Share News

Modi Government Criticism: విజ్ఞత లేని త్రిభాషా ధిక్కారం

ABN , Publish Date - Apr 08 , 2025 | 06:27 AM

రామచంద్ర గుహ రాసిన "భారత్ భవిష్యత్తుపై రెండు దృక్కోణాలు" వ్యాసం మోదీ ప్రభుత్వంపై వ్యతిరేకతను ప్రదర్శిస్తుంది. హిందీ–తమిళ భాషల మధ్య పోరాటం, ద్రావిడవాద నాయకుల హిందీ వ్యతిరేకత, మరియు భారతదేశంలో భాషలపై రాజకీయ దృక్కోణాలను వివరిస్తుంది

Modi Government Criticism: విజ్ఞత లేని త్రిభాషా ధిక్కారం

‘భారత్ భవిష్యత్తుపై రెండు దృక్కోణాలు’ శీర్షికతో ఆంధ్రజ్యోతిలో మార్చి 22న రామచంద్ర గుహ రాసిన వ్యాసంలో మోదీ ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనబడింది. తమిళ, హిందీ భాషల మధ్య పోరాటం రెండు భిన్న భారత్ భావనలకు ప్రాతినిధ్యం వహిస్తుంది అంటున్నారు ఆయన. బ్రిటిష్ వాళ్ళు నూరిపోసిన ఆర్య, ద్రావిడ సిద్ధాంతాన్ని ఈయన బాగా ఔపోసిన పట్టినట్లుంది. ‘ఉత్తరాది ప్రజలు ఆర్యులు అని, దక్షిణాది ప్రజలు ద్రావిడులు అని, ఉత్తరాది హిందీ ఆర్యభాషైన సంస్కృతం నుంచి వచ్చిందని బ్రిటిష్‌వారు ఈ దేశంలో తమ పాలనను శాశ్వతం చేసుకోవడానికి ఓ కొత్త వాదాన్ని లేవదీశారు. దానిని అందిపుచ్చుకొని ద్రావిడవాద నాయకులు ఈ దేశ భాషైన హిందీని వ్యతిరేకిస్తూ, హింసాత్మక ఉద్యమాన్ని లేవదీసి జన నష్టం, ఆస్తి నష్టం కలిగించిన విషయం సుస్పష్టం.

ద్రావిడవాద నాయకులు హిందీని వ్యతిరేకించడం 1937 నుంచి నేటి వరకు కొనసాగుతూనే ఉంది. దేశీయ భాషైన హిందీని వ్యతిరేకించడంలో అర్థం లేదని జాతీయ నాయకులు మొదటినుంచి వాదిస్తూ వచ్చారు. 1950 నుంచి 1967 వరకు కాంగ్రెస్ కార్యకర్తలపై ద్రావిడవాద పార్టీ కార్యకర్తలు వీధి పోరాటాలు చేశారు. 1965లో ఈ ఉద్యమం హింసాత్మకంగా మారి, పారా మిలిటరీ దళాలు కాల్పులు జరపడంతో అనేకమంది మృత్యువాత పడ్డారు. దక్షిణ భారత హిందీ ప్రచార సభను తమిళనాడులో మూసివేయాలని ఈ నాయకులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఈ విషయంలో వ్యాసకర్త చాలా విషయాలను దాచారు. ‘కాశీ–తమిళ్ సంగమం’ నూతన పార్లమెంటు భవనంలో ‘సెంగోల్’ ప్రతిష్ఠాపన వెనుక ఈ దేశంలో సమైక్యతను సాధించడం అనే లక్ష్యం మోదీ ప్రభుత్వానికి ఉన్నదని జాతీయవాదుల అభిప్రాయం. వ్యాసకర్తకు ఇది రాజకీయ కోణంగా తోచింది.


రాష్ట్ర జాబితాలో ఉన్న అంశాలపై రాష్ట్ర ప్రభుత్వానికి శాసనాలు చేసే అధికారం ఉంటుంది. కొన్ని స్థానిక సంస్థలలో ప్రతిపక్ష పార్టీ వారు అధికారంలో ఉన్నంతమాత్రాన రాష్ట్ర శాసనాలను అమలు చేయబోమని ధిక్కరించవచ్చునా? వారికి ఆ హక్కు ఉంటుందా? కేంద్ర శాసనాలను తమిళనాడు ప్రభుత్వం ధిక్కరించడం ఈ కోవ కిందికి రాదా? త్రిభాషా సూత్రాన్ని ధిక్కరిస్తూ, ద్వి భాషలకు మాత్రమే మా రాష్ట్రంలో స్థానం ఉందని మూర్ఖంగా ప్రవర్తించే ద్రావిడవాద రాజకీయ నాయకుల పొగరుబోతు ధోరణిని తప్పు పట్టకుండా, ఉత్తర భారతంలో దక్షిణాది భాషను నేర్పడం లేదని కొందరు చేసే వాదనలు పసలేనివి. ఉత్తర భారతంలో రాష్ట్ర భాష, హిందీ, ఇంగ్లీష్ నేర్పుతూనే ఉన్నారు. ఇక కొన్నిచోట్ల సంస్కృతాన్ని విద్యార్థులు మార్కుల స్కోర్ కోసం తీసుకుంటున్నారు. ఒక వ్యక్తి అనేక భాషలను నేర్చుకోవడం వల్ల ఆలోచనా శక్తి, విషయ పరిజ్ఞానం పెరుగుతాయి. వ్యక్తి జీవితం సౌకర్యవంతమౌతుంది. ద్రావిడవాద రాజకీయ నాయకులకూ, వంతపాడే స్వయం ప్రకటిత మేధావులకు ఈ విషయంలో ఇంగిత జ్ఞానం లోపించింది.

ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ హిందువులు ఆంగ్ల భాషను త్యజించాలని కేరళ సమావేశంలో కోరినట్లు చెప్పిన మాట శుద్ధ అబద్ధం. ఆంగ్ల భాషపై మక్కువ అనవసరమని ఆయన చెప్పిన విషయాన్ని వక్రీకరించడం ఎందుకు? ఇక దళితులు ఆంగ్ల భాష నేర్చుకుంటే వద్దనేది ఎవరు? అగ్రకులాలపై ద్వేషాన్ని, ఈర్ష్యను, క్రోధాన్ని, ఆగ్రహాన్ని కలిగించడానికి ఈ దేశంలో కొందరు నిబద్ధులైనారు.


నరేంద్రమోదీ అధికారానికి రాకముందు ఈ దేశంలో హిందీ, ఇంగ్లీష్ రెండూ దేశవ్యాప్తంగా ప్రాచుర్యాన్ని పొందాయని చెప్పడంలో రామచంద్ర గుహ ఆంతర్యం ఏమిటి? ఇంగ్లీషు భాష సాంకేతిక భాష అయినందువల్ల దాని ప్రాధాన్యతను ఎవరు తగ్గించలేరనే ఆ డొంకతిరుగుడు మాటలు ఏమిటి? మోదీ ప్రభుత్వ హయాంలో ఎక్కడైనా సాంకేతిక కళాశాలలో ఆంగ్లం బదులు ప్రాంతీయ భాషల్లో బోధనను మొదలుపెట్టారా? అధికారాన్ని అడ్డుపెట్టుకుని, ఆంగ్లభాషను అణచివేసి, హిందీ భాషకు సంఘ్‌ పరివార్ ప్రాచుర్యాన్ని తెచ్చిపెడుతుందని వ్యాసకర్త వాపోవడం విచిత్రం. పార్లమెంట్‌లో ఎక్కువమంది హిందీలో ప్రసంగిస్తారు. ఇది స్వాతంత్ర్యం పొందినప్పటినుంచి జరుగుతున్న వ్యవహారం. కొంతమంది ఆంగ్లంలో కూడా మాట్లాడతారు. ఈ విషయంలో మోదీ ప్రభుత్వం ఏమైనా మార్పు చేసిందా?

ద్రావిడవాద రాజకీయాలలో హిందీని వ్యతిరేకించడం ఒక భాగం. అది వారి రాజకీయ మనుగడకు అవసరం. పైగా హిందుత్వం ఆధారంగా రాజకీయాలు నడిపే భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి హిందీ భాషపైన వీరి వ్యతిరేకత హెచ్చుగా ఉంటుంది. ద్రావిడవాద రాజకీయ నాయకులు సహజంగానే హిందుమత వ్యతిరేకులు. రామాయణంపై, రామునిపై అవాకులు, చవాకులు మాట్లాడిన కరుణానిధి, సనాతన ధర్మాన్ని అనుసరించే హిందువులు డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులను వ్యాప్తి చేసే బ్యాక్టీరియా లాంటివారు అని నోరు పారేసుకున్న రాష్ట్ర మంత్రి, ఆయన మనుమడు ఉదయనిధి ఈ తానులోని ముక్కలే!

హిందువుల కోసం పనిచేసే సంస్థలను దూషించడం, ద్వేషించడం, ఇస్లామిక్ శక్తులకు వంతపాడడం రామచంద్ర గుహ మనుగడలో భాగం. అందుకే ఆయన ద్రావిడవాద రాజకీయ నాయకులు హిందీని వ్యతిరేకించడాన్ని సమర్థించుకొచ్చాడు. రెండు దృక్కోణాల మధ్య సంఘర్షణగా సిద్ధాంతీకరించాడు.

కొండా సుమంత్‌రెడ్డి

Updated Date - Apr 08 , 2025 | 06:53 AM