Lays Offs: ఉద్యోగుల కొంప ముంచిన ఏఐ.. ఆ కంపెనీలో వందల జాబ్స్ హుష్ కాకి
ABN , Publish Date - Apr 03 , 2025 | 08:38 AM
అధునిక టెక్నాలజీ అయిన ఏఐ అన్ని రంగాల్లోకి వేగంగా దూసుకుపోతుంది. ఏఐ వల్ల భారీ సంఖ్యలో ఉద్యోగాలకు కోత పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే. చాలా రంగాల్లో ఇది వాస్తవ రూపం దాల్చింది. తాజాగా ఏఐ వల్ల ఓ కంపెనీలో వందల సంఖ్యలు ఉద్యోగాలు హుష్ కాకి అయ్యాయి. ఆ వివరాలు..

రంగంతో పని లేకుండా.. ఉద్యోగుల మెడ మీద కత్తులు వెలాడుతున్నాయి. కంపెనీలు ఎప్పుడు ఎవరిని గెట్ లాస్ట్ అంటాయో అర్థం కాక.. కెరీర్‌ను అరచేతిలో పట్టుకుని బిక్కు బిక్కుమంటూ బతుకుతున్నారు. ఐటీ కంపెనీలు మొదలు డెలీవరి కంపెనీల వరకు అన్ని రంగాల్లో ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. అందుబాటులోకి వచ్చిన అత్యాధునిక సాంకేతికత ఉద్యోగుల తొలగింపుకు ప్రధాన కారణం అవుతుంది. మరీ ముఖ్యంగా ఏఐ.. అనేక రంగాల్లో దూసుకుపోతుంది. చాలా కంపెనీలు ఏఐ వైపు మొగ్గు చూడమే కాక.. నిర్వహణ భారం తప్పించుకోవడం కోసం వందల సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తున్నాయి. తాజాగా ఫుడ్ డెలివరీ కంపెనీ జొమాటో కూడా ఇదే దారిలో పయనించింది. వందల మంది ఉద్యోగులను తొలగించింది. అందుకు కారణాలు ఏంటంటే..
ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ కంపెనీ జొమాటో ఉద్యోగులకు భారీ షాకిచ్చింది. ఏకంగా 600 మంది ఉద్యోగులను తొలగించింది. కంపెనీ కస్టమర్ సపోర్ట్ విభాగంలో పని చేస్తున్న ఉద్యోగులపై వేటు విధించింది. జొమాట్లో స్పీడ్ డెలివరీ యాప్ బ్లింకిట్‌లో భారీ ఎత్తున నష్టాలు వాటిల్లడంతోనే కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
జొమాటో అసోసియేట్ అక్సిలరేటర్ ప్రొగ్రామ్‌లో భాగంగా.. కస్టమర్ సపోర్ట్ విధులను నిర్వహించేందుకు గాను కంపెనీ గతేడాది సుమారు 1500 మంది సిబ్బందిని నియమించుకుంది. ఇక గత కొన్ని వారాలుగా.. వీరిలో చాలామందిని తొలగిస్తూ జొమాటో నిర్ణయం తీసుకుంటుంది. తొలగింపుకు సంబంధించి వారికి ఎలాంటి ముందస్తు నోటీసు ఇవ్వలేదు.. పైగా వారిని నిరూపించుకునేందుకు మరో అవకాశం కూడా కల్పించలేదని నివేదికలు వెల్లడిస్తున్నాయి.
విధుల నుంచి తొలగించిన ఉద్యోగులకు నెల జీతం పరిహారంగా అందించేందుకు జొమాటో సిద్ధం అయ్యింది. నిర్వహణ భారం తగ్గించుకోవడం కోసమే జొమాటో ఈ నిర్ణయం తీసుకుందని సమాచారం. కస్టమర్ సపోర్ట్ విభాగంలో ఏఐని ప్రవేశపెట్టడం వల్లనే ఉద్యోగుల తొలగింపు నిర్ణయం తీసుకున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. గత కొన్నాళ్లుగా జొమాటోలో వృద్ధి నెమ్మదించగా.. భారీ ఎత్తున నష్టాలు చవి చూస్తోంది.
వేటు విధించిన వారిలో హైదరాబాద్, గురుగ్రామ్ ప్రాంతాల్లో పని చేస్తోన్న సిబ్బంది ఉన్నారు. ఎలాంటి ముందస్తు హెచ్చరిక లేకుండానే.. ఉద్యోగులను తొలగించునట్లు సమాచారం. దీనిపై స్పందించేందుకు జొమాటో యాజమాన్యం నిరాకరించింది. దీనిపై ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
అంబానీకే మళ్లీ ఫోర్బ్స్ కిరీటం