Gold Prices: గోల్డ్ ధర ఎందుకు పెరిగింది.. ఇన్వెస్ట్ చేయాలా వద్దా..
ABN , Publish Date - Feb 11 , 2025 | 06:48 AM
దేశంలో బంగారం, వెండి ధరలు రికార్డ్ స్థాయిలో పుంజుకున్నాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 88 వేలను దాటేసింది. అయితే అసలు గోల్డ్ రేటు ఎందుకు పెరిగింది. ఈ సమయంలో ఇన్వెస్ట్ చేయాలా వద్దా అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

బంగారం (gold) ధరలు ఈరోజు ఉదయం నాటికి రికార్డ్ స్థాయిలో రూ. 2,430 పెరిగి 10 గ్రాములకు రూ. 88,500కి చేరుకున్నాయి. దీంతో ప్రపంచ స్థాయిలో బంగారం ధర ఔన్సుకు $2,900 స్థాయిని దాటేసింది. ఇదే సమయంలో భారత మార్కెట్లో కూడా పసిడి ధరలు భారీగా పుంజుకున్నాయి. బంగారంతో పాటు వెండి ధరలు కూడా బలపడ్డాయి. వెండి ధర కిలోకు రూ. 1,000 పెరిగి రూ.97,500కి చేరుకుంది. అయితే అసలు వీటి ధరలు ఎందుకు పెరిగాయి. భవిష్యత్తులో ఇంకా పెరిగే ఛాన్స్ ఉందా అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
బంగారం ధర పెరగడానికి కారణాలు
ప్రస్తుతానికి దీనికి ప్రధాన కారణం ఉక్కు, అల్యూమినియంపై 25% సుంకం విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడమేనని చెప్పవచ్చు. ఈ నిర్ణయంతో ప్రపంచ మార్కెట్లో వాణిజ్య యుద్ధ భయాందోళన మొదలైంది. ఈ కారణంగా పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల వైపు మొగ్గు చూపారు. దీనికి తోడు రూపాయి విలువ కూడా క్షీణించింది. రూపాయి బలహీనపడినప్పుడు, దిగుమతులు ఖరీదైనవిగా మారతాయి. ఇది దేశీయ బంగారం ధరలను ప్రభావితం చేస్తుంది.
పెట్టుబడిదారుల భారీ కొనుగోళ్లు
ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ ప్రకారం ఆభరణాల వ్యాపారులు, రిటైల్ పెట్టుబడిదారులు భారీగా గోల్డ్ కొనుగోళ్లు చేయడం కూడా ఈ ధరల పెరుగుదలకు ఓ కారణమని తెలిపింది. స్టాక్ మార్కెట్లో కొనసాగుతున్న అస్థిరత కారణంగా పెట్టుబడిదారులు బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడి ఎంపికగా భావిస్తున్నారు. ఈ క్రమంలోనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కొత్త ప్రకటన తర్వాత మార్కెట్లో అస్థిరత పెరిగింది. మరోవైపు మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో కూడా బంగారం ధరలు వృద్ధి చెందాయి. ఏప్రిల్ డెలివరీకి సంబంధించిన గోల్డ్ ఫ్యూచర్స్ 10 గ్రాములకు రూ. 940 పెరిగి రూ. 85,828కి చేరింది. జూన్ డెలివరీ బంగారం ధరలు రూ. 1,015 పెరిగి రూ.86,636కి చేరుకున్నాయి.
బంగారం ధరలు ఇంకా పెరుగుతాయా?
డచ్ బ్యాంక్ ING నివేదిక ప్రకారం ఈ సంవత్సరం బంగారం ధరలు మరిన్ని కొత్త రికార్డులు సృష్టిస్తాయని చెబుతున్నారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ఆర్థిక మాంద్యం భయాల కారణంగా, పెట్టుబడిదారులు బంగారంపై ఆసక్తిని కొనసాగిస్తారని చెప్పారు. ఈ కారణంగా దీని ధర ఔన్సుకు $3,000కి చేరుకోవచ్చని తెలిపింది. ఈ క్రమంలో 2025లో బంగారం ధర మరింత పెరగవచ్చని ING బ్యాంక్ అంచనా వేసింది. బంగారం ధర ఈ స్థాయిలో పెరిగిన తర్వాత బంగారంలో పెట్టుబడి పెట్టడం సరైనదేనా అనే ప్రశ్న అనేక మంది పెట్టుబడిదారుల్లో మొదలైంది. కానీ పెట్టుబడికి సంబంధించిన నిర్ణయం తీసుకునే ముందు, మార్కెట్ ధోరణులను బాగా అర్థం చేసుకుని నిర్ణయం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
EPFO: ఈ వినియోగదారులకు అలర్ట్.. మీ బ్యాంక్ ఖాతా లింక్ చేశారా లేదా..
New Delhi: ఇళ్ల ధరల పెరుగుదలలో టాప్ 15 నగరాలు.. ఇండియా నుంచి..
Kumbh Mela 2025: కుంభమేళా ట్రాఫిక్ అప్‌డేట్స్ ఇలా తెలుసుకోండి.. సులభంగా వెళ్లండి..
Next Week IPOs: ఈ వారం కీలక ఐపీఓలు.. మరో 6 కంపెనీల లిస్టింగ్
BSNL: రీఛార్జ్‌పై టీవీ ఛానెల్‌లు ఉచితం.. క్రేజీ ఆఫర్
Read More Business News and Latest Telugu News