పార్కుల్లో పచ్చదనం
ABN , Publish Date - Apr 16 , 2025 | 01:14 AM
మునిసిపాల్టీల్లో నిరుపయోగంగా వున్న పార్కుల సుందరీకరణ బాధ్యతలను మహిళా గ్రూపులకు అప్పగించనున్నారు.

ఏలూరు, భీమవరం, తాడేపల్లి గూడెంలలో ఆరు పార్కులు
మహిళా సంఘాలకు అప్పగింత
ఏడాదిపాటు మొక్కల సంరక్షణ
ఒక్కో పార్కు అభివృద్ధికి నాలుగు నుంచి రూ.8 లక్షలు
భీమవరం టౌన్, ఏప్రిల్ 15(ఆంధ్రజ్యోతి): మునిసిపాల్టీల్లో నిరుపయోగంగా వున్న పార్కుల సుందరీకరణ బాధ్యతలను మహిళా గ్రూపులకు అప్పగించనున్నారు. అమృత్‌లో భాగంగా ‘అమృత్ మిత్ర’ పఽథకానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరంలో రెండు, తాడేపల్లిగూడెంలో రెండు, ఏలూరు కార్పొరేషన్‌లో రెండు పార్కులను గుర్తించి అభివృద్ధి చేయనున్నారు. గతంలో తాడేపల్లిగూడెం పార్కును మహిళలకు అప్పగించారు. అగ్రిమెంట్ పూర్తి కావడంతో మరో ఏడాది పొడిగించారు. భీమవరం, ఏలూరు కార్పొరేషన్‌లో ఈ ఏడాదిలో కొత్తగా పార్కులను ఎంపిక చేయనున్నారు. ఈ పార్కులకు సమీపంలోవున్న మెప్మాలోని మహిళా సంఘానికి పార్కు బాధ్యతను అప్పగిస్తారు. సంఘ సభ్యులు పార్కులో వున్న మొక్కలతోపాటు కొత్తవి నాటి వాటిని సంరక్షిస్తూ పచ్చదనం మెరుగుపర్చాలి. ఇందుకు ఏపీ యూఎఫ్ ఐడీ ద్వారా పార్కుల స్థలాన్ని బట్టి గ్రూపునకు ఏడాదికి నాలుగు నుంచి ఎనిమిది లక్షల వరకు ఇస్తారు. పార్కుల కేటాయింపు, నిధులన్నీ మునిసిపల్ కమిషనర్ ద్వారానే అప్పగిస్తారు. నిర్వహణపై మునిసిపల్ కమిషనర్, ఇంజనీర్లు ప్రత్యేక పర్యవేక్షణ ఉంటుంది. పార్కుల అభివృద్ధి వల్ల పర్యావరణ పరిరక్షణ అక్కడ ఆహ్లాదకర వాతావరణాన్ని కల్పించడానికి వీలు కలుగుతుంది. దీని ద్వారా ఒక గ్రూపులోని సభ్యులకు జీవనోపాధి కల్పిస్తారు. ఏడాదిపాటు అగ్రిమెంట్ ఇస్తారు. అవసరాన్ని బట్టి పొడిగిస్తారు. ఈ మూడు ప్రాంతాల్లోను ‘అమృత్ మిత్ర’ పేరున ఆరు గ్రూపులను గుర్తించి ఒప్పందాలు కుదుర్చుకున్నారు. వీరికి శిక్షణ ఇవ్వడంతో త్వరలోనే పనులు ప్రారంభమవుతాయి.