Share News

YCP వైసీపీ క్యాంపు రాజకీయం!

ABN , Publish Date - Apr 07 , 2025 | 12:13 AM

YCP Camp Politics పార్వతీపురం పురపాలక సంఘంలో వైసీపీ కౌన్సిలర్లను కాపాడుకునే పనిలో ఆ పార్టీ నిమగ్నమైంది. ఈ మేరకు కొంతమంది కౌన్సిలర్లతో బెంగుళూరు తదితర ప్రాంతాల్లో క్యాంప్‌ను నిర్వహిస్తున్నట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది.

YCP  వైసీపీ క్యాంపు రాజకీయం!

పాలకవర్గం చేజారిపోకుండా ఉండేందుకు యత్నం

కౌన్సిలర్లను కాపాడుకునే పనిలో పడినట్లు ప్రచారం

పార్వతీపురం, ఏప్రిల్‌ 6 (ఆంధ్రజ్యోతి): పార్వతీపురం పురపాలక సంఘంలో వైసీపీ కౌన్సిలర్లను కాపాడుకునే పనిలో ఆ పార్టీ నిమగ్నమైంది. ఈ మేరకు కొంతమంది కౌన్సిలర్లతో బెంగుళూరు తదితర ప్రాంతాల్లో క్యాంప్‌ను నిర్వహిస్తున్నట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం మున్సిపాల్టీలో ఆ పార్టీకి చెందిన కొంతమంది కౌన్సిలర్లు కనిపించక పోవడంతో క్యాంప్‌ రాజకీయం వాస్తవమేనన్న వ్యాఖ్యలు సర్వత్రా వినిపిస్తున్నాయి. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ బి.గౌరీశ్వరి, వైస్‌ చైర్మన్లు కొండపల్లి రుక్మిణి, ఇండుపూరు గుణేష్‌లపై టీడీపీ కౌన్సిలర్లు అవిశ్వాసం తీర్మానం ప్రకటించిన నేపథ్యంలో తాజాగా వైసీపీ చర్యలు చర్చనీయాంశమవుతున్నాయి.

ఇదీ పరిస్థితి..

- కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పార్వతీపురం నియోజకవర్గంలో వైసీపీ సీన్‌ మారింది. ఆ పార్టీకి చెందిన కౌన్సిలర్లు వరుసగా టీడీపీలో చేరారు. ఇటీవల మాజీ సీఎం జగన్‌ పాలకొండకు వచ్చిన సమయంలోనే ఐదుగురు వైసీపీ కౌన్సిలర్లు ఎమ్మెల్యే బోనెల విజయ చంద్ర ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. సాధారణ ఎన్నికలకు ముందు వైసీపీ కౌన్సిలర్‌ బెలగాం కరుణ, ఆమె భర్త జయ ప్రకాష్‌ నారాయణ తదితరులు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. ఏడోవార్డు ఇండిపెండెంట్‌ కౌన్సిలర్‌ ఎం.పారినాయుడు , ఇటీవల మరికొంతమంది వైసీపీ కౌన్సిలర్లు టీడీపీ కండువా కప్పుకున్నారు.

- పార్వతీపురంలో 30 వార్డులు ఉండగా.. గతంలో వైసీపీ కౌన్సిలర్లు 22 మంది, ఐదుగురు టీడీపీ , ముగ్గురు ఇండిపెండెంట్‌ కౌన్సిలర్లు ఉండేవారు. అయితే ఇప్పటి వరకు టీడీపీలోకి సుమారు 13 మంది వైసీపీ కౌన్సిలర్లు చేరారు. దీంతో టీడీపీ కౌన్సిలర్ల సంఖ్య 18కి చేరింది. ఇండిపెండెంట్‌ కౌన్సిలర్లతో పాటు ఎక్స్‌ అఫిషియో సభ్యుడు ఎమ్మెల్యేతో కలిపి టీడీపీ సభ్యుల సంఖ్య 22కు చేరింది. ఈ నేపథ్యంలో పార్వతీపురం పురపాలక సంఘంపై టీడీపీ జెండా ఎగిరే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.

- టీడీపీకి సంఖ్యా బలం ఉండడంతో తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లు ఎమ్మెల్యే బోనెల విజయ చంద్ర ఆధ్వర్యంలో మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ వైస్‌ చైర్మన్లపై అవిశ్వాసం తీర్మానం పెట్టేందుకు అధికారులకు నోటీసు ఇచ్చారు. దీంతో ఒక్కసారిగా పురపాలక సంఘంలో రాజకీయ వేడి ప్రారంభమైంది. ఈ క్రమంలో మిగిలిన కౌన్సిలర్లను కాపాడుకోవాలని వైసీపీ వ్యూహ రచన చేసింది. తమ కౌన్సిలర్లను చేజారకుండా పాలకవర్గాన్ని నిలబెట్టుకొనేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

- మరో ఏడాదిలో జరగనున్న పురపాలక సంఘం ఎన్నికల్లో భారీ మెజార్టీ సాధించాలని కూటమి పార్టీలు వ్యూహంతో ముందుకెళ్తున్నాయి. ఈ నేపథ్యంలో రిజర్వేషన్లు అనుకూలిస్తే మళ్లీ సిట్టింగ్‌ కౌన్సిలర్లకే పోటీ చేసే అవకాశం కల్పిస్తామని వైసీపీ వారికి హామీ ఇస్తూ.. క్యాంపు రాజకీయాలు చేపట్టిందనే ప్రచారం జరుగుతోంది.

Updated Date - Apr 07 , 2025 | 12:13 AM