Dalit Rights Activist Jagjivan Ram: దళిత హక్కుల పోరాటయోధుడు
ABN , Publish Date - Apr 05 , 2025 | 05:31 AM
జగ్జీవన్‌రామ్, దళిత హక్కుల పోరాటయోధుడు, తన జీవితాన్ని సామాజిక సమానత్వం, దళితుల హక్కుల కోసం అంకితం చేశారు. ఆయన స్వాతంత్య్ర పోరాటం, ప్రభుత్వ మంత్రిగా చేసిన సంస్కరణలు నేటి సమాజానికి ఆదర్శంగా నిలిచాయి

దళిత హక్కుల పోరాటయోధుడు జగ్జీవన్‌రామ్ అంటరానివారి శ్రేయస్సు కోసం తన జీవితాన్ని అంకితం చేసిన దళిత చిహ్నం. బిహార్‌లో ఒక సామాన్య రైతు కుటుంబంలో 1908 ఏప్రిల్ 5న జగ్జీవన్‌రామ్ జన్మించారు. ఆయన తండ్రి శోబీరామ్, తల్లి వసంతిదేవి. ఆయన జన్మదినాన్ని భారతదేశం అంతటా ‘సమతా దివస్’గా జరుపుకుంటారు. పాఠశాల విద్య కొనసాగిస్తున్నప్పుడు ఆయన మొదటిసారి వివక్షను ఎదుర్కొన్నారు. అలాగే విశ్వవిద్యాలయంలో కూడా జగ్జీవన్‌రామ్ వివక్షను ఎదుర్కొన్నారు. ఇది సమాజంలోని ఒక వర్గంపై జరుగుతున్న సామాజిక బహిష్కరణకు వ్యతిరేకంగా నిరసన తెలపడానికి ఆయనకి ప్రేరణనిచ్చింది. అన్యాయానికి వ్యతిరేకంగా నిరసన తెలపడానికి షెడ్యూల్డ్ కులాలను ఆయన సంఘటితం చేశారు. బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాల్లో జగ్జీవన్‌రామ్ ఉత్సాహంగా పాల్గొనేవారు. సామాజిక సమానత్వంపై అందరినీ చైతన్య పరిచేందుకు 1934లో ఆలిండియా డిప్రెస్డ్ క్లాసెస్ లీగ్, అఖిల్ భారతీయ రవిదాస్ మహాసభలకు పునాది వేశారు. అలాగే 1935 అక్టోబర్ 19న దళితులకు ఓటు హక్కు కోసం హమ్మండ్ కమిషన్ ముందు వాదనలు వినిపించారు. రాజ్యాంగ సభలో సభ్యుడిగా ఆయన పాత్ర ఎనలేనిది. దళితుల సామాజిక, రాజకీయ హక్కుల కోసం ఆయన వాదించారు. 1946లో జవహర్‌లాల్ నెహ్రూ ఏర్పాటు చేసిన తాత్కాలిక ప్రభుత్వ కేబినెట్‌లో అతి చిన్న వయసులో మంత్రి అయ్యారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దేశానికి తొలి కార్మికమంత్రిగా ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. తరువాత కమ్యూనికేషన్స్, రైల్వే, రవాణా, ఆహార, వ్యవసాయం, రక్షణ వంటి కీలక శాఖల బాధ్యతలు కూడా నిర్వహించారు. దేశంలో హరిత విప్లవం విజయవంతం చేయడంలో జగ్జీవన్‌రామ్ కీలకపాత్ర పోషించారు.
అలాగే జనతా పార్టీ ప్రభుత్వంలో 1977 నుంచి 1979 వరకు ఉప ప్రధానమంత్రిగా పనిచేశారు. కాంగ్రెస్(ఇందిరా) పార్టీ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. 1936 నుంచి 1986 వరకు ఐదు దశాబ్దాలకు పైగా చట్టసభ సభ్యుడిగా కొనసాగారు. దేశంలో ఎక్కువ కాలం పనిచేసిన కేబినెట్ మంత్రిగానూ ఆయన రికార్డు సృష్టించారు. దళిత హక్కుల కోసమే కాదు.. మానవతా కార్యక్రమాల్లోనూ ఆయన చురుకుగా పాల్గొనేవారు. మహాత్మాగాంధీ అభిప్రాయాలతో జగ్జీవన్‌రామ్ ఎక్కువగా ఏకీభవించేవారు. అంటరానితనాన్ని నిర్మూలించడానికి గాంధీ చేసిన ప్రయత్నాల్లో ఆయన చురుగ్గా పాల్గొన్నారు. సత్యాగ్రహం, శాసనోల్లంఘన ఉద్యమం, క్విట్ ఇండియా వంటి ఉద్యమాల్లో గాంధీజీ వెంట నడిచారు. అజాతశత్రువుగా భారత రాజకీయ, సామాజిక రంగాల్లో వెలుగొందిన జగ్జీవన్‌రామ్ తన 78వ ఏట కన్నుమూశారు. ఆయన నడిచిన బాట.. అనుసరించిన ఆదర్శాలు.. ఆయన జీవితం నేటి యువత ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది.
– డాక్టర్ సుంకరి రాజారామ్ (నేడు జగ్జీవన్‌రామ్ జయంతి)