Health Tips : ఇక్కడ నివసించే వారికి.. గుండెపోటు వచ్చే ప్రమాదముంది..!
ABN, Publish Date - Jan 09 , 2025 | 11:19 AM
మనం రోజూ తీసుకునే ఆహారం, అలవాట్లు, జీవనశైలితో ఆరోగ్యాన్ని డిసైడ్ చేస్తాయని అందరికీ తెలుసు. విశ్రాంతి లేకుండా పనిచేశాక కంటినిండా నిద్ర పోకపోయినా ప్రమాదమే అని వినే ఉంటారు. కానీ, నివసించే ప్రాంతమూ గుండె చప్పుడును ప్రభావితం చేస్తుంది. ఈ ప్రాంతంలో నివసించేవారికి గుండె పోటు వచ్చే ప్రమాదం ఎక్కువని..
మనం రోజూ తీసుకునే ఆహారం, అలవాట్లు, జీవనశైలితో ఆరోగ్యాన్ని డిసైడ్ చేస్తాయని అందరికీ తెలుసు. విశ్రాంతి లేకుండా పనిచేశాక కంటినిండా నిద్ర పోకపోయినా ప్రమాదమే అని వినే ఉంటారు. ఆఫీసులో, ఇంట్లో కుటుంబం మధ్య సంబంధ, బాంధవ్యాలు సరిగా లేకున్నా ఒత్తిడికి లోనవుతుంటాం. అలాంటప్పుడు మానసిక, అనారోగ్య సమస్యలు చుట్టుముట్టి శరీరం గుల్ల అవుతుందని చెప్తుంటారు వైద్య నిపుణులు. దేహంలోని అత్యంత కీలకమైన అవయం గుండెని జాగ్రత్తగా కాపాడుకోవాలని సూచిస్తుంటారు. మరి, ఆ గుండెచప్పుడు మధ్య వయసులోనే ఆగిపోకూడదని కోరుకుంటే ఈ విషయమూ కచ్చితంగా తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే, చెడు అలవాట్లు, వ్యక్తుల మధ్య సంబంధాలు ఎలాగైతే గుండెపై భారాన్ని పెంచుతాయో.. అలాగే మనం ఎలాంటి ప్రాంతంలో నివసిస్తున్నాం అనేది ముఖ్యమే అంటున్నారు ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు. ఇలాంటి ప్రాంతాల్లో జీవించే వారికి గుండెపోటు వచ్చే ప్రమాదం అధికమని హెచ్చరిస్తున్నారు.
కాలుష్యం, అనారోగ్యకర అలవాట్లు గుండె చప్పుడును ప్రభావితం చేసినట్లే.. ఈ ప్రాంతంలోని ఇళ్లలో జీవిస్తున్నా హృదయ సంబంధిత వ్యాధులతో త్వరగా మరణించే ప్రమాదముందని తాజా పరిశోధనలో వెల్లడైంది. విమానాశ్రయాల సమీపంలో నివసించే వారికి గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు షాకింగ్ న్యూస్ చెప్పారు. ఇతరులతో పోలిస్తే గుండెపోటు, గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని తేలింది.
కారణాలివే..
విమానాలు టేకాఫ్, ల్యాండింగ్ సమయాల్లో వచ్చే పెద్ద పెద్ద శబ్దాలు ఎయిర్‌పోర్ట్ సమీపంలో నివసిస్తున్న ప్రజల గుండెలను ప్రత్యక్షంగా ప్రభావితం చేస్తాయి. ఇక్కడి నుంచి వెలువడే నిరంతర వాయు కాలుష్యం, శబ్ద కాలుష్యాలు క్రమంగా గుండె పనితీరును దెబ్బతీస్తాయి. 24 గంటల పాటు నిరంతరాయంగా శబ్దానికి గురికావడం వల్ల మనిషి శరీరం ఒత్తిడికి లోనవుతుందని నిపుణులు చెబుతున్నారు. దీని కారణంగా, రక్తపోటు పెరగటం ప్రారంభమై హృదయంపై ఒత్తిడి పడుతుంది. ఈ పరిస్థితి చాలా కాలం పాటు కొనసాగితే గుండెపోటుకు కారణమవుతుంది. ఇది వృద్ధులకే పరిమితం కాదని,యువత కూడా దీని బారిన పడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
వాయు కాలుష్యం కూడా ముప్పే..
విమానాశ్రయం సమీపంలో నివసించే ప్రజలు శబ్ద కాలుష్యాన్ని మాత్రమే కాకుండా వాయు కాలుష్యాన్ని కూడా ఎదుర్కొంటారు. విమానం ఇంజిన్‌ల నుండి వెలువడే పొగ, చుట్టుపక్కల ట్రాఫిక్ గాలిని విషపూరితం చేస్తుంది. ఈ విషపూరితమైన గాలి ఊపిరితిత్తులు, గుండె రెండింటికీ ప్రమాదకరం. అలాంటి గాలిలో ఎక్కువ సేపు ఉండడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గి గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది.
Updated Date - Jan 09 , 2025 | 11:19 AM