలన్న కోణంతో పాటు సామాజిక సమీకరణాలను చూసి ఆమెకు అవకాశం ఇచ్చారు.
నెలాఖరులో పదవులే పదవులు..
నెలాఖరులో జిల్లా వ్యాప్తంగా ఉన్న వ్యవసాయ ప్రాథమిక పరపతి సంఘాలకు చైర్మన్లతో పాటు డైరెక్టర్లను నియమించనున్నారు. ఇక జిల్లాలో 11 వరకూ మార్కెట్ కమిటీలు ఉన్నాయి. చైర్మన్, వైస్ చైర్మన్‌తో పాటు డైరెక్టర్ పదవులు భర్తీ చేయనున్నారు. ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్లు, డైరెక్టర్లు, ఆస్పత్రిల కమిటీలు.. ఇలా అన్నీ కలిపి వందల్లోనే పదవులు భర్తీచేసే అవకాశముంది.
---------------------