ఆ సెల్‌ఫోన్‌లు భద్రమేనా..?
ABN , Publish Date - Apr 06 , 2025 | 12:54 AM
వైసీపీ సర్కార్ హయాంలో వలంటీర్లు వినియోగించిన సెల్‌ఫోన్‌లను ఏం చేశారు ? ఎన్నికల ముందు స్వాధీనం చేసుకు న్న వీటిని భద్రంగానే ఉంచారా ? వాడకానికి ఇవి తిరిగి పనికి వస్తాయా ?

పశ్చిమలో 8,280, ఏలూరు జిల్లాలో 9,500 స్వాధీనం..
జడ్పీ, రెవెన్యూ కార్యాలయాల్లో భద్రపరిచామంటున్న అధికారులు
కోట్లు వెచ్చించి కొనుగోలు చేసిన వైసీపీ సర్కార్..
ఏడాదిగా వాటి వినియోగంపై ఏ నిర్ణయం తీసుకోని అధికారులు
ఇప్పుడవి పనికి వచ్చేనా ?
ఏలూరు సిటీ/భీమవరం టౌన్, ఏప్రిల్ 5 (ఆంధ్రజ్యోతి): వైసీపీ సర్కార్ హయాంలో వలంటీర్లు వినియోగించిన సెల్‌ఫోన్‌లను ఏం చేశారు ? ఎన్నికల ముందు స్వాధీనం చేసుకు న్న వీటిని భద్రంగానే ఉంచారా ? వాడకానికి ఇవి తిరిగి పనికి వస్తాయా ? పనిచేస్తే ఏం చేయబోతున్నారు ? కోట్లు ఖర్చు చేసి కొనుగో లు చేసిన వీటిని ఏడాది కాలంగా అలా వృథా గా వదిలేయడం వెనుక కారణం ఏమిటి ? ఈ ప్రశ్నలకు అధికారులు సమాధానాలు చెప్పాలి.
వైసీపీ సర్కార్ హయాంలో వేల రూపాయ ల విలువైన అండ్రాయిడ్ ఫోన్‌ను కొనుగోలు చేసి వలంటీర్లకు అందజేసింది. వీటి ద్వారా క్షేత్రస్థాయిలో పథకాలకు అర్హులను, అనర్హుల డేటాను సేకరించింది. వివిధ రకాల సర్వేలు చేయించింది. రేషన్ పంపిణీ మొదలుకొని ధాన్యం సేకరణ, ఇతర సబ్సిడీలు, డీబీటీ పథ కాలకు వీటి వినియోగించింది. లబ్ధిదారులకు ఏ పథకం అమలు చేయాలన్నా ఫోన్‌ల ద్వారా నే తెలిసేది. ఒక్కో ఫోన్‌లో ఆ వలంటీర్ పరిధి లోని 50 కుటుంబాల సమాచారం నిక్షిప్తమై ఉండేది. ఈ లెక్కన ఏలూరు జిల్లాలో 10 వేల 400 మంది, పశ్చిమ గోదావరి జిల్లాలో తొమ్మిది వేల 200 మంది వలంటీర్లు ఉన్నారు. వీరందరికి ఫోన్‌లు పంపిణీ చేసింది. అయితే గత ఎన్నికల సమయంలో ఎన్నికల కమిషన్ వలంటీర్లను ఎన్నికల విధులకు దూరంగా ఉండాలని ఆదేశించింది. వారి వద్ద వున్న సెల్‌ఫోన్‌లు స్వాధీనం చేసుకోవాలని జిల్లా అధికారులకు స్పష్టం చేసింది. ఈ నిర్ణయంతో ఏలూరు జిల్లాలోని 9,500 మంది వలంటీర్లు సెల్‌ఫోన్‌లను సంబంధిత ఎంపీడీవోలకు అందజేశారు. వీటినన్నింటిని వారు సీల్డ్ ప్యాక్‌లో జిల్లా పరిషత్‌కు పంపించారు. వాటిని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ కార్యా లయంలోని స్ట్రాంగ్ రూమ్‌లో భద్రపరిచారు. పశ్చిమ గోదావరి జిల్లాలో తొమ్మిది వేల 200 మంది ఫోన్‌లు తీసుకుని రాగా అందులో పది శాతం వరకు పాడవడంతో సుమారు 8,280 ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు. వీటిని సంబంధిత ఆర్డీవో కార్యాలయాల్లో ప్రత్యేక పెట్టెలో భద్రపరిచారు. ఇదే విషయాన్ని ఆయా జిల్లాల అధికారులు ధ్రువీకరిస్తున్నారు.
వేల ఫోన్లు నిరుపయోగం
రెండు జిల్లాల్లోను లక్షల విలువైన 17 వేల 780 ఫోన్‌లను ఏడాది కాలంగా వినియోగిం చకుండా పెట్టెల్లో భద్రపరిచారు. ఒక్క మన జిల్లాల్లోనే ఇన్ని వుంటే రాష్ట్రం మొత్తం మీద రెండు లక్షలకుపైనే ఉంటాయి. వీటిని వినియో గించకపోవడంతో వాటి పరిస్థితి ఏమిటనేది చూస్తేనే కాని తెలియదు. ఇప్పటి వరకు విని యోగంలో లేని ఈ ఫోన్‌లపై ప్రభుత్వం ఒక స్పష్టత ఇవ్వాల్సిన అవసరం వుంది. లేకుంటే కోట్ల రూపాయలు వృథా అయినట్లే..! ఇప్పుడు ఇదే చర్చనీయాంశంగా మారింది.