Chhattisgarh Conflict: పాలకులు–మావోయిస్టులు, మధ్య రాజ్యాంగం!
ABN , Publish Date - Apr 15 , 2025 | 05:39 AM
చత్తీస్‌గఢ్‌లో నక్సల్స్, ప్రభుత్వ సైన్యాల మధ్య గట్టైన అంతర్యుద్ధం కొనసాగుతున్నది. ఆదివాసుల పీడన, శాంతి చర్చల అవసరం పై తార్కిక వివాదాలు ఉన్నాయని కనిపిస్తోంది

రెండు దేశాలు ఆయుధాలతో తలపడితే యుద్ధం. ప్రభుత్వం తన ప్రజల మీద ఆయుధాలతో తలపడితే అంతర్యుద్ధం. ఛత్తీస్‌గఢ్, దంతేవాడలో ఇప్పుడు ఒక భీకర అంతర్యుద్ధం కొనసాగుతోంది. కేంద్ర ప్రభుత్వం భారీగా సైన్యాన్ని దింపి అక్కడ మావోయిస్టుల అణచివేత కార్యక్రమాన్ని చేపట్టింది. యుద్ధానికయినా అంతర్యుద్ధానికయినా లక్ష్యం మార్కెట్టే అని తెలిసినపుడు ఈ నక్సల్స్ ఏరివేత కార్యక్రమం ఎవరికోసమో ఊహించడం ఎవరికీ పెద్ద కష్టం ఏమీ కాదు. రక్షణ వ్యవహారాలను బహిరంగపరచరు కాబట్టి, ఛత్తీస్‌గఢ్‌లో కేంద్ర ప్రభుత్వం ఎంత సైన్యాన్ని దించిందో, ఎన్నిరకాల ఆధునిక ఆయుధాలను వినియోగిస్తున్నదో ఆ వివరాలు అందుబాటులో లేవు. దాదాపు లక్షమంది పారామిలటరీ దళాలను బస్తర్‌లో దించారని ఒక అంచనా. దీని కోసం కేటాయించిన బడ్జెట్ విషయంలోనూ నమ్మశక్యంకాని అంకెలు వినిపిస్తున్నాయి. కొన్నేళ్ళుగా సాగుతున్న ఈ అంతర్యుద్ధంలో ప్రస్తుతం కేంద్ర బలగాలదే పైచేయిగా ఉందని చాలా స్పష్టంగా కనిపిస్తున్నది. ఆ ఉత్సాహంతోనే కేంద్ర హోం మంత్రి అమిత్ షా వచ్చే చైత్ర నవరాత్రి (మార్చి 2026) నాటికి ‘నక్సల్ ముక్త్ భారత్’ను సాకారం చేస్తాం అంటున్నారు. బస్తర్‌లో పారా మిలటరీ దళాల దూకుడును చూస్తుంటే వచ్చే మార్చికన్నా ముందే వాళ్ళు ఆ లక్ష్యాన్ని సాధించనూవచ్చు. పీడన, అణచివేత కొనసాగుతున్నప్పుడు తిరుగుబాటు తప్పక వస్తుంది. ఏ సమాజానికైనా ఇది సహజ సూత్రం. కేంద్ర హోం మంత్రి ఆశిస్తున్నట్టు ‘నక్సల్ ముక్త్ భారత్’ ఏర్పడకపోయినా ఇప్పటికైతే ‘నక్సల్ ముక్త్ బస్తర్’ ఏర్పడవచ్చు. బస్తర్‌లో ఇంకో విచిత్రం జరుగుతోంది. అటు మావోయిస్టుల పైచేయి అయిన రోజైనా, ఇటు కేంద్ర సాయుధ బలగాల పైచేయి అయిన రోజైనా – ఇరువైపులా – చనిపోతున్నది ఆదివాసులే.
ఇదేమీ కొత్త కాదు. వందేళ్ళ క్రితం మన్యంలో సాగిన తిరుగుబాటును అణచివేయడానికి నాటి బ్రిటీష్ మిలటరీ అధికారి థామస్ జార్జ్ రూథర్ ఫోర్డ్ ఈ విధమైన వ్యూహాన్నే రచించాడు. ఇరువైపుల ఆదివాసులే చనిపోతుండడాన్ని చూసి తట్టుకోలేకే అల్లూరి శ్రీరామరాజు పోరాటాన్ని విరమించాలనే నిర్ణయం తీసుకున్నాడు. ఆధునిక యంత్రీకరణ ప్రకృతిని ధ్వంసం చేస్తుంది. దాన్ని ఆదివాసులు తీవ్రంగా వ్యతిరేకిస్తారు. వాళ్ల పోరాటాల్లో ‘జల్ జంగల్ జమీన్’ అనేది ప్రాణప్రదమైన నినాదం. ప్రకృతిని విధ్వంసం చేయడాన్ని ఒకప్పుడు పాపకార్యంగా భావించేవారు ఇప్పుడది ‘అభివృద్ధి’ అని పేరు మార్చుకుని గొప్ప పుణ్యకార్యంగా చెలామణి అవుతోంది. మావోయిస్టు పార్టీ సిద్ధాంతాలు, దాని ఆచరణల మీద నమ్మకం, అభిమానం లేనివాళ్లు సహితం ఇప్పుడు ఆదివాసుల గురించి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అనేక పౌర సంఘాలు శాంతిచర్చలు నిర్వహించమని ఇటు మావోయిస్టుల్ని అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నాయి. ఈ ప్రతిపాదనలకు మావోయిస్టు పార్టీ సానుకూలంగా స్పందించింది. ఇప్పుడు ప్రభుత్వం వంతు. శాంతి చర్చల విషయంలో ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర ప్రభుత్వం ఊగిసలాటలో వుంది. దానికి ఒకవైపు, శాంతి చర్చలు జరిపి మావోయిస్టుల పీడ వదిలించుకోవాలనీ వుంది. మరోవైపు, ప్రస్తుతం వెనుకంజలో ఉన్న మావోయిస్టులు శాంతి చర్చల నెపంతో లభించే వెసులుబాటుతో మళ్ళీ పుంజుకుంటారనే భయాందోళనా వుంది. మావోయిస్టులతో కేంద్ర ప్రభుత్వం శాంతి చర్చలు జరుపుతుందా లేదా? అన్నది ఒక అంశం.
అయితే, దానికి రాజ్యాంగం ప్రాతిపదికగా వుంటుందా లేదా? అన్నది మరో ఆసక్తికర పార్శ్వం. ఇప్పుడు కేంద్రంలో అధికారంలో వున్న బీజేపీకి బౌద్ధిక సరోవరం ఆరెస్సెస్. అది మొదటి నుంచీ రాజ్యాంగాన్ని స్వదేశీ విలువలు, సాంప్రదాయాలకు వ్యతిరేకమైన విదేశీ భావన అంటూంది. మరోవైపు, మావోయిస్టులు సహితం రాజ్యాంగం పెట్టుబడీదారీ ప్రయోజనాలను నెరవేర్చేందుకు పుట్టింది అని విమర్శిస్తుంటారు. చెరో వైపు నుంచీ చెరో విధంగా రాజ్యాంగాన్ని వ్యతిరేకించే శక్తులు రాజ్యాంగం ప్రాతిపదికగా శాంతి చర్చలు ఎలా సాగిస్తాయో చూడాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, మావోయిస్టు పార్టీ కూడా ఇప్పుడు రాజ్యాంగం మీద నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నాయి. మావోయిస్టులు రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలి అని ఛత్తీస్‌గఢ్ హోంమంత్రి విజయ్‌శర్మ అంటున్నారు. ప్రభుత్వం రాజ్యాంగ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నది అని మావోయిస్టులు ఆరోపిస్తున్నారు. శాంతి చర్చలకు సుముఖత వ్యక్తం చేస్తూ మావోయిస్టులు ఇటీవల విడుదల చేసిన ప్రకటనలో రెండుసార్లు రాజ్యాంగ విలువల ప్రస్తావన వుండడం ఒక విశేషం అనొచ్చు. ‘కాల్పుల విరమణ’ అనే గంభీరపు మాటల్ని పక్కన పెట్టి మావోయిస్టులే ఒక శాంతి కమిటీనో, ఒక రాయబారినో ప్రభుత్వం దగ్గరికి పంపించాలని ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం అంటున్నది. అమిత్ షా అయితే, మావోయిస్టులు ఆయుధాలను దించే పక్షంలో వాళ్ళ కోసం ఒక ఆకర్షణీయమైన ప్యాకేజీని అందజేస్తామంటున్నారు.
బస్తర్‌లో విద్యా వైద్య సదుపాయాలు, రోడ్లు, కరెంటు, మంచినీటి సరఫరా వంటి మౌలిక సౌకర్యాలను కల్పించడమేగాక, ప్రతి కుటుంబానికి 60 కేజీల బియ్యం, కొంత నగదు, ఒక్కో గ్రామానికి కోటి రూపాయల మంజూరుతో పాటు ప్రముఖ మావోయిస్టుల తలల మీదున్న రివార్డుల్ని కూడా వారికే ఇస్తామంటున్నారు. ఇటీవల బస్తర్ పాండుం ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన అమిత్ షా మావోయిస్టుల్ని ‘సోదరులు’ అని సంబోధించడం విశేషం. ‘‘మీ మరణం మాకేమీ ఆనందాన్ని ఇవ్వదు. ఆయుధాలు వదిలిపెట్టి దేశ అభివృద్ధికి తోడ్పడండి’’ అని ఆయన పిలుపిచ్చారు. బస్తర్‌లోనికి మావోయిస్టులు ప్రవేశించిన తరువాత అక్కడ ఒకరకం సమసమాజం ఏర్పడిందనే ప్రచారం ఒకటి జరుగుతోంది. ఇదొక తప్పుడు అవగాహన. ఆదివాసీ సమూహాల్లో అనాదిగానే ఒకరకం కమ్యూనిస్టు సమాజం వుంటుంది. అంతేకాక, మాతృస్వామిక సమాజ లక్షణాలు కూడా వాళ్ళలో వుంటాయి. అక్కడికి బయటి సమాజం ప్రవేశించినపుడే కాలుష్యం మొదలవుతుంది. ఈ సందర్భంగా, ఒక సైద్ధాంతిక సందేహం కూడా ముందుకు వస్తోంది. సీపీఐ– మావోయిస్టులు ప్రకటిత కార్యక్రమానికీ బస్తర్‌లో వాళ్ళు సాగిస్తున్న కార్యకలాపాలకూ పొంతన వుందా? బయటి ప్రపంచానికి తెలిసినంత వరకు, వ్యవసాయ విప్లవం – నూతన ప్రజాస్వామిక విప్లవం – అంతిమంగా సామ్యవాద సమాజ నిర్మాణం అనే మూడంచెల కార్యక్రమం మావోయిస్టులకు వుంది. ఇందులో మొదటిదైన వ్యవసాయ విప్లవానికి ‘దున్నేవానిదే భూమి’ అనేది ప్రధాన నినాదం. దానికి అద్భుతంగా అనువైన ప్రాంతం గోదావరి, కృష్ణా మండలాలు. అక్కడి నాలుగు జిల్లాల్లో 95శాతం కమతాల్ని కౌలు రైతులే దున్నుతారు. డెల్టా ప్రాంతంలో వ్యవసాయిక విప్లవానికి అంతటి అనువైన అవకాశాల్ని వదులుకుని అడవులకు వెళ్ళడం అంటే వాళ్ళు తమ ప్రకటిత కార్యక్రమాన్ని రద్దు చేసుకుని వుండాలి. మావోయిస్టులు విడుదల చేసిన లేఖలో ఫాసిజం ప్రస్తావన వుంది.
దానికి ప్రధాన బాధితులు ఆదివాసులు, మత మైనారిటీలు అనే అర్థం వచ్చే వాక్యాలూ వున్నాయి. కార్పొరేట్ మతతత్త్వ నియంతృత్వానికి బాధితులయిన ఆదివాసులు, మత మైనారిటీలు, తదితర పీడిత సమూహాల విముక్తి కోసం ఒక కొత్త విప్లవ కార్యక్రమాన్ని రూపొందించుకున్నట్టు వాళ్లు ప్రకటించవచ్చు. వాళ్లు ఆ పనీ చేయలేదు. ఈ సైద్ధాంతిక గందరగోళం నుండి బయటపడనంత వరకు మావోయిస్టుల మీద బస్తర్ బయటవున్న సామాన్య ప్రజలకు ఒక స్పష్టత రాదు. 1970లలో నక్సలైట్ల కేసులు విచారణకు వచ్చినపుడు ఒక వాదన బలంగా వినిపించేది. ఆయుధాలతో మాత్రమే ప్రజావ్యతిరేక వ్యవస్థను నిర్మూలించగలమనేది నక్సలైట్ల ప్రధాన సిద్ధాంతం. ప్రభుత్వం కత వేరు. రాజ్యాంగాన్ని అమలు చేస్తామని రాజ్యాంగం మీద ప్రమాణం చేసి అధికారాన్ని చేపడుతాయి కనుక ప్రభుత్వాలు రాజ్యాంగానికే కట్టుబడి వుండి తీరాలి అనే భావన అప్పట్లో బలంగా వుండేది. ఆయుధాన్ని చేపట్టి నేరానికి పాల్పడిన వారిని మాత్రమే శిక్షించాలనీ, పీడక సమాజాన్ని ఆయుధాలతో కూల్చక తప్పదనే భావాలను శిక్షించరాదనీ అప్పట్లో న్యాయమూర్తులు సహితం బలంగా నమ్మేవారు. ఇప్పుడు ఆ భావన బలహీనపడింది. సమాజాన్ని మార్చడానికి హింస తప్పదని భావించేవారిని సహితం హింసతోనే అణచివేయాలనే భావన బలపడుతోంది. ‘దేశ శత్రువులు సరిహద్దుకు ఆవల మాత్రమే వుండరు; దేశం లోపల కూడా ఉంటారు. ఆయుధాల్లోనే గాక ఆలోచనల్లోనూ దేశానికి ప్రమాదం పొంచివుంది’ అనే ఒక కొత్త సిద్ధాంతాన్ని రక్షణ వ్యవహారాల సలహాదారు అజిత్ దొవ్వాల్ ముందుకు నెడుతున్నారు. దీనికి వారు పెట్టిన ముద్దు పేరు ‘అర్బన్ నక్సల్స్’. ఆయుధాలను చేపట్టిన వారినేగాక, అలాంటి ఆలోచనలు కలిగిన వారిని సహితం శిక్షించాలనేది కొత్త సిద్ధాంతం. భావాలను సహితం శిక్షించాలనేది దీని సారాంశం. ఆలోచనాపరులు, పౌరసమాజం మీద విరుచుకుపడడానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేసుకుంటోంది అనడానికి ఇది సంకేతం. ఆలోచనాపరులు, పౌరసమాజం దీన్ని తీవ్రంగా ఖండించాలి. లేకుంటే పూడ్చుకోలేని నష్టం జరిగిపోతుంది.
- డానీ
సమాజ విశ్లేషకులు