జై శ్రీరామ్
ABN , Publish Date - Apr 06 , 2025 | 12:38 AM
శ్రీ రామ నవమి పండుగ ఆదివారం పురస్కరించుకుని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆలయాలు ముస్తాబయ్యాయి. చలువ పందిళ్లు, తాత్కాలిక టెంట్లు వేసి, దేవాలయాలను రంగులతో అందంగా తీర్చిదిద్దారు.

రాములోరి కల్యాణానికి ఆలయాలు ముస్తాబు
శ్రీ రామ నవమి పండుగ ఆదివారం పురస్కరించుకుని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆలయాలు ముస్తాబయ్యాయి. చలువ పందిళ్లు, తాత్కాలిక టెంట్లు వేసి, దేవాలయాలను రంగులతో అందంగా తీర్చిదిద్దారు. విద్యుత్ కాంతులు వెదజల్లుతున్నాయి. మామిడి తోరణాలు, కాషాయి తోరణాలతో ఆలయాలను విశేషంగా అలంకరించారు. పలుచోట్ల కల్యాణ శుభలేఖలతో సీతారాముల కల్యాణ మహోత్సవానికి విచ్చేయాలని ఆహ్వానించారు. స్వస్తిశ్రీ చాంద్రమాన విశ్వావసు నామ సంవత్సర చైత్ర శుద్ధ నవమి పుష్యమి పునర్వసు నక్షత్ర మిధున లగ్నంలో అయోధ్య నగరాధీశులైన శ్రీదశరఽథ మహారాజు జ్యేష్ఠపుత్రుడు శ్రీరామచంద్రమూర్తికి మిఽథిలాపుర నగరాధీశులైన జనక మహారాజు ఏకైక పుత్రిక సీతా మహాదేవికి ఇచ్చి వివాహం జరిపిస్తున్నట్టు ఆహ్వాన పత్రికల్లో పేర్కొన్నారు.
బైరాగిమఠంలో ఒడిశా సంప్రదాయ పూజలు
పెంటపాడు : 18వ శతాబ్ధంలో ఒడిశా బ్రహ్మచారులతో పెంటపాడు మండలం బైరాగిమఠం గోపాలస్వామి ఆంజనేయస్వామి ఆలయం ప్రారంభించారు. అప్పట్లో దూరప్రాంతాల నుంచి కాశీ వెళ్లే భక్తులు ఈ మఠంలో బస చేసేవారు. వీరి భోజన వసతుల కోసం రాజావెంకట అప్పారావు అనే జమిందారు 10 పుట్లు (సుమారు 100 ఎకరాలు) భూమిని ఈ ఆలయానికి దానం చేశారు. ఒడిశా బ్రహ్మచారులతో ఈ మఠం కొనసాగడంతో ఇప్పటికి ఒడిశా సంప్రదాయంలోనే ఆలయంలో పూజలు జరుగుతాయి. ఈ ఆలయంలో కృష్ణుడు బాలకృష్ణుని రూపంలో ఇక్కడ దర్శనమిస్తాడు. భద్రాచలంలో సీతారాముల కల్యాణ ముహూర్తానికే ఇక్కడ రాములోరి కల్యాణ వేడుకను వైభవంగా నిర్వహిస్తారు. ఈ నెల ఆరో తేదీ మధ్యాహ్నం కల్యాణం అనంతరం పది వేల మందికి అన్నసమారాధన కార్యక్రమం నిర్వహిస్తారు. నాలుగు రోజులపాటు నిర్వహించే కార్యక్రమాల్లో భాగంగా 7వ తేదీన రథోత్సవం. 8న తెప్పోత్సవం, 9న స్వామికి చక్రస్నానం, శ్రీపుష్పయాగం పూజలు చేస్తారు. ఆలయ ఫిట్ పర్సన్ బీవీ చంద్రశేఖర్ మాట్లాడుతూ భక్తులకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేశామన్నారు.
105 ఏళ్ల నాటి కోదండ రామాలయం
గణపవరం : సరిపల్లెలోని టీటీడీ కల్యాణ మండపం ఆవరణలో 105 ఏళ్ల నాటి కోదాండ రామాలయం ఉంది. నూజివీడు సంస్థానంలోని విశాఖపట్నం సమీపంలోని యలమంచిలి గ్రామస్థులు ఈమని వెంకటేశ్వర్లు 1918లో గణపవరం మండలం ఠానాకు మేనేజర్‌గా వచ్చారు. ఆయన సరిపల్లెలో నివాసం ఉంటూ ఈ ప్రాంత పరిపాలన చూసేవారు. ఆ సంస్థానంలో కొందరు ఉన్నతాధికారులతో ఇమడలేక రాజీనామా చేశారు. అప్పటినుంచి తన శేష జీవితాన్ని హిందూ ధర్మప్రచారాన్ని ప్రారంభించారు. అప్పట్లో సరిపల్లె మొకాసదా రులైన క్రొవ్విడి వంశస్థుల సహకారంతో 14 ఎకరాల స్థలాన్ని సేకరిం చారు. 1921లో కోదండరామాలయం, గోశాల, తదితర ఆధ్యాత్మిక కేంద్రా లు ఏర్పాటు చేశారు. ఆయన మరణానంతరం శిథిలావస్థకు చేరిన రామాలయం మాత్రం అనాటి వైభవానికి ప్రతీకగా నేటికి నిలిచి ఉంది. స్థానిక గాయత్రీ బ్రాహ్మణ సేవా సంఘం నేతృత్వంలో ఆదివారం సీతారాముల స్వామివారి కల్యాణం నిర్వహిస్తారు. తొమ్మిది రోజుల పాటు నిత్య అన్నసమారాధన దాతల సహకారంతో నిర్వహిస్తారు.
తూర్పుయడవల్లిలో నేడు కల్యాణం
ద్వారకాతిరుమల : చినవెంకన్న క్షేత్ర దత్తత దేవాల యమైన తూర్పు యడవల్లిలోని సీతారామ చంద్రస్వామివారి ఆలయంలో వసంత నవరాత్రో త్సవ ప్రయుక్త శ్రీరామనవమి ఉత్సవాలు కడు రమణీయంగా జరుగుతున్నాయి.. చినభద్రాద్రిగా పేరొందిన ఆలయంలో ఆదివారం రాములోరి కల్యాణానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఈవో ఎన్వీ సత్యనారాయణమూర్తి తెలిపారు. సాయంత్రం నాలుగు గంటలకు గ్రామోత్సవం జరుగుతుంది. కల్యాణం రోజు ఉదయం ఆరు నుంచి ఎనిమది గంటల వరకు సుందరకాండ ప్రయుక్త సంక్షేపరామాయణ హోమం జరుగు తుందని దీనిలో పాల్గొనే దంపతులు రూ.1,116 చెల్లించి పాల్గొనవచ్చన్నారు. ఈ సందర్భంగా శనివారం అశ్వ వాహనంపై స్వామివారి గ్రామోత్సవాన్ని నిర్వహించారు. సోమవారం ఉదయం పది గంటలకు శ్రీరామసామ్రాజ్య పట్టాభిషేకం నిర్వహిస్తామన్నారు.
ఆలయ చరిత్ర ఇలా..
ఈ ఆలయాన్ని ఎకరం విస్తీర్ణంలో శిల్పకళా సౌందర్యా లతో కోటి రూపా యలను వెచ్చించి నిర్మించారు. 52 అడుగుల ఎత్తుతో ప్రధాన గోపురం, 14 అడుగుల ఎత్తుతో సింహ ద్వారాన్ని నిర్మించడం విశేషం. ఆలయ ముఖ మండపంలో శిల్పకళా సౌందర్యాలతోపాటు మేషం నుంచి మీనం వరకూ 12 రాశులు, ముద్దు గొలిపే చిన్ని కృష్ణుని శిల్పం, పర్ణశాల ఆలయానికి మరింతగా వన్నె తెస్తు న్నాయి. దీన్ని అప్పటి మంత్రి కోటగిరి విధ్యాధరరావు దంప తుల కృషితో చినజీయర్‌స్వామి విగ్రహ ప్రతిష్ట చేయగా 2003లో శ్రీవారి దేవస్థానం దత్తత తీసుకుని అన్ని కైంకర్యాలను, ఉత్సవాలను నిర్వహిస్తూ అభివృద్ధి చేస్తున్నారు.
తేతలిలో వైకుంఠ, మీసాల రాముడిగా..
తణుకు రూరల్ : తేతలి సీతారామస్వామి ఆలయంలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. భద్రాచలంలో ఉన్న రీతిలో ఇక్కడి స్వామి వైకుంఠ రామునిగా, మీసాల రామునిగా దర్శనమిస్తారు. ఈ ఆలయ నిర్మాణం వెనుక పెద్ద చరిత్రే వుంది. 200 ఏళ్ల క్రితం ఓ భక్తుడి కుటుంబం భద్రాచలం వెళుతుండగా మార్గమధ్యలో తాడువాయి ప్రాంతంలోని ఒక చెట్టు వద్ద విశ్రాంతి తీసుకున్నాడు. అక్కడ రాముడి విగ్రహాన్ని చూసి, దానిని అక్కడ చెట్టు తొర్రలో భద్రపర్చి భద్రాచలం వెళ్లి శ్రీరాముడిని దర్శించుకున్నాడు. అనంతరం తిరిగి వచ్చేటప్పుడు ఆ విగ్రహాన్ని తేతలి తీసుకు వచ్చి ఇక్కడ ఆలయాన్ని నిర్మించాడు. అప్పటి నుంచి నిత్య పూజలు నిర్వహిస్తున్నారు. ఆలయ ధర్మకర్తగా తేతలి శ్రీనివాస శివరామచంద్రరావు, లక్ష్మీ ఆధ్వర్యంలో కల్యాణోత్సవాలు నిర్వహిస్తారు.
పొలమూరులో వందేళ్లుగా రథోత్సవం
పెనమంట్ర : పొలమూరులో శ్రీరామ నవమిని విభిన్నంగా నిర్వహిస్తారు. ప్రతి చోటా కల్యా ణాలు నిర్వహిస్తే.. ఇక్కడ కల్యా ణంతోపాటు రథోత్సవాన్ని నిర్వ హించడం ప్రత్యేకత. 1920లో అప్పటి గ్రామ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో వంగలవారి వీధిలో రామమందిరంతోపాటు 25 అడుగుల రథాన్ని తయారు చేయించారు. శ్రీరామ నవమికి సీతారాముల కల్యాణం నిర్వహించి రథోత్సవం నిర్వహించడం నాలుగు తరాలుగా కొనసాగుతూ వస్తోంది. ఉద్యోగ రీత్యా వేర్వేరు ప్రాంతాల్లో వున్న బ్రాహ్మణ కుటుంబాలన్నీ శ్రీరామ నవమికి తప్పనిసరిగా వచ్చి కల్యాణం, రథోత్సవంలో పాల్గొంటాయి. 1998లో పెంకుటింటిలో ఉన్న రామ మందిరం జీర్ణోద్ధరణకు చేయడంతో ప్రస్తుత బ్రాహ్మణ సంఘం కొత్తగా ఆలయ నిర్మాణం చేశారు. ఈ ఏడాది వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.
300 ఏళ్ల నాటి పెద రామాలయం
ముదినేపల్లి : ముదినేపల్లి సీతారామ స్వామి(పెద రామాలయం) ఆలయం సుమా రు 300 ఏళ్ల క్రితం నిర్మించారు. ఈ ఆలయంలో భద్రాచలం ఆలయంలోని విగ్రహాల మాదిరిగా శ్రీరాముడి ఎడమ కాలుపై సీతమ్మ అమ్మవారు కూర్చున్న విగ్రహాలను ఏర్పాటుచేశారు. సాధారణంగా లక్ష్మణుడు, ఆంజనేయస్వామితో కలిసి రామాలయాల్లో సీతారాముల విగ్రహాలను ప్రతిష్ఠిస్తారు. కాని ముదినేపల్లి సీతారామ స్వామి ఆలయంలో మాత్రం లక్ష్మణుడు, ఆంజనేయుడు లేకుండా నే సీతారాముల విగ్రహాలను ప్రతిష్ఠించడం అప్పట్లో విశేషం గా చెప్పుకునే వారట. 1983లో లక్ష్మణుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఎదురుగా నిర్మించిన మంది రంలో ఆంజనేయుడి విగ్రహం ఉంది.
సిద్ధాపురం మరో భద్రాద్రి
ఆకివీడురూరల్ : సిద్ధాపురంలో కోదండ రామాలయాన్ని మరో భద్రాద్రిగా పిలుస్తారు. భద్రాచలంలో ఏ విధగా ఆల యం ఉంటుందో అదేవిధంగా ఇక్కడ పశ్చిమ ముఖంగా ఆలయం ఉంటుందని, కంచి కామకోటిపీఠం ఆధ్వర్యంలో ఈ ఆలయం కార్యక్రమాలు నిర్వహిస్తారని కమిటీ సభ్యులు తెలిపారు. గ్రామానికి చెందిన సిద్దుడు యోగీంద్రబాబు ఈ ఆలయాన్ని నిర్మించడానికి రూపకల్పన చేసినట్లు చెబుతారు. శ్రీరామనవమి, ధనుర్మాసం పూజలు ప్రత్యేకంగా నిర్వహిస్తారు.
గోదారమ్మతో ‘రాముడి’ అనుబంధం
గోదావరి నదీ తీరం పొడవునా రామాయణ ఘట్టాల ఆనవాళ్లు
పోలవరం : ‘రామా అందరి బంధువయా.. భద్రాచల రామయ్యా ఆదుకునే ప్రభువయ్యా మా అయోధ్య రామయ్యా’ అంటూ ‘దేవుళ్లు’ సినిమా పాట చిత్రీకరణ చేసింది పోలవరం గోదావరి నది ఒడ్డునే. ఆ సినిమా విడుదలై 25 ఏళ్లయింది. కరాటం రాంబాబు నిర్మాణ సార థ్యంలో కోడి రామకృష్ణ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రం అన్ని వర్గాల నుంచి కలెక్షన్ల వర్షం కురిపించింది. 2006లో గోదావరి నదీతీరం వెంబడి ఉన్న రామయ్యపేట పట్టిసీమ భద్రాచలం పోలవరం గ్రామాలలో అక్కినేని నాగార్జున అక్కినేని నాగేశ్వరరా వులతో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ని ర్మించిన ‘శ్రీరామదాసు’ సినిమా అన్ని వర్గాల వారిని అలరించింది. ఈ చిత్రంలో ‘ఏటయ్యిందే గోదారమ్మ ఎందుకు ఉలికి పాటు గగురు పాటు’ అంటూ పాట పట్టిసీమ ఫెర్రీ రేవులో చిత్రీకరించారు. 1978లో దివంగత నందమూరి తారక రామారావు స్వీయ దర్శకత్వంలో రామకృష్ణ మూవీస్ బ్యానర్‌లో నిర్మించిన ‘శ్రీరామ పట్టాభిషేకం’ సినిమా పోలవరం మండలం రామ య్యపేట, పూడిపల్లి గోదావరి నది మధ్యలో వున్న మహానందీశ్వర స్వామి ఆలయ పరిసరాలలో నిర్మించారు. మరిన్ని సినిమాలు నదీ తీరంలో తీశారు.
వీఆర్‌పురం సమీపంలో ఉన్న శ్రీరామగిరి పుణ్యక్షేత్రం వద్ద వెలసిన సుందర సీతారాముల పుణ్యక్షేత్రం, ఎత్తైన కొండలపై 170 మెట్లు ఎక్కిన తర్వాత 500 ఏళ్ల క్రితం మాతంగి మహర్షిచే ప్రతిష్ఠించబడిన సీతారామ లక్ష్మణ ఆంజనే యుల సుందర విగ్రహాలు, వాలి సుగ్రీవుల కొండల సమీపంలో రెక్కలు తెగిపడిన జటా యువు పక్షి పడిన ఆనవాళ్ళు చొక్క నపల్లి గోదావరి రేవులో కనిపిస్తాయి. అక్కడే శ్రీరాముడు జటాయువుకి పిండప్రదానం చేశారని పురాణాలు చెబుతున్నాయి.