Share News

Telugu Authors Recognition: ఎవరైతే నా ఇంటికి ఎన్నటికీ రాబోరో

ABN , Publish Date - Apr 14 , 2025 | 05:16 AM

సాహిత్యాన్ని జీవన యాత్రగా చూస్తూ, మనుషుల్ని, ప్రకృతిని కలవడమే ముఖ్య కోరికగా పేర్కొన్న కవితాత్మక అభివ్యక్తి. ఇందులో గోవిందరాజు సీతాదేవి, బిరుదురాజు, నాగభైరవ, మలిశెట్టి వంటి వివిధ సాహిత్య పురస్కారాల వివరాలు వివరించబడ్డాయి

 Telugu Authors Recognition: ఎవరైతే నా ఇంటికి ఎన్నటికీ రాబోరో

ఎవరైతే నా ఇంటికి ఎన్నటికీ రాబోరో వాళ్లను కలవడానికి నేనే వాళ్ల దగ్గరికి పోతా ఓ పొంగుతున్న నది ఎన్నటికీ రాదు నా ఇంటికి నదుల్లాంటి మనుషుల్ని కలవడానికి నదీ తీరానికి వెళ్తా ఈతలు కొడతా, మునిగిపోతా కొండలు గుట్టలు శిలలు చెరువులు అసంఖ్యాకమైన చెట్లు పొలాలు ఎన్నటికీ రావు నా ఇంటికి పొలాలూ గాదెల్లాంటి మనుషుల్ని కలవడానికి ఊరూరికీ, అడవులూ -వంకలకూ వెళ్తా ఎప్పుడూ పనిలో ఉండే వాళ్లను నేను తీరికగా కాదు వాళ్లతో ఒక అవసరమైన పని లాగా కలుస్తూ ఉంటా— దీన్ని నా ఏకైక చివరి కోరికలా మొట్టమొదటి కోరికగా ఉంచుకోవాలనుంది.

హిందీ మూలం -వినోద్ కుమార్ శుక్లా

అనువాదం - సుమనస్పతి రెడ్డి

96761 80802


గోవిందరాజు సీతాదేవి పురస్కారం

గోవిందరాజు సీతాదేవి జాతీయ సాహితీ పురస్కారాన్ని నవలా విభాగంలో ఆర్‌.సి. కృష్ణస్వామి రాజు (‘మేకల బండ’), కథా సంపుటి విభాగంలో కె.ఎ. మునిసురేష్‌ పిళ్లె (‘గారడీవాడు’) ఎంపికయ్యారు. త్వరలో నెల్లూరులో పురస్కార ప్రదానం జరుగుతుంది. పురస్కారానికి మొత్తం 10 నవలలు, 35 కథా సంపుటాలు వచ్చాయి. పంపిన రచయితలు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు.

గోవిందరాజు సుభద్రాదేవి


బిరుదురాజు శతజయంతి

సాహిత్య అకాడమీ – శ్రీకృష్ణదేవరాయ తెలుగు భాషా నిలయం, హైదరాబాద్‌ సంయుక్త ఆధ్వర్యంలో బిరుదురాజు రామరాజు శతజయంతి సదస్సు ఏప్రిల్‌ 16 ఉ.10గంటలకు ఎన్‌టిఆర్‌ కళామందిరం, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, నాంపల్లి, హైదరాబాద్‌లో జరుగుతుంది. స్వాగతోపన్యాసం సి.మృణాళిని, అధ్యక్షులు టి. ఉడయవర్లు, ముఖ్య అతిథి వెలుదండ నిత్యానందరావు, కీలకోపన్యాసం అమ్మంగి వేణుగోపాల్‌, గౌరవ అతిథి కె. లీలావతి. పాకనాటి జ్యోతి, గౌరీశంకర్‌, తిరునగరి దేవకీదేవి తర్వాతి మూడు సమావేశాలకు అధ్యక్షత వహిస్తారు. శతజయంతి స్మారక సంచిక ఆవిష్కరణ ఉంటుంది.

సాహిత్య అకాడమీ


నాగభైరవ సాహితీ పురస్కారం

నాగభైరవ సాహిత్య పీఠం ఈ సంవత్సరం అనువాద సాహిత్యాన్ని ఆహ్వానిస్తున్నది. తెలుగు లోకి అనువాదమై 2021–2024 సంవత్సరాల మధ్య ప్రచురితమైన కథా సంపుటాలు, నవలలను నాలుగేసి ప్రతులను మే 10 లోపు పంపాలి. ప్రథమ, ద్వితీయ స్థానాల్లో రచనలకు వరుసగా రూ.10వేలు, రూ.5వేలు బహుమతులు. 2025 ఆగస్టు 17న బహమతి ప్రదాన సభ. ప్రతులు పంపాల్సిన చిరునామా: నాగభైరవ ఆదినారాయణ, 202 – శ్రీ వెంకటసామి రెసిడెన్సీ, 2వ లైన్‌, రామయ్య నగర్‌, ఒంగోలు – 523 002, ప్రకాశం జిల్లా, ఆంధ్ర ప్రదేశ్‌. వివరాలకు: 98497 99711.

నాగభైరవ ఆదినారాయణ


మలిశెట్టి పురస్కారం

జజ్జూరి వేణుకు మలిశెట్టి సీతారాం సాహిత్య పురస్కార ప్రదానం, ఎమ్మెస్సార్ కథల పోటీలో బహుమతి పొందిన కథలతో ‘కథా ప్రపంచం’ కథా సంకలనం 2024 ఆవిష్కరణ, జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి నవల ‘సాక్షాత్కారం’ ఆవిష్కరణ, పలమనేరు బాలాజి కవితా సంపుటి ‘లోపలేదో కదులుతున్నట్టు’ ఆవిష్కరణ... ఈ కార్యక్రమాలు ఏప్రిల్ 20 ఉ.10గంటల నుండి రవీంద్ర భారతి, హైదరాబాద్‌లో జరుగుతాయి. వివరాలకు: 99850 13234.

మలిశెట్టి శ్యాం ప్రసాద్

Updated Date - Apr 14 , 2025 | 05:18 AM