వంట గ్యాస్ భారం
ABN , Publish Date - Apr 08 , 2025 | 12:41 AM
గ్యాస్ ధరను కేంద్ర ప్రభుత్వం పెంచింది. ఒక్కొక్క గ్యాస్ సిలిండర్‌పై రూ.50 పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

సిలిండర్‌కు రూ.50 పెంపు
ఏలూరు సిటీ / భీమవరం టౌన్, ఏప్రిల్ 7 (ఆంధ్రజ్యోతి): గ్యాస్ ధరను కేంద్ర ప్రభుత్వం పెంచింది. ఒక్కొక్క గ్యాస్ సిలిండర్‌పై రూ.50 పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సోమవారం అర్ధరాత్రి నుంచే అమలులోకి వచ్చినా మంగళవారం నుంచి ధరలు పెరగను న్నాయి. సిలిండర్ ధర రూ. 827.50 కాగా రూ.50 పెంచడంతో రూ.877.50కి పెరగనుంది.
ఉచిత సిలిండర్‌తో ఉపశమనం
దాదాపు ఏడాదిన్నర తర్వాత గ్యాస్ ధర పెరిగింది. ఈసారి కొద్దిమంది వినియోగ దారులపై మాత్రమే భారం పడనుంది. ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం అమలులో ఉండడం కొంతవరకు ఉపశమనం. గ్యాస్ సిలిండర్ తీసుకునే సమయంలో అధిక ధర చెల్లించాల్సిందే. తర్వాత ప్రభుత్వం బ్యాంకు ఖాతాల్లో సొమ్ములు జమ చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం ధరలు పెంచినా రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదే తొలిసారి పెంపు అని చెప్పవచ్చు. ఏలూరు జిల్లాలో 6.45 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు పథకం అమలు చేసిన తర్వాత దాదాపు ఈ పథకం పరిఽధిలోకి 4.02 లక్షల వినియోగదారులు వస్తు న్నారు. ఇవిగాక సాధారణ గ్యాస్ కనెక్షన్ల వారిపై ఈ గ్యాస్ భారం పడనుంది. ఏడాది మూడు కంటే అదనంగా వినియోగించే వినియోగదా రులపై ఈ గ్యాస్ భారం పడనుంది. జిల్లాలో సాధారణ గ్యాస్ కనెక్షన్లు 4,06,128 ఉండగా, ఉజ్వల కనెక్షన్లు 27,639, దీపం కనెక్షన్లు 19,212, సీఎస్‌ఆర్ కనెక్షన్లు 18,243 వరకు ఉన్నాయని అంచనా. ఉజ్వల గ్యాస్ కనెక్షన్లకు కూడా ధర పెరిగిందని చెబుతున్నారు.
పశ్చిమలో రూ.3.11 కోట్ల భారం
గ్యాస్ ధర పెంపుతో పశ్చిమగోదావరి జిల్లాలో వినియోగదారులపై రూ.3.11 కోట్ల భారం పడ నుంది. జిల్లాలో 6.21 లక్షల మందికి గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. వాణిజ్య సిలండర్‌పై ధరల్లో పెంపు, తగ్గింపులు జరుగుతూనే ఉంటోంది. ఎన్‌డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 10 నెలలు పూర్తి కావస్తున్న సమయంలో ఇటు వంటి నిర్ణయం తీసుకోవడం ఇబ్బందే. ఏటా 3 ఉచిత గ్యాస్ సిలిండర్లతో జిల్లాలో 5.25 లక్షల మందికి ప్రయోజనం కలుగుతోంది.
గ్యాస్‌తో పాటు డీజిల్, పెట్రోల్‌పై కూడా భారం మోపినప్పటికీ ఈ భారాన్ని కంపెనీలు భరిస్తాయని చెప్పడం వినియోగదారులకు కొంత ఊరట. రానున్న రోజుల్లో ఎటువంటి ధరలు పెంపు ఉంటుందోనని సామాన్యులు ఆందోళన చెందుతున్నారు.