Share News

Stone Crusher Extortion: అడిగినంత ఇవ్వకుంటే అంతుచూస్తామని బెదిరించారు

ABN , Publish Date - Apr 09 , 2025 | 05:43 AM

వైసీపీ హయాంలో ఎమ్మెల్యే విడదల రజని, ఆమె మరిది గోపి, పీఏ రామకృష్ణ కలిసి క్వారీ యజమానులను బెదిరించి రూ.2.20 కోట్లు వసూలు చేసినట్టు ఏజీ హైకోర్టుకు తెలిపారు. ఈ ఘటనపై ఏసీబీ కేసు నమోదు చేయగా, నిందితులు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు

Stone Crusher Extortion: అడిగినంత ఇవ్వకుంటే అంతుచూస్తామని బెదిరించారు

  • స్టోన్‌ క్రషర్‌ యజమాని నుంచి సొమ్ము వసూలుకు కుట్ర

  • హైకోర్టులో ఏజీ దమ్మాలపాటి

  • రజని, గోపి, రామకృష్ణ వ్యాజ్యాలపై ముగిసిన వాదనలు.. తీర్పు రిజర్వ్‌

అమరావతి, ఏప్రిల్‌ 8(ఆంధ్రజ్యోతి): వైసీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ఎమ్మెల్యే విడదల రజని అడిగినంత సొమ్ము చెల్లించకుంటే అంతుచూస్తామని.. స్టోన్‌ క్రషర్‌ను, క్వారీని మూసివేయిస్తామని క్వారీ యజమానులను ఆమె మరిది గోపి, పీఏ రామకృష్ణ బెదిరించారని అడ్వకేట్‌ జనరల్‌ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్‌ హైకోర్టుకు తెలిపారు. వారిని బెదిరించి రజని రూ 2 కోట్లు, అప్పటి ప్రాంతీయ విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారి (ఆర్‌వీఈవో) రూ.10 లక్షలు, గోపి రూ.10 లక్షలు వసూలుచేశారని వెల్లడించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో విజిలెన్స్‌ తనిఖీ పేరుతో తనను బెదిరించి, రూ.2.20 కోట్లు అక్రమంగా వసూలు చేశారని పల్నాడు జిల్లా యడ్లపాడులోని లక్ష్మీబాలాజీ స్టోన్‌ క్రషర్స్‌ మేనేజింగ్‌ పార్ట్‌నర్‌ నల్లపనేని చలపతిరావు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా రజని, మరికొందరిపై ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో ముందస్తు బెయిల్‌ కోరుతూ రజని, ఆమె మరిది గోపీనాథ్‌, పీఏ దొడ్డా రామకృష్ణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యాలు మంగళవారం విచారణకు రాగా.. ఏసీబీ తరఫున ఏజీ వాదనలు వినిపించారు. అంతుచూస్తామని బెదిరించి వసూళ్లకు పాల్పడిన నేపథ్యంలో పిటిషనర్లకు ఐపీసీ సెక్షన్‌ 386 వర్తిస్తుందన్నారు. ‘రికార్డులను పరిశీలిస్తే విడదల రజని సూచనల మేరకే ఐపీఎస్‌ అధికారి, ఆర్‌వీఈవో జాషువా క్వారీలో తనిఖీలు నిర్వహించారు. ఇందుకు ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి అనుమతులూ తీసుకోలేదు. తనిఖీల తర్వాత నివేదికను కూడా వారికి సమర్పించలేదు. స్టోన్‌ క్రషర్‌ యజమానులకు ఫోన్‌ చేసి.. వెంటనే రజనిని కలవాలని, లేకుంటే రూ.50 కోట్లు జరిమానా విధిస్తానని ఆర్‌వీఈవో బెదిరించారు. డబ్బు వసూలు చేయాలనే ఉద్దేశంతోనే నిందితులు కుట్రపన్నారు. అప్పటి ఎమ్మెల్యే రజని సూచనల మేరకే క్వారీలో తనిఖీలు నిర్వహించినట్లు జాషువా వాంగ్మూలం ఇచ్చారు.


ఆమె అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసినట్లు స్పష్టమవుతోంది. వ్యాపారులను బెదిరించి, డబ్బులు వసూలు చేయడం ఎమ్మెల్యే అధికారిక విధుల్లోకి రాదు. ఈ నేపఽథ్యంలో అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్‌ 17(ఎ)కింద ఆమెను ప్రాసిక్యూట్‌ చేసేందుకు సంబంధిత అథారిటీ నుంచి అనుమతి తీసుకోవలసిన అవసరం లేదు. సొమ్ము వసూలు చేసే నాటికి రజని ఎమ్మెల్యేగా ఉన్నారు. అనంతరం మంత్రి అయ్యారు. 2024 జూన్‌ వరకు ఆ పదవిలో కొనసాగారు. వసూళ్ల వ్యవహారాన్ని బయటపెడితే ఎస్సీ, ఎస్టీ కేసులు పెడతామని గోపి స్టోన్‌ క్రషర్‌ యజమానులను బెదిరించారు. అందుకే వారు అప్పట్లో ఫిర్యాదు చేయలేకపోయారు. ఈ కారణంతోనే ఎఫ్‌ఐఆర్‌ నమోదులో జాప్యం జరిగింది. ఏసీబీ దర్యాప్తు ప్రస్తుతం కీలక దశలో ఉంది. పిటిషనర్లను కస్టడీలోకి తీసుకుని విచారించాలి. ముందస్తు బెయిల్‌ పిటిషన్లు కొట్టివేయండి’ అని కోరారు.


దర్యాప్తునకు సహకరిస్తాం..

రజని పీఏ తరఫున సీనియర్‌ న్యాయవాది ఓ.మనోహర్‌రెడ్డి వాదనలు వినిపించారు. డబ్బు చెల్లించాలని ఫిర్యాదుదారును బెదిరించినట్లు పిటిషనర్‌పై ఎలాంటి ఆరోపణలు లేవని.. అప్ప టి ఎమ్మెల్యే రజని చెప్పిన సమాచారాన్ని మాత్రమే ఫిర్యాదుదారుకు తెలియజేశారని.. కాబట్టి బలవంతపు వసూళ్ల కింద ఆయనపై నమోదు చేసిన కేసు చెల్లుబాటు కాదన్నారు. కస్టోడియల్‌ విచారణ అవసరం లేదని, దర్యాప్తునకు సహకరిస్తారని.. ఘటన జరిగిన నాలుగేళ్ల తర్వాత కేసు నమోదు చేశారని.. వీటిని పరిగణనలోకి తీసుకుని బెయిల్‌ మంజూరు చేయాలని కోరారు. రజని, గోపి తరఫున సీనియర్‌ న్యాయవాది ఎస్‌.శ్రీరామ్‌, న్యాయవాది మహేశ్వరరెడ్డి రిప్లయ్‌ వాదనలు వినిపించారు. క్రషర్‌ యజమానులకు భౌతికహాని తలపెట్టాలనే ఉద్దేశం పిటిషనర్లకు లేదని, విజిలెన్స్‌ దర్యాప్తునకు సహకరించారని, కోర్టు షరతులకు కట్టుబడి ఉంటారని, ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని అభ్యర్థించారు. ఇరుపక్షాల వాదనలు ముగియడంతో.. తీర్పు రిజర్వ్‌ చేస్తున్నట్లు న్యాయస్థానం ప్రకటించింది. లిఖితపూర్వకంగా వాదనలు సమర్పించేందుకు వెసులుబాటు ఇచ్చింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ టి.మల్లికార్జునరావు ఉత్తర్వులిచ్చారు.

Updated Date - Apr 09 , 2025 | 05:45 AM