Share News

5:2 డైట్‌ అంటే ఏమిటి..

ABN , Publish Date - Apr 06 , 2025 | 11:20 AM

అసలు ఈ 5:2 డైట్‌ అంటే ఏమిటి.. దాని గురించి మీకేమైనా తెలుసా... చాలా మంది ఈ డైట్ గురించి అవగాహన ఉండదరే చెప్పవచ్చు. ముఖ్యంగా పల్లె ప్రాంత వాసులకైతే కనీస అవగాహన ఉండకపోవచ్చు. అయితే.. దాని వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

5:2 డైట్‌ అంటే ఏమిటి..

నాకు 22 ఏళ్ళు. 85 కేజీల బరువున్నాను. 5:2 డైట్‌ ప్లాన్‌ ద్వారా బరువు తగ్గమని ఎవరో సూచించారు. ఇది మంచిదేనా?

- అమూల్య, నెల్లూరు

ఓ రకమైన ఇంటర్మీటెంట్‌ ఫాస్టింగ్‌ లాంటిదే 5:2 డైట్‌ ప్లాన్‌ కూడా అని చెప్పవచ్చు. ఈ విధానంలో వారంలో ఐదు రోజులపాటు సమతులాహారం తీసుకొంటూ ఏదైనా రెండు రోజులు (పక్కపక్క రోజులు కాకుండా) బాగా క్యాలరీలు తగ్గించి తీసుకొంటారు. దీనివల్ల ప్రత్యేకమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఆధారాలు లేవు. మీ జీవన శైలికి ఇది దీర్ఘకాలికంగా కొనసాగించేందుకు అనువైనదైతే ఈ పద్ధతిలో ఆహారం తీసుకొని బరువు తగ్గేందుకు ప్రయత్నించ వచ్చు. బరువు తగ్గడం అనేది మాత్రమే కొలమానంగా పెట్టుకొని జీవనశైలి తాత్కాలికంగా మార్చుకోవడం కంటే కూడా ... దీర్ఘకాలికంగా ఆరోగ్య ప్రయోజనాల కోసం సరైన ఆహారపు అలవాట్లు, జీవనశైలి అనుసరిస్తే బరువు కూడా క్రమంగా నియంత్రణలోకి వస్తుంది. ఆరోగ్యానికీ ఎలాంటి ఇబ్బందీ ఉండదు కూడా. ఈ 5:2 డైట్‌ చేద్దామనుకునే ముందు నిపుణులతో సంప్రదించడం అవసరం. వారంలో ఐదురోజులు ఎటువంటి సమతులాహారం ఎంత మొత్తంలో తీసుకోవాలో తెలుసుకోవాలి. అలాగే మిగతా రెండు రోజులు చాలా తక్కువ క్యాలరీల ఆహారం తీసుకున్నా నీరసం రాకుండా ఎలా చూసుకోవాలి... తదితరాలన్నీ నిపుణుల పర్యవేక్షణలో మాత్రమే చేయడం శ్రేయస్కరం.


నాకు యాభై ఏళ్ళు. అప్పుడప్పుడు ఆల్కహాల్‌ తీసుకొంటాను. ఆల్కహాల్‌ వల్ల బీపీ పెరుగుతుందా?

- వెంకట్‌, గుంటూరు

అధికంగా మద్యం సేవించడం వల్ల థయామిన్‌, రిబోఫ్లావిన్‌, నియాసిన్‌, పాంటోథెనిక్‌ ఆసిడ్‌, పిరిడాక్సిన్‌, కొబాలమిన్‌, ఫోలిక్‌ ఆసిడ్‌, విటమిన్‌ సి, మెగ్నీషియం, క్యాల్షియం, వంటి వివిధ రకాల పోషకాల లోపం రావచ్చు. దీనివల్ల కేవలం చర్మ కాంతి తగ్గడమే కాక నీరసం, విసుగు రావడం, ఆందోళనగా ఉండడం, డిప్రెషన్‌, ఆకలి తగ్గిపోవడం, నిద్ర పట్టకపోవడం, రక్తహీనత లాంటి రుగ్మతలు ఏర్పడతాయి. ఆల్కహాల్‌ తీసుకున్నప్పుడు తాత్కాలికంగా, దీర్ఘకాలికంగా కూడా శరీరంలో కొన్ని మార్పులు సంభవిస్తాయి. ఆల్కహాల్‌ తీసుకున్నప్పుడు రక్తనాళాలు సంకోచిస్తాయి. కాబట్టి రక్త ప్రసరణ సరిగా చేసేందుకు గుండె అధిక శ్రమకు లోనవుతుంది. ఇలా తరచూ ఆల్కహాల్‌ సేవించడం వల్ల రక్తపోటు అధికమై దాని వల్ల స్ట్రోక్‌, గుండెజబ్బులు, మూత్రపిండాల వ్యాధులు లాంటివి వచ్చే అవకాశం పెరుగుతుంది. అంతేకాదు కాలేయ సంబంధిత ఇబ్బందులు కూడా వస్తాయి.


ఎండాకాలంలో ఆరోగ్య పరిరక్షణ కోసం ఎటువంటి ఆహారం తీసుకోవాలి?

- రాగశ్రీ, హైదరాబాద్‌

book7.2.jpg

ఎండాకాలంలో అధిక ఉష్ణోగ్రతల వల్ల మన శరీరం నుండి నీరు ఎక్కువగా పోతుంది. చెమట బాగా పట్టేవారికి ఆ నీటితో పాటు ఖనిజ లవణాలు కూడా పోతాయి. కాబట్టి ఎప్పటికప్పుడు వీటిని తిరిగి భర్తీ చేసుకునేలా ఆహారం ఉండాలి. ఇలా కానప్పుడు శరీర ఉష్ణోగ్రత పెరిగి, వడదెబ్బ తగలడం, కళ్ళు తిరిగి పడిపోవడం లాంటివి జరుగుతాయి. వీటిని నివారించాలంటే రోజుకు కనీసం మూడు లీటర్ల నీరు ఏదో ఓ రూపంలో తీసుకోవాలి. మజ్జిగ, కొబ్బరి నీళ్లు, నిమ్మకాయ నీళ్లు, భోజనంలో సాంబార్‌, రసం లేదా సూప్స్‌ తీసుకోవడం మొదలైనవన్నీ ఉపయోగ పడతాయి. నీరు అధికంగా ఉండే పుచ్చ, కర్బుజా, ద్రాక్ష వంటి పండ్లను కూడా రోజుకు ఒకటి రెండుసార్లు తీసుకుంటే మంచిది. కారం, మసాలాలు ఉన్న ఆహారం తగ్గించాలి. నూనెలు ఎక్కువగా ఉండే వేపుళ్ళు, బేకరి ఫుడ్స్‌, ఫాస్ట్‌ ఫుడ్స్‌ మొదలైనవి తగ్గించాలి లేదా మానెయ్యాలి. వ్యాయాయం చేసేవారైతే తప్పని సరిగా వ్యాయామానికి ముందు అరలీటరు తరువాత అరలీటరు నీళ్లు తీసుకోవాలి. గంట కంటే ఎక్కువ వ్యాయామం చేస్తే ఎలకో్ట్రలైట్స్‌తో కూడిన నీళ్లు తీసుకోవడం మంచిది.

డా. లహరి సూరపనేని

న్యూట్రిషనిస్ట్‌, వెల్‌నెస్‌ కన్సల్టెంట్‌

nutrifulyou.com


ఈ వార్తలు కూడా చదవండి:

పోస్టల్‌ ఖాతాలో నెలకు రూ.2500 వేస్తారట..!

కేంద్ర పెట్టుబడి సాయం రూ.18 వేలకు పెంచాలి

మెట్రో రైల్‌పై బెట్టింగ్‌ యాప్‌ల ప్రచారం ఆపండి

Read Latest Telangana News and National News

Updated Date - Apr 06 , 2025 | 11:20 AM